పేరు చెప్పగానే వణుకుపుట్టించే వ్యాధి క్యాన్సర్. ఊపిరితిత్తులు, నోరు, కాలేయం, ప్రొస్టేట్.. ఇలా అవయవం
ఏదైనా క్యాన్సర్ భూతానికి బలికావలసిందే. అయితే, పిత్తాశయ క్యాన్సర్ నిన్నమొన్నటి వరకూ భారతదేశంలో అంతగా కనిపించేది కాదు. క్రమంగా ఇక్కడా విస్తరిస్తున్నది. తొలిదశలోనే గుర్తిస్తే ఈ రుగ్మతను నివారించడం సాధ్యమేనని అంటున్నారు వైద్య నిపుణులు.
శరీరంలో పొత్తి కడుపునకు కుడివైపున, కాలేయానికి కొంత దిగువన పియర్ పండు ఆకారంలో ఉండే అవయవం.. ‘పిత్తాశయం’ (గాల్‌బ్లాడర్). కాలేయం స్రవించే పైత్యరసం ఇందులో నిల్వ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారంలోని కొవ్వులు జీర్ణం అయ్యేందుకు పైత్యరసం దోహదపడుతుంది. కాలేయం నుంచి విడుదలైన పైత్యరసం పిత్తాశయం నుంచి ఆంత్రమూలంలోకి వెళ్తుంది. పిత్తాశయ కణజాలంలో హానికర కణాలు వృద్ధిచెందడంతో పిత్తాశయ క్యాన్సర్ సంక్రమిస్తుంది. నిజానికి, భారతదేశంలో పిత్తాశయ క్యాన్సర్ ప్రభావం తక్కువే. కానీ, ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు బాగా పెరుగుతున్నాయి. పిత్తాశయ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే నివారణ అసాధ్యమేం కాదు. కానీ, చాలా సందర్భాల్లో రోగి శరీరంలోంచి అనారోగ్యకర
సంకేతాలేవీ వెలువడవు.. చిన్న చిన్న లక్షణాలు కూడా బయటికి పొక్కవు. దీంతో వ్యాధి ముదిరేవరకూ గుర్తించలేం. పైగా పిత్తాశయం శరీరంలో అంత సులువుగా గుర్తించే ప్రదేశంలో ఉండదు. ఫలితంగా, పిత్తాశయ క్యాన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తుంది.
కారణాలు అనేకం
పిత్తాశయ క్యాన్సర్ పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువ. ప్రత్యేకించి ఊబకాయులలో మరీ అధికం. వయసు పెరిగే కొద్దీ పిత్తాశయ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతూ పోతుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నవాళ్లలో.. అంతకుముందు ఆ ఇబ్బందిని అనుభవించినవారిలో.. పిత్తాశయ క్యాన్సర్ చాలా వేగంగా విస్తరిస్తుంది. పిత్తాశయంలో రాళ్ల పరిమాణం పెరిగేకొద్దీ ముప్పు కూడా ఎక్కువే అవుతుంది. పిత్తాశయంలో కణుతులు, ఇన్ఫెక్షన్ లాంటివి కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. కాలేయం నుంచి విడుదలైన పైత్యరసం పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. పైత్యరస నాళం గట్టిపడటం వల్ల కలిగే తీవ్రమైన నొప్పి కూడా పిత్తాశయ క్యాన్సర్‌కు ఒక సంకేతమే. తక్షణం వైద్యం చేయించుకోమంటూ శరీరం అందించే ఓ హెచ్చరికే.
శస్త్రచికిత్స
పిత్తాశయ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే శస్త్రచికిత్సతో సరిపోతుంది. క్యాన్సర్ పిత్తాశయానికి మాత్రమే పరిమితమై ఉంటే, ఆ భాగాన్ని తొలగించేందుకు సర్జరీ చేస్తారు. దీనిని కోలెసిస్టెక్టమీ అంటారు. (cholecystectomy).
