ఇంట్లో ఎన్ని నగలున్నా కొత్త ఆభరణం కనిపించగానే మనసు పారేసుకుంటారు మహిళలు. కాబట్టే, వారిని ఆకట్టుకునేందుకు సరికొత్త డిజైన్లకు ప్రాణంపోస్తారు ఆభరణాల తయారీదారులు.హైదరాబాద్‌కు చెందిన ఇరవై ఎనిమిదేండ్ల కావ్య ఆలోచనలు సైతం నిత్యం కొత్తకొత్త నగల చుట్టూనే తిరుగుతుంటాయి.చెవిదిద్దులు, గొలుసులు, వంకీలు, వడ్డాణాలు.. ఆమె రూపొందించే అన్ని ఆభరణాలూ మగువల మనసు దోచేస్తాయి. ‘బాల్యం నుంచే నేను ఆభరణాలతో ప్రేమలో పడ్డాను’ అంటూ బంగారంతో తన బంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు కావ్య పొట్లూరి…
ఒకచిన్న ముక్కుపుడక తయారు
చేసినా.. తలపై ధరించే పెద్ద ఫ్యాషన్ నగ రూపొందించినా అందులో అణువణువూ నైపుణ్యంతో చెక్కినట్టుగా ఉండాలనీ.. ప్రతి లతా, ప్రతి పువ్వూ ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దినట్టు కనిపించాలనీ నా తపన. స్కూల్లో చదివే రోజుల నుంచే రంగురంగుల పూసలు సేకరించేదాన్ని. వాటితో అందమైన నెక్లెస్‌లు అల్లి బంధువులు, స్నేహితులకు బహుమతిగా ఇచ్చేదాన్ని. అందరూ మెచ్చుకునేవాళ్లు. దాంతో అమ్మ నా కోసం వెరైటీ బీడ్స్ కొనిచ్చేది. అందుకే, చదువు విషయానికి వచ్చేసరికి నగల డిజైనింగ్‌కు సంబంధించిన కోర్సు చేయమని సలహా ఇచ్చింది అమ్మ. నేను జువెలరీడిజైనింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. జెమాలజీ, జువెలరీ మానుఫ్యాక్చర్ అండ్ డిజైనింగ్..ప్రధాన సబ్జెక్టులుగా అమెరికాలో మాస్టర్స్ పట్టా అందుకున్నాను. ఆ తర్వాత సొంతంగా బ్రాండ్ లాంచ్ చేశాను.
ఎవరైనా నగలు కావాలనుకుంటే, నా ఇన్‌స్టా పేజీ ద్వారా కాంటాక్ట్ కావచ్చు. ఇత్తడి, రాగి, వెండి తదితర లోహాల మిశ్రమాలతో నగలను రూపొందించి.. వాటిమీద బంగారు పూత పూస్తాన్నేను. ముంబై, కోల్‌కతా, జైపూర్, హైదరాబాద్ కళాకారులకు నా శైలి ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చాను. నిజానికి ఇదో కొత్త ప్రయోగం. లోహాల మిశ్రమంతో నగలను తయారు చేయడం సరికొత్త ట్రెండ్. ఆభరణాలంటే మన దగ్గర వాడే మూస నగలే వీళ్లకు తెలుసు. జువెలరీ సంస్థలను నడపాలంటే మూడు నాలుగు తరాల అనుభవం ఉండాల్సిందేనని అంటారు. కానీ మా కుటుంబం నుంచి మాత్రం ఈ రంగంలో అడుగుపెట్టిన మొదటి తరం వ్యక్తిని నేను. చాలామంది డిజైనర్లు పెండ్లిళ్లు, వేడుకలపైనే ఫోకస్ చేస్తారు. కానీ నేను పార్టీలు, ఫ్యాషన్ దుస్తుల మీదికి నప్పే నగలను డిజైన్ చేయడానికి ఇష్టపడతాను. నా డిజైనింగ్ సున్నితంగా కనిపిస్తూనే బోల్డ్‌గా ఉంటుంది. నాకు విదేశాలలోనూ ఎంతోమంది కస్టమర్లు ఉన్నారు.