చెల్లె ఏడుస్తున్నది. ‘అమ్మా!’ అని పిలిస్తే రాలేదు. ఏం చేయాలో తోచలేదు. అప్పటికప్పుడు ఓ పాట అల్లింది. చెల్లె ఊరుకున్నది. మూడేండ్ల వయసులో మొదలైన ఆ పాటల ప్రయాణం ఎన్నో మైలురాళ్లు దాటింది. ఒకవైపు సినిమా, మరోవైపు జానపదంతో సరికొత్త సంగీత ప్రపంచాన్ని సృష్టించుకున్నది స్ఫూర్తి జితేందర్.
అమెరికా వెళ్లి, వెస్టర్న్ మ్యూజిక్‌లో డిప్లొమా చేసేందుకు సిద్ధమవుతున్నాను. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాను. టాప్-10 హాలీవుడ్ సింగర్స్‌లో ఇండియానుంచి నేను ఉండాలన్నదే నా లక్ష్యం. దానిద్వారా గ్రామీ అవార్డు సాధించాలన్నదే నా తపన. అందుకోసమే నిరంతరం శ్రమిస్తున్నాను. అవకాశం వస్తే, నాకు ఇష్టమైన జానపదాన్ని హాలీవుడ్‌కు కూడా పరిచయం చేస్తా.
తాతలు హరికథా కళాకారులు. నాన్న సినిమా దర్శకుడు. అమ్మ కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యురాలు. మామయ్య సినిమా ప్లేబ్యాక్ సింగర్. వీరందరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా, జానపద రంగాల్లో రాణిస్తున్నది స్ఫూర్తి జితేందర్. కళను సజీవంగా ఉంచడానికి ఆమె తనవంతుగా ప్రయత్నిస్తున్నది. చిన్న వయసులో ఐటమ్ సాంగ్ పాడిన గాయనిగా రికార్డు సృష్టించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న స్ఫూర్తి జితేందర్ మనసులోని మాట!
నా గురించి కథనం
అప్పుడు నాకు మూడేండ్లు. చెల్లె ఏడుస్తుంది. అమ్మను పిలిస్తే పలుకలేదు. నాన్న ఇంట్లో లేరు. ఏం చేయాలో తోయలేదు. ఎలాగైనా చెల్లెను ఊరుకోబెట్టాలె అని అనుకున్నా. అప్పటికప్పుడు ఓ పాట అల్లిన. ‘చెల్లీ బంగారు చెల్లీ.. ఊరుకోవమ్మా తల్లీ’ అనేది ఆ పాట. నేను చెల్లెను ఊరుకోబెట్టిన విషయం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నేను పాట పాడి ఊరుకోబెట్టానన్న సంగతి అక్కడ హైలైట్ అయ్యింది. మల్ల తెల్లారి ‘డెక్కన్ క్రానికల్’ పేపర్లో వార్త వచ్చింది. నాకేదో తెలియని కిక్. అట్లా నాకు తెలియకుండానే పాటతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో మలుపులు.
ప్రపంచ రికార్డు
మా నాన్న యాదగిరి జితేందర్ సినిమా దర్శకుడు. యాదగిరి మా ఇంటిపేరు. పూరి జగన్నాథ్ వాళ్ల తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నాన్న ‘యమహో యమా’ సినిమా తీస్తున్నారప్పుడు. ఆ సినిమాలో ఒక పాట నాతో పాడించారు. అప్పుడు నా వయసు పదకొండేండ్లు. అంత చిన్న వయసులో పాడటం ఒక మధురానుభూతి. సినిమాపరంగా కూడా అదొక పెద్ద ప్రయోగమే అనుకోవచ్చు. పాట బాగా హిట్ అయ్యింది. నాకూ, సినిమాకు మంచి పేరు తీసుకొచ్చింది. అంత చిన్న వయసులో సినిమాకు పాడటం వల్ల ‘తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో నా పేరు ఎక్కింది. స్కూల్ రికార్డులు మాత్రమే తెలిసిన నాకు, వరల్డ్ రికార్డు గొప్ప అచీవ్మెంట్.
అవకాశం ఎలా వచ్చిందంటే?
