అమ్మ కోసం.. అమృతాన్ని సాధించాడు గరుత్మంతుడు. అమ్మకోసం.. మూడు ప్రమాణాలకు కట్టుబడ్డాడు మహాత్ముడు. ఆ కొడుకు ఆరాటం, పోరాటం అంతకంటే గొప్పవి. శరత్ బాబు ఏకంగా న్యాయశాస్త్రం చదివాడు. పట్టుదలతో పట్టా అందుకున్నాడు. అమ్మ తరఫున కేసు వాదించి గెలిచాడు. కన్నతల్లి కళ్లలో ఆనందాన్ని చూశాడు. పుత్రోత్సాహము తల్లికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు.
అమ్మకు పెద్ద కష్టమే వచ్చింది. అయినవాళ్లూ కానివాళ్లూ దానిగురించే మాట్లాడుకునేవారు. ఆ మాటలు తూటాల్లా తల్లి గుండెను తాకేవి. ఆ క్షోభకు కారణం సాక్షాత్తు కన్నతండ్రే అని తెలిసింది ఆ బిడ్డకు. ఓర్చుకున్నన్ని రోజులు ఓర్చుకున్నాడు. పంచాయతీ తీర్మానాలతోనూ నాన్నలో మార్పు రాలేదు. చివరికి కోర్టులో న్యాయం దొరికింది. కానీ ఆ తీర్పు అమలు కాకుండా అడ్డుపడ్డాడు నాన్న. కుట్ర చేసి, కోర్టు ఉత్తర్వులను మాయం చేశాడు.
అదంతాచూసి, ఆ పిల్లాడి మనసు గాయపడింది. అమ్మ వేదనను తీర్చాలనే తపన పెరిగింది. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసినా.. సాఫ్ట్వేర్ కొలువును కాదనుకుని న్యాయశాస్త్రం అభ్యసించాడు శరత్‌బాబు. అమ్మ కోసం ఆ బిడ్డ సాగించిన సుదీర్ఘపోరాటం.. ఆస్తుల కోసం అమ్మలను అనాథ శరణాలయాల పాలు చేస్తున్న బిడ్డలకు ఓ విలువల పాఠం. శరత్ సొంతూరు.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని సన్నూరు. నాన్న సోమయ్య, అమ్మ సులోచన. సోమయ్య ఉన్నత విద్యావంతుడు. అప్పట్లోనే వరంగల్ రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో చదివాడు.
విద్యుత్‌శాఖలో ఉద్యోగం సంపాదించాడు. కానీ భార్య సులోచనను మాత్రం నిత్యం ఇబ్బంది పెట్టేవాడు. పిల్లలకు నరకం చూపేవాడు. ఎంతమంది చెప్పినా సోమయ్య తీరు మారలేదు. దీంతో సులోచన తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. శరత్, రవి అక్కడే పెద్దవారయ్యారు. సోమయ్య ప్రభుత్వ ఉద్యోగి కావడంతో.. కుటుంబ పోషణ కోసం సులోచన వరంగల్ జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. ఇరు పక్షాల వాదనల తర్వాత.. ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
కానీ సోమయ్య ఆ తీర్పు కాపీ సులోచనకు దక్కకుండా చూశాడు. అప్పటికి శరత్ ఇంటర్ చదువుతున్నాడు. ఆ పరిణామాలన్నీ తనకు అర్థం అవుతూనే ఉన్నాయి. కోర్టు ఆఫీసులు, స్టోర్ రూమ్‌ల చుట్టూ తిరిగాడు. అధికారులను బతిమాలాడు. కానీ ఫలితం దక్కలేదు. అవతలి వ్యక్తి శక్తిమంతుడు. అతణ్ని ఎదిరించడానికి.. న్యాయశాస్త్ర పరిజ్ఞానమే సరైన ఆయుధమని భావించాడు శరత్. ఉపాధి కోసం ముందు ఎంసీఏ పూర్తిచేశాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత.. న్యాయశాస్త్రం చదివాడు. పట్టా అందుకున్నాడు. బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నాడు.
