పద్యం యతి, ప్రాసల శోభితం. ఛందోబద్ధంగా అల్లిన పద్యం తెలుగు భాష ప్రత్యేకతను చాటి చెబుతుంది. ఇప్పుడు ఉన్న తెలుగు పండితుల్లో ఛందస్సును ఉపయోగించి పద్యాలు రాసేవారిని వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. అలాంటిది ఇంటర్‌తోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టిన కల్లెపు రాజేశ్వరరావు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం వంటి వృత్తాల్లో పద్యాలు రాస్తూ శతకాలు పూర్తి చేస్తున్నారు.
వరంగల్ జిల్లా గుడాడుపల్లికి చెందిన రాజేశ్వరరావు వయసు 73 ఏండ్లు. చిన్నప్పటి నుంచి ఆయనకు పద్యాలంటే ప్రాణం. నాటకాలంటే మోజు. నాటకాల్లో నటీనటులు పాడే పద్యాలను శ్రద్ధగా వినేవారు. అలా పద్యంపై ప్రేమ పెంచుకున్నారు. ఎనిమిదో తరగతిలో ఉండగా ఒకసారి ‘జొన్నకంకులు’ గురించి ఛందస్సుతో సంబంధం లేకుండా ప్రాసతో పద్యాలు రాశారు. దానిని తెలుగు ఉపాధ్యాయుడు గిరి లక్ష్మణాచార్యకు చూపించారు.
ఆయన ‘పద్యాల్లో భావం బాగానే ఉంది. కానీ, ఛందస్సు నేర్చుకుని రాస్తే ఇంకా బాగుంటాయి’అని ప్రోత్సహించారు. దీంతో ఛందస్సుపై పట్టుకోసం ప్రయత్నించారు. కొన్నాళ్లకు అలవోకగా ఛందోబద్ధంగా పద్యాలు రాయడం మొదలుపెట్టారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా పీయూసీ (ఇంటర్)తో చదువు ఆపేశారు. వ్యవసాయం, కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయారు. మళ్లీ 2003లో పద్యాలపై మనసు మళ్లింది. ‘ఒక కార్యక్రమంలో నాకు పాఠాలు చెప్పిన శ్రీరాయపాటి రామలింగయ్య మాస్టార్.. చదువు గురించి రెండు సీస పద్యాలను రాసి వినిపించారు. ఆయన నుంచి స్ఫూర్తిపొంది మళ్లీ పద్యాలు రాయడం మొదలుపెట్టాను’ అని చెప్పుకొచ్చారు రాజేశ్వరరావు.
మొదట్లో ఒక్కో అంశంపై పది, పదిహేను పద్యాలు రాస్తూ ఉండేవారు. కొన్నాళ్లకు మరో గురువు శ్రీ ఆరుట్ల భాష్యాచార్యులు రాసిన కొన్ని శతకాలను రాజేశ్వరరావుకు ఇచ్చారు. వాటిని చదివిన తర్వాత శతకాలలో ఎంచుకున్న విషయంతోపాటు నీతిని బోధించవచ్చని భావించారు. ఆ తర్వాత పదుల పద్యాల నుంచి శతకాలు రాయడం మొదలుపెట్టారు. తొలి ప్రయత్నంగా తన స్వగ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామిని స్తుతిస్తూ.. ‘శ్రీ హనుమత్ శతకము’ రాశారు. ఆ తర్వాత ‘శ్రీ శివ శతకము’, ‘శ్రీ సత్యసాయి శతకము’, ‘శ్రీ లక్ష్మి నారసింహ శతకము’, ‘శ్రీ దాశరథీ దయానిధీ శతకము’, ‘శ్రీ వేంకటేశ శతకము’ రాశారు. ఈ శతకాలకు కసిరెడ్డి వెంకటరెడ్డి వంటి ప్రముఖులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, తెలుగు పండితులు, హెడ్మాస్టర్లు ముందుమాటలు రాశారు. ప్రతిరోజూ వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తూనే, ప్రశాంత వాతావరణంలో పద్యాలు వల్లె వేస్తారు రాజేశ్వరరావు. త్వరలో 1,200 పద్యాలతో ఓ సంకలనాన్ని ప్రచురించనున్నారు. పెద్దబాల శిక్షలోని అంశాలు, ఇతర నీతికథల సారాంశాన్ని పద్యాలుగా రాసి భావితరాలకు బహుమతిగా అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
…? రవికుమార్ తోటపల్లి