ఆన్లైన్ షాపుల పుణ్యమా అని ఉన్న చోటునుంచే నచ్చినవి కొనేసుకునే అవకాశం ఉంది. కానీ, అందులోనూ ఏదో వెలితి. దుస్తులు ఖరీదు చేసేటప్పుడు చేత్తో ముట్టుకుని చూస్తేనే నాణ్యత, మెత్తదనం తెలుస్తాయి. వేసుకుని చూసుకుంటేనే ఫిట్టింగ్ ఎలా ఉందన్నది అర్థం అవుతుంది. కానీ ఈ రెండు వెసులుబాట్లూ ఆన్లైన్లో లోపిస్తాయి. మరేం చేయాలి? అనుకునే వాళ్ల కోసం ఇంటి ముందుకే బొటిక్ సేవలు తెస్తున్నది.. పిక్బిగ్ అనే మొబైల్ బొటిక్ సంస్థ. చెన్నై వీధుల్లో సందడి చేస్తున్న ఈ బొటిక్ ఒక పెద్ద బస్సును తలపిస్తుంది. దానినిండా అన్ని వయసుల మహిళల కోసం రకరకాల దుస్తులు ఉంటాయి. ట్రయల్ రూమ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు.. చెప్పిన సమయానికి ఇంటిముందు వాలిపోతుంది. ఆ ఫ్యాషన్ బస్సెక్కి.. నచ్చిన డ్రెస్ కొనుక్కోవడమే. తొలుత దీన్ని ధనవంతుల కోసమే ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లూ, గేటెడ్ కమ్యూనిటీల వారికీ సేవలందిస్తున్నది. ఐదు వందల రూపాయల నుంచీ టాపులు దొరుకుతాయిక్కడ. కార్తిక్ అనే వ్యాపారి ఈ షాపింగ్ రథాన్ని నాగర్కోయెల్లో ఏడాది క్రితం ప్రారంభించాడు. అక్కడ బాగా క్లిక్ అవడంతో చెన్నై వీధుల్లోనూ ప్రయోగాలు చేస్తున్నాడు.