మంచిర్యాల ఏసీసీ/మంచిర్యాలటౌన్, సీసీసీ నస్పూర్/ జన్నారం/నెన్నెల/వేమనపల్లి/ చెన్నూర్ రూరల్/రామకృష్ణాపూర్/తాండూర్/మందమర్రి/కోటపల్లి/శ్రీరాంపూర్/ కాసిపేట, బెల్లంపల్లి టౌన్/కన్నెపల్లి, సెప్టెంబర్ 11 : వినాయక చవితి సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. డప్పు చప్పుళ్లతో చిందులు వేస్తూ మండపాల వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. మొదటి రోజు ప్రత్యేక పూజలుచేశారు. వివిధ రకాల ప్రసాదాలను నైవేద్యంగా ప్రసాదించారు. మండపాలను రంగురంగుల విద్యుద్దీప కాంతులతో అలంకరించారు. పాత మంచిర్యాలలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో టీఆర్ఎస్ యువ నాయకులు తూముల నరేశ్ ఏర్పాటు చేసిన గణనాథుడికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ పూజలుచేశారు. హైటెక్‌సిటీ, రెడ్డి కాలనీల్లోని మండపాల వద్ద వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీ ఎచ్పీఎల్ పెట్రోల్ పంపు వద్ద శుక్రవారం ఆధ్యాత్మిక సేవకుడు మల్రాజు రవీందర్ రావు సుమారు 300 మట్టి వినాయక విగ్రహాలను, హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలో 100 విగ్రహాలను క్లబ్ నాయకులు పంపిణీ చేశారు.
మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివాకర్‌రావు
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని బస్టాండు ఎదుట ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు చేతుల మీదుగా వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమ్మరి కులస్తులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్ నల్ల శంకర్, టీఆర్ఎస్ నాయకులు గొంగళ్ల శంకర్, కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రమేశ్, గంగాధరి తిరుపతి, సలిగంటి రమేశ్, శంకర్శేషయ్య, తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లిలో ఎమ్మెల్సీ దంపతుల పూజలు
కోటపల్లి, సెప్టెంబర్ 11 : కోటపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. కోటపల్లిలోని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ దంపతులు వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.
కోల్‌బెల్ట్ ఏరియాలో..
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 11: సీసీసీ నస్పూర్ బంగ్లాస్ ఏరియాలో ఏర్పాటు చేసిన గణేశ్ మండలి వద్ద శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సురేశ్ దంపతులు బొజ్జ గణపయ్యకు పూజలు చేశారు. శ్రీరాంపూర్, తాళ్లపల్లి, సింగాపూర్ ఏరియాలోని కార్మికుల కాలనీల్లో వినాయక మండపాల్లో ఘణనాథులు కొలువు దీరారు. శ్రీరాంపూర్ ఓసీపీపై ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తంరెడ్డి, ఎస్ఆర్పీ 3 సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రెడ్డి దంపతులు వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. నస్పూర్ చైర్మన్ ప్రభాకర్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి పలు మండపాల్లో పాల్గొని పూజలు చేశారు.
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 70 మండపాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో శ్రీవిజయగణపతి దేవాలయం, ఆర్కేపీ సీహెచ్‌పీ, బీజోన్ వర్తక వ్యాపారుల సంఘం, పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు కార్మిక కాలనీలోని గల్లీగల్లీలో గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. రామకృష్ణాపూర్ సీహెచ్‌పీలో కొలువుతీరిన గణేశ్‌ని వద్ద ఏజీఎం జగన్మోహన్రావు పూజలు చేశారు. ఆయన వెంట ఇన్చార్జి ఇంజినీర్ చంద్రమౌళి, సూపర్ వైజర్ రమణారావు, పిట్ కార్యదర్శులు జే.శ్రీనివాస్, సంజీవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తాండూర్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరీ ఆలయంలో మట్టి, సహజ రంగులతో తీర్చిదిద్దిన గణపతి ప్రతిమను ప్రతిష్టించారు. ఐబీలోని శ్రీ గణేష్ మండలి ఆధ్వర్యంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అభినవ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్‌కుమార్ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. మందమర్రి పట్టణం పాతబస్టాండ్ ఏరియాలో మేము సైతం సంస్థ సభ్యులు, ఆర్య వైశ్య సంఘం, ప్రజాసేవా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు.