
ఆదిలాబాద్, ఆగస్టు 31 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పాటు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతున్నది. పలు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువకాగా, అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద తో జలపాతాల్లో నీటి ప్రవాహం పెరిగింది. నిర్మల్ జిల్లాలో 57.6 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఎక్కువగా కుంటాలలో 197.6 మీ.మీ, భైంసాలో 155.8, బాసరలో 117.5, కుభీర్‌లో 116.4, సారంగాపూర్‌లో 81.6, మథోల్లో 68.2, తానూర్‌లో 64.6, కడెంలో 32.4 మిల్లీ మీటర్లు కురిసింది. జిల్లాలో మంగళవారం వరకు 1127.6 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 1010 మిల్లీ మీటర్లు నమోదైంది. కుభీర్‌లో దార్క్బీర్ చెరువుకు గండి పడింది. ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం 31.6 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తాంసిలో 57 మి.మీ, బోథ్‌లో 47.4, ఆదిలాబాద్ అర్బన్‌లో 38.6, భీంపూర్‌లో 36.8, ఇంద్రవెల్లిలో 38.8 మిల్లీ మీటర్ల వర్షం పడింది. వానకాలం సీజన్లో జిల్లాలో మంగళవారం వరకు 1126 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా 1157 మిల్లీ మీటర్లు కురిసింది.
ప్రాజెక్టుల్లోకి వరద..
భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతున్నది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 ఫీట్లు కాగా ప్రస్తుతం 696. 575 ఫీట్ల మేర నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 4166 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 360.56 మీటర్లు ఉండగా ప్రస్తుతం 360.27 మీటర్లు నిల్వ ఉంది. ప్రాజెక్టులకు 1526 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. ఒక గేటును ఎత్తిన అధికారులు 2848 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. గడ్డెన్న వాగు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు కాగా ప్రస్తుతం 35.4 మీటర్లు ఉంది. ప్రాజెక్టులోకి 1114 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, ఒక గేటు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మత్తడి వాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 276.80 మీటర్లు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 120 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. సాత్నాల పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 285.65 మీటర్లు ఉంది. ప్రాజెక్టులోకి 320 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది.
పిడుగుపడి ఇద్దరి మృతి
ఆదిలాబాద్ జిల్లా లో పిడుగులు పడడంతో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. తలమడుగు మండలం బరంపూర్‌లో పిడుగుపడి మహారాష్ట్రకు చెందిన కూలీ సంగీత (31) మృతి చెందింది. కౌసల్య, సుజాత, అర్జున్‌కు గాయాలయ్యాయి. బాధితులు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. సిరికొండ మండలం సౌత్మరిలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా పిడుగుపడడంతో గంప భూమన్న, లక్ష్మి దంపతులకు గాయాలయ్యాయి. ఇందులో లక్ష్మి(30) మృతిచెందింది. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ గడ్డెన్న వాగు ప్రాజెక్టును సందర్శించి అధికారులకు సూచనలు చేశారు.
చౌటపల్లిలో మేకలు ..
మండలంలోని చౌటపల్లిలో పోచంపల్లికి చెందిన బొట్లకుంట రాజమల్లు మేకలమందపై పిడుగు పడింది. దీంతో నాలుగు మేకలు మృతి చెందాయి. తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నీల్వాయి వాగుపై ఏర్పాటు చేసిన హైలెవెల్ వంతెన పూర్తయినా ఇరువైపులా అప్రోచ్ రోడ్డు వేయక పోవడంతో రోడ్డంతా బురదగా మారి రాకపోకలు అంత రాయం ఏర్పడింది. బద్వెల్లి, చామనపల్లి వాగులు ప్రవహిస్తుండడంతో రవాణాకు అంతరాయం తప్పలేదు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో మోస్తరు వర్షం కురిసింది.