బాలీవుడ్లో తనను తాను నిరూపించుకున్న తాప్సీ సామాజిక సేవలోనూ ముందుంటున్నది. కరోనా సమయంలో కూడా వందలాది మందికి సాయం అందించి తన సహృదయతను చాటుకున్నది. ఇప్పటికీ పలు ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నది. తాజాగా ప్రముఖ స్వచ్ఛంద సంస్థ హేమ్కుంట్ ఫౌండేషన్ తాప్సీని సలహా మండలి సభ్యురాలిగా ఎంపిక చేసింది. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తపించే సంస్థతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని చెబుతున్నది తాప్సీ.
హేమ్కుంట్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఏడు రాష్ర్టాలకు తన సేవలు విస్తరించింది. గ్రామీణ నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నది. ఇందులో భాగంగా హెచ్ఎఫ్ 100 (హాస్పిటల్ ఆన్ వీల్స్) సేవలు ప్రారంభించింది. రుతుక్రమ సమస్యలపై యువతుల్లో అవగాహన కల్పిస్తున్నది. కరోనా లాక్డౌన్ సమయంలో ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా 42 లక్షల మంది వైద్య సేవలు పొందారు. ‘నిజాయతీతో పనిచేసే హేమ్కుంట్ ఫౌండేషన్లో నేనూ ఓ భాగమవ్వడం ఆనందంగా ఉంది. నా సలహాలు సంస్థకు ఉపయోగపడతాయని, తద్వారా మరింత మంది నిరుపేదలకు సేవలు అందుతాయని విశ్వసిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది తాప్సీ. ఇప్పటికే తాప్సీ వివిధ ఎన్జీవోలకు రాయబారిగా వ్యవహరిస్తున్నది. బాలికల విద్య కోసం పనిచేసే నన్హీకలికి తనవంతు సహకారం అందిస్తున్నది. రుతుక్రమానికి సంబంధించిన అపోహలనూ పోగొడుతున్నది.