
తాంసి, ఆగస్టు 31: విద్యార్థులను బడికి పంపాలని ఎంపీపీ సురుకుంటి మంజుల శ్రీధర్‌రెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. మండలంలోని బండలనాగాపూర్లో కప్పర్ల జడ్పీఎస్ఎస్కు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మంగళవారం అవగాహన ర్యాలీ తీశారు. గ్రామస్తులు ఉపాధ్యాయులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు చదువు చెప్పాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకన్న, ప్రధానోపాధ్యాయుడు కిష్టయ్య పాల్గొన్నారు.
గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ప్రజాప్రతినిధులు వీధుల్లో తిరుగుతూ డప్పు చాటింపుతో అవగాహన కల్పించారు. పిల్లలను పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం దేవ్‌రావ్, ఎంపీటీసీ సిడాం నాగోరావ్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పాఠశాలల్లో పరిశుభ్రత పనులు
మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో పంచాయతీ సిబ్బంది పరిశుభ్రత పనులు చేపట్టారు. ట్రాక్టర్ ద్వారా చెత్తాచెదారాన్ని డంప్ యార్డుకు తరలించారు. పిచ్చి మొక్కలు తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. మండల పంచాయతీ అధికారి జీవన్‌రెడ్డి, ఇన్చార్జి కార్యదర్శి అంజయ్య, సర్పంచ్ సురేందర్‌యాదవ్ పనులను పరిశీలించారు. అనంతరం వారు పలు కాలనీల్లో పర్యటించారు. నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. తరగతి గదుల్లో శానిటైజ్ చేయడంతో పాటు ఆవరణలో పిచ్చిగడ్డిని తొలగించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఈవో సత్యనారాయణ పాల్గొన్నారు.