
ఆదిలాబాద్, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఆగస్టు 31 : కొవిడ్-19 కారణంగా ఏడాదిన్నర కిందట మూతపడిన విద్యాసంస్థలు నేటి(బుధవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. అంగన్వాడీ కేంద్రాలతోపాటు కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించనున్నారు. ఆన్లైన్ తరగతుల కారణంగా విద్యార్థులు పలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. చదువులకు ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తున్నది. అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, కళాశాలల ప్రారంభం విషయంలో కలెక్టర్లు అధికారులతో సమావేశమై విద్యార్థులు ఇబ్బందులు పడుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. పాఠశాలలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది స్కూళ్లను శుభ్రపర్చగా, ఉపాధ్యాయులు ఏర్పాట్లు చూస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అధికారులు పంపిణీ చేయగా, మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం కూడా పాఠశాలలకు చేరవేశారు. పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడంతోపాటు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. మైదానాల్లో గుంపులుగా తిరగకుండా చూస్తారు. పాఠశాలల్లో ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా తమ పిల్లలను స్కూళ్లకు పంపాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. పిల్లల చదువులను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు పంపడానికి సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,296 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 2,49,428 మంది, 594 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, 1,59,105 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ప్రభుత్వ కళాశాలలు 87, ప్రైవేట్ కళాశాలలు 68 ఉండగా, 56,417 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతులకు హాజరుకానుండగా, అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. శానిటైజేషన్, పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, తదితర ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
అంగన్వాడీల నిర్వహణకూ ఏర్పాట్లు..
అంగన్వాడీ కేంద్రాలను సైతం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించగా, కేంద్రాల టీచర్లు, సహాయకులు సమాయత్తమవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,124 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 1,68,861 మంది పిల్లలు ఉన్నారు. చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు రానున్న నేపథ్యంలో ముగ్గులు, మామిడి తోరణాలతో అలంకరించి, పండుగ వాతావరణం తలపించేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సూచించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను తెరిచి ఉంచాలని, టీచర్లు, ఆయాలు ప్రతిరోజూ విధులకు హాజరు కావాలని ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారులకు అందించే భోజనం, సరుకుల పంపిణీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. చీపుర్లు, సబ్బులు, శానిటైజర్లు, స్టేషనరీకి సంబంధించిన వస్తువులు కొనేందుకు ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఖాతాలో రూ.500 ప్రభుత్వం జమ చేయనున్నది.
హైకోర్టు మార్గదర్శకాలు..
విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు పలు మార్గదర్శకాలను సూచించింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని, ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్య లు తీసుకోవద్దని పేర్కొన్నది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ బోధనపై విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చని తెలిపింది. ప్రత్యక్ష బోధన నిర్వహిం చే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని పే ర్కొన్నది. వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాల ని, విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని హైకోర్టు తెలిపింది. గురుకులాలు, వసతిగృహాలు తెరవద్దని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతున్నదని, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మూడో దశ పొంచి ఉందని హెచ్చరించింది. విద్యాసంస్థలు తెరువకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయని, ప్రభుత్వం రెండింటినీ సమన్వయం చేసి చూడాలని సూచించింది.