పిత్తాశయం, కాలేయంలో కోత క్యాన్సర్ పిత్తాశయాన్ని దాటి కాలేయానికి పాకిపోయినప్పుడు.. పిత్తాశయంతోపాటు కాలేయంలో విస్తరించిన భాగం, పిత్తాశయం చుట్టూ పేరుకుపోయిన పైత్యరస నాళాన్ని (బైల్ డక్ట్స్) సర్జరీ ద్వారా తొలగిస్తారు.
కీమోథెరపీ
క్యాన్సర్ సహా వేగంగా వృద్ధిచెందుతున్న ఇతర హానికరమైన కణాలను నాశనం చేయడానికి కీమోథెరపీలో వివిధ మందులను వాడతారు. సిరంజి ద్వారా కానీ, మాత్రల రూపంలో కానీ.. లేదంటే రెండు రకాలుగానూ కీమోథెరపీ చేస్తారు. అయినా పిత్తాశయంలో క్యాన్సర్ కణాలు ఉన్న సందర్భంలో సర్జరీ తర్వాత కీమోథెరపీ సిఫారసు చేస్తారు. సర్జరీ అవసరం లేనప్పుడు కూడా క్యాన్సర్‌ను నియంత్రించడానికి
కీమోథెరపీని ఎంచుకుంటారు.
రేడియేషన్ థెరపీ (ఎక్స్ రే థెరపీ)
క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించలేని సందర్భంలో పిత్తాశయ క్యాన్సర్ సర్జరీ తర్వాత.. కీమోథెరపీతోపాటు రేడియేషన్ థెరపీ చేయాల్సి ఉంటుంది. సర్జరీకి అవకాశం లేనప్పుడు, నొప్పిని నియంత్రించడానికి కూడా రేడియేషన్ థెరపీ దోహదపడుతుంది. క్యాన్సర్ తుది దశలో ఉన్న రోగులలో రుగ్మతను సమర్థంగా నియంత్రించడానికి టార్గెటెడ్ డ్రగ్ థెరపీ, ఇమ్యునోథెరపీ లాంటి కొత్త చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. పిత్తాశయ క్యాన్సర్‌కు సంబంధించి ఏ లక్షణాలతో బాధపడుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. దీనివల్ల, తొలిదశలోనే చికిత్స అందించడానికి వీలుపడుతుంది. రోగి క్యాన్సర్ కోరల నుంచి తప్పించుకునే అవకాశాలూ ఉంటాయి. నిజానికి, నాలుగుపదులు దాటిన తర్వాత ఏడాదికోసారి సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఏ చిన్న ప్రమాద సంకేతాన్నీ ఉపేక్షించలేం.
లక్షణాలు
చర్మం, కండ్లలో తెల్లగుడ్డు ప్రాంతం పచ్చగా (పసరికలు) మారిపోతాయి. ఒళ్లంతా దురదగా అనిపిస్తుంది. మూత్రం మామూలు కంటే ఎక్కువ గాఢతలో ఉంటుంది. రంగులేని మల విసర్జన మరో లక్షణం. ఆకలి చచ్చిపోతుంది. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు కోల్పోతారు. అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. వణుకు
మొదలవుతుంది.
నిర్ధారణ- చికిత్స
పిత్తాశయాన్ని బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ లక్షణాలను బేరీజు వేయవచ్చు. లేదంటే, శస్త్ర చికిత్సకు ముందే శాంపిల్‌ను ల్యాబొరేటరీకి పంపడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ, పీఈటీ లాంటి ఇమేజింగ్ అధ్యయనాలు కూడా క్యాన్సర్‌ను గుర్తించేందుకు దోహదపడతాయి. క్యాన్సర్ దశను బట్టి, రోగి ఆరోగ్యాన్ని బట్టి పిత్తాశయ క్యాన్సర్‌కు వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్సా విధానం ఏదైనా ప్రధాన లక్ష్యం మాత్రం పిత్తాశయ క్యాన్సర్‌ను నిర్మూలించడమే. అది సాధ్యం కాని పరిస్థితుల్లో వ్యాధి విస్తృతిని నిలువరించడానికి ఇతర చికిత్సలను ఎంచుకుంటారు.
డాక్టర్ నిఖిల్ ఎస్ ఘడ్యాల్పాటిల్
సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్,
హెమటో ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్.