హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ జెండా ఎగరాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రాష్ట్రంలో పాలన సాగించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం తిరుమలలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలని ప్రత్యేక పూజలు చేసారు. రామగుండం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని తనకు మరోమారు ప్రసాదించాలని వేడుకొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ మరోసారి ప్రజల సంక్షేమం కోసం సేవ చేసే శక్తి ప్రసాదించాలని కోరినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని అన్నారు. రామగుండం నియోజకవర్గ అభ్యర్థిగా తనకు టికెట్ కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గత ఎన్నికల్లో రామగుండం ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని, వారి సహకారంతో కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని పేర్కొన్నారు. మళ్లీ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని, రామగుండం ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించి, ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కలిగించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించానన్నారు.