నాన్న దర్శకుడే కావచ్చు. అది నాకు సినిమాలో అవకాశం ఇచ్చేంత వరకే పనిచేస్తుంది. కానీ, నా టాలెంట్ ఏంటో నిరూపించుకుంటేనే ఫీల్డ్‌లో ఉంటాను. మెరుగైన అవకాశాలు వస్తాయి. ‘యమహో యమా’ సినిమా కమర్షియల్ హిట్ కావడంలో నేను పాడిన పాట కూడా ఓ కారణమే అని గర్వంగా చెప్పగలను. ‘యమహో’ సినిమాకు బోలె శావలి సంగీత దర్శకుడు. అప్పుడేదో పండగ ఉన్నది. మమ్మల్ని ఆహ్వానిస్తే ఫ్యామిలీ అంతా వెళ్లాం. శావలిగారు ఒక పాటకు సంబంధించి నాన్నకు ట్యూన్ వినిపిస్తున్నారు. దూరంగా ఉన్న నా చెవిలో పడింది ఆ ట్యూన్. ఇంటికెళ్లాక దాన్ని హమ్ చేస్తుంటే నాన్న విన్నారు. అప్పటివరకు ‘ఏదీ మళ్లొకసారి పాడమ్మా’ అని పాడించారు. అలా శావలికి విషయం చెప్పి, నాతో ఆ సినిమాకు పాడించారు. దాని తర్వాత ‘కిక్-2’ సినిమాకు టైటిల్ సాంగ్ పాడే అవకాశం వచ్చింది. ఇలా దాదాపు 75కు పైగా సినిమా పాటలు పాడాను.
జానపదం పాడగలనా?
సినిమాల్లో పాడుతుండగానే జానపదాల్లో అవకాశాలు వచ్చాయి. యూట్యూబ్‌లో 2019నుంచి ఫోక్ సాంగ్స్ పాడుతున్నాను. వాస్తవానికి ఫోక్ జోనర్లో పాడగలనో లేదో కూడా అప్పటివరకు తెలియదు. లిరిక్స్కూడా ప్యూర్ తెలంగాణలో ఉంటాయి కాబట్టి, నావల్ల అవుతుందో లేదో అని ఆ జోలికి వెళ్లలేదు. కానీ అన్నీ మనం అనుకున్నట్లే అవుతాయా? మదీన్ ఎస్కే గారితో నేను కలిసి పనిచేశాను. ‘స్ఫూర్తీ! సైటీవీలో పాడటానికి ఒక కొత్త గాయని కోసం చూస్తున్నాం. నీ గొంతు బాగా సూట్ అవుతుంది’ అన్నారాయన. నేనేం పాడతానో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ‘ఓకే’ అన్నాను. అలా ‘ధన్ ధన ధన్ ధన ధనారే’ ఒరిజినల్ ఫోక్ పాడాను. అది 100 మిలియన్ వ్యూస్‌తో సూపర్ హిట్ అయ్యింది.
ఫోక్ వదులుకోను
ఫోక్‌ను నేను ఒక ప్రయోగంగానే భావించాను. ‘ధన్ ధన ధన్ ధన ధనారే’కు వచ్చిన స్పందన తర్వాత ఇక జానపదాన్ని వదులుకోవద్దని అనుకున్నాను. అవకాశాలు చాలా వచ్చాయి. ఆ తర్వాత నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ ‘యాడవున్నడో ఎన్నెల బావ’. ‘సిరిమువ్వ మ్యూజిక్’ద్వారా ఈ పాట రిలీజైంది. ఇక ఎక్కడా ఆగలేదు. ‘ఉంగరాల జుట్టోడా’, ‘గుండె జల్లుమన్నదే బావా’, ‘నీతో నీవే నీలో నీవే నేస్తమై మాటాడుకో యోగిలా’ అనే మోటివేషనల్ సాంగ్ పాడాను. సైటీవీద్వారా పాడిన ఈ పాట కూడా నాకు మంచిపేరు తెచ్చింది. ధింతానా మ్యూజిక్ ద్వారా ‘నా మనసుకేమో మాయరోగమూ రాజుగా’, మంచిర్యాల్ రాగ ట్యూన్స్ ద్వారా ‘ఒకసారి రావా బావా ఒడిలోకి చూడాబావా’, పీకేఆర్ వరల్డ్ ద్వారా ‘నీ దగ్గరి సుట్టమే సిలకా నా మదికేసినవ్ మెలకా’.. వంటి చాలా జానపదాలు పాడాను. వీటిలో దాదాపు అన్నీ హిట్ సాంగ్సే కావడం విశేషం.
నాది వెస్టర్న్ మ్యూజిక్
చాలామంది నన్ను తారీఫ్ చేస్తుంటారు. ‘ఆల్రెడీ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫేమస్ అయ్యావు. హిట్స్కూడా ఉన్నాయి. అయినా నువ్వు సినిమా నుంచి ఫోక్సాంగ్స్ వైపు వెళ్లావు ఎందుకు?’ అంటారు. మామూలుగా అందరూ ఫోక్లో రాణించిన తర్వాత సినిమాకోసం ప్రయత్నిస్తుంటారు. నేనేమో ఆల్రెడీ సినిమాల్లో రాణించి జానపదానికి వచ్చాను. కాబట్టే వాళ్లు అలా అంటుంటారు. నాక్కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఎందుకంటే బేసిగ్గా నాది సినిమా ప్లేబ్యాక్ సింగింగ్కూడా కాదు. పక్కా వెస్టర్న్ మ్యూజిక్. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి వెస్టర్న్ వోకల్ మ్యూజిక్స్‌లో ఎనిమిది గ్రేడ్లు పూర్తిచేశాను. చరితాబెన్ గారు ఈ శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు లాస్ ఏంజిల్స్ కాలేజీలో డిప్లొమా చేయాల్సి ఉంది.
ర్యాప్ సాంగ్స్ రాస్తుంటా
ఫోక్ సాంగ్స్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. నేటివిటీ ఉన్న పదాలు పాడుతుంటే పల్లెల్లో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. వీటితో నేను ఇబ్బంది పడ్డ పరిస్థితి ఇప్పటివరకు రాలేదు, రాదు కూడా. ఎందుకంటే, నేను ఇష్టంగా చేస్తున్న పని ఇది. ప్రేమించి పాడుతున్న పాటలు ఇవి. నా మెయిన్ కెరీరే సింగింగ్. దాంట్లో ఫోక్కూడా ఒక భాగం. సింగింగ్‌లో హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. సినిమా, ఫోక్ కాకుండా ఇంగ్లిష్ పాటలు రాసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటాను. ఇవన్నీ పూర్తి ర్యాప్ సాంగ్స్. నేను ఏది పాడినా అమ్మానాన్నలు బాగా ఎంకరేజ్ చేస్తారు. చదువు కాకుండా, మ్యూజిక్ మెయిన్ కెరీర్‌గా ఉండాలన్నది నాన్న నిర్ణయమే. ఆయన నా బెస్ట్ సపోర్టర్. ప్రతీ నిర్ణయం ఆయన్ని అడిగిన తర్వాతే తీసుకుంటాను.
కళా వారసత్వం
నేను ప్రస్తుతం బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఎస్సీ చేస్తున్నాను. మా తాతముత్తాతలు హరికథ, మంగళహారతి పాటల్లో పేరుగాంచిన వాళ్లు. నాన్న వాళ్ల తాత నర్సింహరాజు హరికథలో దిట్ట. ఆయన హరికథ చెప్పారంటే.. ఊరు ఊరంతా వచ్చి వినేవాళ్లట. మా అమ్మవాళ్ల తరపు కూడా కళాకారులే. కళా నేపథ్యం ఉండటం వల్లే నేను చిన్నతనంలోనే పాటలకు దగ్గరయ్యానేమో. అమ్మకు కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం ఉండేది. నాన్న వాళ్లది ఖమ్మం దగ్గర రామకృష్ణాపురం. నేను అక్కడే పుట్టాను. నేను పుట్టిన మూడు నెలలకే మా వాళ్లు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు.
-దాయి శ్రీశైలం