ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పాంటోన్ సంస్థ ట్రెండీ కలర్‌ను ప్రకటించింది. 2022లో ఫ్యాషన్ రంగాన్ని ఏలబోతున్న నయా వర్ణం పేరు.. ‘వెరీ పెరీ’. నీలం, ఊదా, ఎరుపు మేళవింపుతో ఈ కొత్త రంగు తయారైంది. ఇలా ఏడాదికో వర్ణాన్ని ఎంపిక చేయడానికి పాంటోన్ నిపుణులు చాలా కష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలర్ ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి అనేక అధ్యయనాలు చేస్తారు. అలా ఈసారి వెరీ పెరీకి పట్టం కట్టారు. ఇకనుంచీ వెరీ పెరీ రంగు ఫ్యాషన్‌లో, గృహాలంకరణలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరూ కొత్త రంగును స్వాగతిస్తూ వెరీ పెరీ రంగు బట్టలు కొనుక్కోవచ్చు. ఆ వర్ణపు పర్స్, బ్యాగ్, హీల్స్, స్కార్ఫ్ ఎంచుకోవచ్చు. మేకప్ విషయానికి వస్తే ఐ షాడో, గోళ్ల రంగుల్లోనూ వెరీ పెరీకి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. బ్లూ డెనిమ్ మీదికీ ఈ కొత్త రంగు టాప్స్ నప్పుతాయి. బట్టల విషయంలో వెరీ పెరీ అన్ని ముదురు రంగులకూ జోడీగా ఉంటుంది.