
గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు వేసిన ఘనత కేసీఆర్‌దే..
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 3 : ఆదివాసీల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని పిట్టలవాడలో ఉన్న ఆదివాసీ భవన్లో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, ప్రహరీ నిర్మాణాలకు శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. ఏడేండ్లలో గిరిజన గ్రామాలకు సైతం బీటీ రోడ్లు వేసి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆదివాసీభవన్‌లో షెడ్డు నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీత, నాయకులు దమ్మపాల్, యూనిస్ అక్బానీ, నారాయణ, సోనేరావ్, ఇశ్రు పటేల్, జంగు పటేల్, సంజీవ్‌గౌడ్ పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో..
పట్టణంలోని 14వ వార్డు పోలీస్ కాలనీలో హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి తనవంతు సహాయం అందిస్తానన్నారు. విరాళంగా రూ.70 వేల నగదును ఆలయకమిటీ సభ్యులకు అందించారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతున్ని ప్రార్థించామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నరేశ్, వికాస్, సురేశ్, రవి, దేవదాస్, ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.