అప్పటివరకూ చేస్తున్న చీరల వ్యాపారం ఏమంత లాభసాటిగా అనిపించలేదు. అప్పులు పెరిగాయి. డబ్బు ప్రవాహం ఆగిపోయింది. దీంతో కొత్త బిజినెస్ వైపు అడుగులు వేయాలనుకున్నారు శిల్ప. ఆ ప్రయత్నంలో భాగంగా భర్తతో నంద్యాలగూడెం అనే పల్లెకు వెళ్లారు. అక్కడే, పట్టు పురుగుల పెంపకంపై మనసు పారేసుకున్నారు. అందులో మెలకువలు నేర్చుకొని తనే ఓ సెరికల్చర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు నెమరుగోమ్ముల శిల్ప.
‘స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం చాలా అవసరం. అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ రావు. ఆమే అవకాశాల్ని సృష్టించుకోవాలి. ఆర్థికసాధికారత దిశగా అడుగులు వేయాలి’ అంటారు సూర్యాపేట జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన మహిళారైతు నెమరుగోమ్ముల శిల్ప. తను రైతు మాత్రమే కాదు.. ప్రతి దశలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎదిగిన వ్యాపారవేత్త కూడా. మొదట్లో, కుటుంబానికి అండగా నిలబడాలనే లక్ష్యంతో చీరల వ్యాపారం మొదలుపెట్టారు. కానీ అందులో పెద్దగా లాభాలు రాలేదు. అయినా నిరాశపడకుండా.. కొత్తగా ప్రయత్నించాలనుకున్నారు. భర్త రవీందర్రావు సహకారంతో పట్టు పురుగుల పెంపకంపై దృష్టిపెట్టారు. వారం రోజులపాటు నంద్యాలగూడెం వెళ్లి.. సెరికల్చర్ను అధ్యయనం చేశారు. అక్కడ ఓ రైతు మూడెకరాల్లోనే నెలకు రూ.లక్షకు పైగా సంపాదించడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ స్ఫూర్తితో మల్బరీ సాగు మొదలుపెట్టారు.
ఆరు ఎకరాలతో మొదలై.. తమకున్న తొమ్మిది ఎకరాల్లో..
ఆరు ఎకరాల నేలలో సేంద్రియ పద్ధతిలో మల్బరీ సాగు ప్రారంభించారు శిల్ప. కాలం కలిసొచ్చింది. నాలుగు నెలల్లోనే పంట చేతికొచ్చింది. పట్టు పురుగులు కూడా తానే పెంచాలనే ఉద్దేశంతో ఓ షెడ్డు నిర్మించారు. అందులో పురుగుల పెంపకానికి అనువైన వాతావరణాన్ని సృష్టించారు. మైసూరు నుంచి గుడ్లు తెప్పించి ఆలనాపాలనా చూశారు. తమ వ్యవసాయ క్షేత్రంలోని మల్బరీ ఆకులనే ఆహారంగా వేస్తూ.. పట్టు పురుగులను కంటికిరెప్పల్లా చూసుకున్నారు. అవి పక్వానికి వచ్చాక గూళ్లు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. అలా 40-45 రోజుల్లో మల్బరీ పంట చేతికొచ్చేది. 20 నుంచి 25 రోజుల్లో పట్టుగూళ్లూ విక్రయానికి వచ్చాయి. ఇక మైసూరు నుంచి తెప్పించే పట్టుగుడ్లు.. పురుగులుగా మారిపోయి వారంరోజుల్లోనే మంచి ఆదాయం సమకూర్చేవి. ఇలా ప్రతీది ప్రణాళికాబద్ధంగా నిర్వహించడంతో నెలలో రెండుసార్లు చేతినిండా డబ్బు కనిపించేది. ఇక ఈ రంగంలో తనకు తిరుగులేదని అర్థమైపోయింది.
సీఆర్సీ నిర్వహణ
ఉమ్మడి పాలనలో సెరికల్చర్ లాభాలన్నీ ఆంధ్రావారికే దక్కేవి. రాష్ట్ర అవతరణ తర్వాత పాలన యంత్రాంగం తెలంగాణ బిడ్డలను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాకు ఓ సీఆర్సీ (చాకీ రేరింగ్సెంటర్)ను కేటాయించారు అధికారులు. అప్పటికే సెరికల్చర్‌లో నైపుణ్యాన్ని సాధించడం, తన వ్యవసాయ క్షేత్రంలో సీఆర్సీ సెంటర్ ఏర్పాటుచేసేంత స్థలం కూడా ఉండటం శిల్పకు కలిసొచ్చింది. సెంటర్ బాధ్యత ఆమెకే అప్పగించారు. ఇందుకోసం మైసూరు వెళ్లి సీఆర్సీ నిర్వహణపై మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్నారు శిల్ప. నేషనల్ సిల్క్‌వార్మ్ సీడ్ ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) దగ్గర గుడ్లు కొని, వాటిని సూర్యాపేటకు తీసుకొచ్చి, సరైన ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారామె. గుడ్డు.. లార్వా దశ నుంచి పిల్లగా మారిన తర్వాత.. స్వయంగా తానే రసం ఉన్న ఆకులను ఎంపిక చేసి, వాటిని సన్నగా కత్తిరించి ఆహారంగా ఇస్తారు.
ఆ పట్టు పురుగులను అర్ధరాత్రి ప్యాక్ చేయించి.. గద్వాల, సిద్దిపేట, జనగామ వంటి చోట్లకు తరలించి రైతులకు విక్రయిస్తారు. సీఆర్సీ సెంటర్ నిర్వహణను చూసి ముచ్చటపడిన రాష్ట్ర ప్రభుత్వం శిల్పను ‘ఉత్తమ మహిళా రైతు’ అవార్డుతో సత్కరించింది. సెరికల్చర్ సాగులో.. చీడపీడల నివారణ,
ఎరువులు, నీటి పారుదల.. తదితర విషయాల్లో పట్టు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు శిల్ప. తనే ఆకులు పండించి, పురుగులు పోషించి.. వాటి ద్వారా ఉత్పత్తి అయిన దారాన్ని కూడా తీస్తూ.. ‘లీఫ్ టు క్లాత్’
నినాదాన్ని నిజం చేస్తున్నారు. ఇక్కడ తయారైన దారాన్ని నేరుగా బెంగళూరులో విక్రయిస్తున్నారు.
‘శిల్ప చాకీ సెంటర్’, ‘శిల్ప రీలింగ్ యూనిట్’, ‘శిల్ప ఇండియా ఆటోమెటిక్ రీలింగ్ యూనిట్’.. మొత్తం మూడు కంపెనీలతో సెరికల్చర్ వ్యాపారాన్ని లాభాల బాట పటిస్టున్నారు శిల్ప.
మహిళలు ముందుకు రావాలి!
సెరికల్చర్ అనేది వన్‌టైమ్ ఇన్వెస్ట్మెంట్. 12 ఏండ్ల వరకూ తిరుగు ఉండదు. యాజమాన్య పద్ధతులు తెలిస్తే చాలు. చేతినిండా లాభాలే. రెండెకరాల భూమిలో నెలకు రూ.50వేలు సంపాదించుకోవచ్చు. ప్రభుత్వం, అధికారుల అండ ఉండనే ఉంటుంది. పత్తితో పోలిస్తే
సెరికల్చర్ సాగు ఉత్తమం. ఓపికతో పని చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు.
-ఎన్.శిల్ప
-రవికుమార్ తోటపల్లి