ముంబైలోని ఓ మురికివాడ. ఆ సందుగొందుల్లో అడ్రస్ దొరకడం కూడా కష్టమే. కానీ జొమాటో డెలివరీ బాయ్ కూడా ఇప్పుడు, నేరుగా వెళ్లి బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేస్తున్నాడు. కిరాణా సరుకులు,మందులు, గ్యాస్ వంటివి సకాలంలో అందుతున్నాయి. ఇదంతా డిజిటల్ చిరునామాతోనే సాధ్యమైంది. అసాధ్యమైన పనిని సునాయాసంగా పూర్తి చేసింది ప్రతిమా జోషి.
మహారాష్ట్రలోని ఏడు మురికివాడల్లో ప్రతి ఇంటికీ డిజిటల్ చిరునామా ఉందిప్పుడు. ఆ అడ్రస్ ఆధారంగా స్వచ్ఛమైన తాగునీరు వచ్చింది. పారిశుద్ధ్య పనులూ జరుగుతున్నాయి. కాబట్టే, బస్తీల ప్రజలకు డిజిటల్ అడ్రస్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రతిమా జోషి. ఆర్కిటెక్ట్‌గా తన నైపుణ్యంతో మురికివాడ పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు, జీవించే హక్కును కల్పించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నది ప్రతిమ. 1993లోనే ‘షెల్టర్ అసోసియేట్స్’ అనే ఎన్జీవోను స్థాపించిందామె. ఈ సంస్థ ద్వారా మురికివాడల్లో గృహ నిర్మాణానికి, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం మొదలైన వసతులు కల్పించడానికి తనవంతుగా ప్రయత్నించింది. అయితే, మురికివాడల ప్రజలకు సంబంధించి ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు లేవు. దీంతో, తానే ఆ లెక్కలు తయారుచేసే పనిలో నిమగ్నమైంది. ఆ కృషి ఫలితంగానే, పుణెలోని లక్షన్నర గృహాలను డిజిటల్‌గా గుర్తించారు. ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టారు. 2005లో గూగుల్ ఎర్త్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో డిజిటలీకరణ సులభమైపోయింది.
ఎంతో మార్పు
ప్రతిమ దృష్టి కేంద్రీకరించిన ఏడు మురికివాడల్లో దాదాపు 75 శాతం మంది ఇళ్లకు పైపుల ద్వారా నీరు వస్తున్నది. 80 శాతం మందికి విద్యుత్ సౌకర్యం అందింది. కానీ, 28 శాతంలోపు ఇండ్లకే టాయిలెట్లు ఉండటంతో పారిశుద్ధ్యంపై ఫోకస్ పెట్టింది ప్రతిమ. ‘ఒక ఇల్లు, ఒక మరుగుదొడ్డి’
నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, సొంత ఇండ్లలో మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించింది. తాజాగా ఫోర్బ్స్ ఇండియా 2021 అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాలో ప్రతిమా జోషికి స్థానం దక్కింది. ‘గూగుల్ ఎర్త్ హీరో అవార్డు’ అందుకున్న ఏకైక భారతీయురాలు ప్రతిమ. ‘స్లమ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా’గా బీబీసీ ఆమె సేవలను గుర్తించింది.