చిన్నారులు ఎదిగేవరకూ గండమే. నిత్యం ఏదో ఓ సమస్య వేధిస్తూ ఉంటుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కన్నవారిదే. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. మూర్ఛవ్యాధి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఫెబ్రైల్ ఫిట్స్
పిల్లలకు తరచుగా వచ్చే వ్యాధి ఫెబ్రైల్ ఫిట్స్. సాధారణంగా ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వయసు పిల్లలకు వచ్చినా.. 18 నెలల్లోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇదేం ప్రమాదకరమైన వ్యాధి కాదు. దాదాపుగా అందరూ కోలుకుంటారు. మెదడు, ఇతర నాడీ వ్యవస్థలపై ప్రభావమూ తాత్కాలికమే. జ్వరం పాలైన దాదాపు 4 శాతం పిల్లల్లో రావచ్చు. అదీ గంటలోపే దాడిచేస్తుంది. శరీరం కట్టెబారిపోవడం, రెండువైపులా శరీర భాగాలు కదలడం, స్పృహ కోల్పోవడం, బట్టల్లో మూత్రం, విరేచనాలు తదితర లక్షణాలు కనిపిస్తాయి. నోట్లో నుంచి నురుగు, కనుగుడ్లు పైకి వెళ్లడంతోపాటు.. ఫిట్స్ ఆగిన తరువాత గంట వరకు పిల్లలు నిద్రపోతారు.
కాంప్లెక్స్ ఫిట్స్
ఈ ఫిట్స్ 15 నిమిషాలకు మించి కొనసాగుతాయి. శరీరంలో కదలికలు ఒకవైపు మాత్రమే ఉంటాయి. పద్నాలుగు గంటలలోపే ఫిట్స్ మళ్లీ వస్తాయి. కొన్నిసార్లు ఒకవైపు శరీరమంతా కదలికలు తగ్గిపోవచ్చు. దీనిని ‘టాడ్స్ పాల్సీ’ అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి మళ్లీ వచ్చే ఆస్కారం ఉంది. అదీ మొదటి సంవత్సరంలోపు రావచ్చు. మొదటి ఫిట్స్ 18 నెలల్లోపు వస్తే రెండోసారి వచ్చే అవకాశం అధికం అవుతుంది. కుటుంబంలో ఎవరికైనా మూర్ఛవ్యాధి (ఎపిలెప్సీ) ఉంటే ఫెబ్రైల్ ఫిట్స్ రావచ్చు. ఫెబ్రైల్ ఫిట్స్ వచ్చిన 50 మందిలో
ఒకరికి, కాంప్లెక్స్ ఫిట్స్ వచ్చిన 20 మందిలో ఒకరికి ఎపిలెప్సీ రావచ్చు. ఇలాంటి సమయంలో వెంటనే డాక్టరుకు చూపించాలి.
-డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు