జుట్టు రాలడం, చుండ్రులాంటి సమస్యలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. వీటికి వేప దివ్యౌషధంలా పనిచేస్తుంది. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అపారం. ఇవి చుండ్రును దరిచేరనీయవు. తలపై చర్మం పొడిబారకుండా చూస్తాయి. ఇన్ ఫెక్షన్లను అదుపులో ఉంచుతాయి. ఇందులోని ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ తదితరాలు జుట్టు రాలకుండా చూస్తాయి. క్రమం తప్పకుండా వేపముద్దను తలకు పెట్టుకోవడం వల్ల ఆ భాగంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. జుట్టు బలంగా, కాంతిమంతంగా తయారు అవుతుంది. ఇన్ని సుగుణాలున్న వేపను జుట్టుకు మాస్క్‌గా ఎలా వేసుకోవాలంటే.. రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఓ ఇరవై వేపాకులు సిద్ధం చేసుకోవాలి . ఆకులను ముద్దగా నూరి, పెరుగుతో కలిపి వెంట్రుకల కుదుళ్ల నుంచి చివర్ల్ల వరకూ రాసుకోవాలి. తర్వాత తలపైభాగంలో ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. అరగంట ఆగి గోరు వెచ్చని నీటిలో తక్కువ గాఢత కలిగిన షాంపూతో శుభ్రంగా కడిగేయాలి. పెరుగు స్థానంలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక చెంచా తేనెతోనూ మాస్క్ తయారు చేసుకోవచ్చు.