బెంగళూరు: గర్భవతి అయిన ఒక మహిళా కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఒంటరిగా ఉన్నది. ఒక వ్యక్తి ఫిర్యాదు కోసం అక్కడకు వచ్చాడు. సిబ్బంది లేకపోవడంతో తర్వాత రావాలని ఆమె చెప్పింది. ఆగ్రహించిన అతడు ఒక రాడ్ పట్టుకుని వచ్చి ఆ మహిళా పోలీస్ తలపై పలుమార్లు కొట్టాడు. (Pregnant cop attacked) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 16న ఉదయం 5.30 గంటల సమయంలో ఒక వ్యక్తి ఫిర్యాదు కోసం మెజెస్టిక్ రైల్వే పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆ సమయంలో గర్భవతి అయిన మహిళా కానిస్టేబుల్ శిల్ప మాత్రమే అక్కడ ఉన్నది. ఫిర్యాదు స్వీకరించడానికి వేరే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆ వ్యక్తిని తర్వాత రమ్మని ఆమె కోరింది.
కాగా, ఆ వ్యక్తి రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు. అయితే కొద్దిసేపటికే ఐరన్ రాడ్తో తిరిగి వచ్చాడు. రైల్వే పోలీస్ స్టేషన్లో ఒంటరిగా ఉన్న మహిళా కానిస్టేబుల్ శిల్పపై అతడు దాడి చేశాడు. ఐరన్ రాడ్తో ఆమె తలపై పలుమార్లు కొట్టాడు.
మరోవైపు గర్భవతి అయిన మహిళా కానిస్టేబుల్ శిల్ప ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను చికిత్స కోసం తొలుత మణిపాల్ ఆసుపత్రికి, ఆపై సుగుణ ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళా పోలీస్ వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు.