ఇంతకు ముందు ఆఫీస్ మీటింగ్ అంటే? చక్కగా తయారై గంట ముందే ఆఫీస్‌కు చేరుకోవడం, అందరికన్నా ముందే వెళ్లి కాన్ఫరెన్స్ రూంలో కూర్చోవడం కామన్‌గా కనిపించేది. మరి, ఇప్పుడు.. స్మార్ట్ ఫోన్ తీయడం.. జూమ్ లింక్ క్లిక్ చేయడం.. మీటింగ్‌లో పాల్గొనడం.. ఇదీ వ్యవహారం. కార్పొరేట్ వరల్డ్‌లో ఇదే జరుగుతున్నది. కంపెనీలు కూడా ‘జూమ్’ సేవల్ని అధికారికంగా వాడేస్తున్నాయ్.
వర్చువల్ మీటింగ్స్‌ను విప్లవాత్మక రీతిలో అందిస్తున్న జూమ్ మరో సరికొత్త అప్డేట్తో ముందుకొచ్చింది. అదే.. ‘ఏఐ అవతార్’. ఇప్పుడంతా ఏఐ ట్రెండింగ్ నడుస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు తమ రూపంలోనే అవతార్‌ని జూమ్‌లో సృష్టించొచ్చు. ఇలా క్రియేట్ చేసిన అవతార్ మీ తరఫున, మీరే మాట్లాడుతున్నట్టుగా సహోద్యోగులకు, బృందానికి ఏదైనా సమాచారాన్ని చేరవేస్తుంది.
ఉదాహరణకు మీరు టీమ్ లీడర్ అనుకుంటే.. ఈ అవతార్‌తో మీ టీమ్‌ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయొచ్చు. అయితే, పదేపదే అందర్నీ మీటింగ్‌కి పిలవడం కొన్నిసార్లు వీలు పడకపోవచ్చు. అలాంటప్పుడు మీ ‘ఏఐ అవతార్’ ప్రత్యేకంగా టీమ్‌లో ప్రతి ఒక్కరికీ చేరుతుంది.
మీరు వారికి చెప్పాలనుకున్న విషయాన్ని సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తుంది. అదీ అచ్చంగా మీ వాయిస్‌తోనే! జూమ్‌లోని ‘క్లిప్స్’ ఫంక్షన్ ద్వారా షార్ట్ వీడియోని రికార్డ్ చేసి అవతార్ ద్వారా పంపొచ్చు. కార్పొరేట్ కంపెనీల్లో సమాచార మార్పిడికి ఇదో వినూత్నమైన విధానమని జూమ్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ అవతార్ కేవలం షార్ట్ మెసేజ్‌లు పంపేందుకేనట. వీటితో ఎలాంటి వర్చువల్ మీటింగ్స్ నిర్వహించలేరు. ఎలాంటి సైబర్ దాడులకు వీలు లేకుండా.. ఈ అవతార్ సదుపాయాన్ని వాడుకునేలా సెక్యూరిటీ వలయాన్ని జూమ్ క్రియేట్ చేసింది. త్వరలోనే ఈ అవతార్ ఫీచర్ జూమ్‌లో సందడి చేయనుంది.