తొడలు విరిచి, గనులు తొలిచే ఆ కార్మికుడిలో ఓ రచయిత ఉన్నాడు. ఓ దర్శకుడు ఉన్నాడు. ఓ కెమెరామెన్ ఉన్నాడు. తనలోని సృజనకు స్మార్ట్‌ఫోన్‌తో రూపమిస్తున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు పోతుల చంద్రపాల్. ఆయన నటిస్తూ, నిర్మిస్తున్న లఘుచిత్రాలు యూట్యూబ్‌లో మంచి హిట్లు సాధిస్తున్నాయి.
తనలోని సృజనాత్మకతకు దృశ్యరూపం ఇవ్వడానికి స్మార్ట్‌ఫోన్‌ను సాధనంగా ఎంచుకున్నాడు చంద్రపాల్. తను 2017 నుంచి లఘుచిత్రాలు నిర్మిస్తున్నాడు.
‘ఒంటరివాడు’ అనే సందేశాత్మక చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టిన చంద్రపాల్ ఇప్పటివరకు ఎనిమిది లఘుచిత్రాలు, ఐదు డాక్యుమెంటరీలు నిర్మించాడు. మూడు జానపద గీతాలనూ చిత్రీకరించాడు. వీటన్నిటినీ స్మార్ట్‌ఫోన్‌తోనే తీశాడు. స్టూడియోతో పనిలేకుండా ఎడిటింగ్, రీ రికార్డింగ్, సౌండ్ మిక్సింగ్ వంటివన్నీ ఫోన్‌తోనే చేయడం విశేషం. తక్కువ పాత్రలతో ఆయన నిర్మించిన షార్ట్ ఫిల్మ్స్ సందేశాత్మకంగా ఉంటూనే వీక్షకులను అలరిస్తున్నాయి. మరో స్థానిక కళాకారుడు మేజిక్రాజా తోడుగా నిర్మించిన ‘అల వృద్ధాశ్రమంలో..’ లఘుచిత్రం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో
రవీంద్రభారతిలో ప్రతి శనివారం నిర్వహించే సినీవారంలో ప్రదర్శితమైంది. ‘గొప్ప మనసు’,
‘ఓ తండ్రి చివరి లేఖ’, ‘ఆకాశమంత’, ‘బిల్డప్ మామ-బిత్తిరి అల్లుడు’ తదితర లఘుచిత్రాలు చంద్రపాల్ సృజనకు అద్దంపడతాయి.
ఈ చిట్టి చిత్రాలను నిరీక్షణ ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేస్తున్నాడీయన. సింగరేణి కార్మికుడైన చంద్రపాల్ ఈపీ ఆపరేటర్‌గా రామగుండం-3 ఏరియా, ఓ.సి.పి-1లో విధులు నిర్వహిస్తున్నాడు. సింగరేణి కోసం దీర్ఘాయు ష్మాన్భవ, మార్గదర్శి, ఖాందాన్ అనే టెలీఫిల్మ్లకు దర్శకత్వం వహించాడు. ‘మార్గదర్శి’ సింగరేణి స్థాయిలో ఉత్తమ టెలీఫిల్మ్గా నిలిచింది. హాస్య కళాకారుడిగా ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ కోల్ ఇండియా స్థాయి పోటీల్లో రెండుసార్లు సింగరేణి సంస్థకు మెడల్స్ తెచ్చాడు. భవిష్యత్తులో మరిన్ని షార్ట్‌ఫిల్మ్స్ తీస్తానని చెబుతున్నాడు చంద్రపాల్.
…? మధుకర్ వైద్యుల