అమ్మ తరఫున వాదన
అమ్మకు జరిగిన అన్యాయాన్నే తన తొలి కేసుగా ఎంచుకున్నాడు శరత్. పాతికేండ్ల నాటి కోర్టు తీర్పు కాపీ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. అయినా సంబంధిత కార్యాలయాలు స్పందించలేదు. దీంతో నిబంధనల ప్రకారం ముందుకెళ్లాడు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ ప్రయత్నంలో ఎన్నో చట్టపరమైన అడ్డంకులు. హిందూ వివాహ చట్టంలోని నిబంధనల ప్రకారం భరణం అమలు తీర్పు వచ్చిన మూడేండ్లలోపు మాత్రమే మళ్లీ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. సాధారణ వివాహ చట్టం ప్రకారమైనా ఆ వ్యవధి పన్నెండేండ్లే. అయినా నిరాశపడకుండా మరింత లోతుగా అధ్యయనం చేశాడు. సీనియర్ న్యాయ వాదులను సంప్రదించాడు. పాత తీర్పులను తవ్వితీశాడు. ఆ అన్వేషణలో కర్ణాటక హైకోర్టు వెలువరించిన ఓ తీర్పు ఆసక్తికరంగా అనిపించింది. అక్కడ జడ్జిమెంట్ వచ్చిన 14 ఏండ్లకు పిటిషన్ దాఖలు చేశారు. ఆ తీర్పు కాపీని ఉటంకిస్తూ స్థానిక కోర్టులో పిటిషన్ వేశాడు. మొత్తానికి తల్లికి అనుకూలంగా అప్పట్లో వచ్చిన తీర్పు ప్రతిని సంపాదించాడు. ఆ ఆధారంతో ఆమెకు భరణం ఇప్పించాలంటూ కేసు వేశాడు.
అంతిమ విజయం
వాద ప్రతివాదాల తర్వాత కోర్టు సులోచనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో సోమయ్య రాజీకి వచ్చాడు. అప్పటికే ఆయన అడిషనల్ ఏయీయీ హోదాలో పదవీ
విరమణ చేశాడు. ప్రతినెలా రూ.30 వేల భరణం ఇచ్చేలా లోక్ అదాలత్‌లో ఒప్పందం కుదిరింది. రెండు నెలలు సొమ్ము సులోచన ఖాతాలో జమైంది. ‘తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ న్యాయం జరిగినా, తీర్పు అమలు కాలేదు. నా గోస చూసి పెద్ద కొడుకు శరత్ తపన పడేవాడు. వకీలు చదివి న్యాయం చేస్తాననేవాడు. ఎన్ని ఇబ్బందులున్నా పట్టువీడలేదు. ఇన్నాళ్లు నేను పడిన కష్టం తీరినట్లు కాదుగానీ, పానం అల్కగా అయినట్లు అనిపిస్తున్నది..’ అంటు న్నప్పుడు సులోచన కళ్లనిండా నీళ్లు. అది భర్తపై గెలిచిన ఆనందం కాదు. కొడుకు ప్రయోజకుడైన పుత్రోత్సాహం.
అమ్మ కష్టం చూడలేక..
మా నాన్న ప్రవర్తన మొదటి నుంచీ ఇబ్బందికరంగానే ఉండేది. గృహహింస మా చిన్నప్పుడే మొదలైంది. మార్గదర్శనం చెయ్యాల్సిన తండ్రి నరకం చూపించాడు. అమ్మ ఎన్నో కష్టాలను ఓర్చుకున్నది. అనివార్య పరిస్థితిలో అమ్మమ్మ తన ఇంటికి తీసుకుపోయింది. దగ్గరి బంధువులు కూడా మమ్మల్ని చులకనగా చూసేవారు. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని అమ్మ చెప్పేది. తమ్ముడు ఆసిఫాబాద్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. అమ్మకు కోర్టు న్యాయం చేసింది. కొందరి వల్ల అది అమలు కాలేదు.
నా వంతుగా ప్రయత్నం చేశాను. సాధారణ వ్యక్తిగా ఆ లక్ష్యాన్ని సాధించలేనని అర్థమైపోయింది. లా చదివి న్యాయవాది అయ్యాను. కోర్టు తీర్పు అమలయ్యేలా చూశాను. ఇది నా గెలుపు కాదు. అమ్మ విజయం.
– పాము శరత్ బాబు, న్యాయవాది
…? పిన్నింటి గోపాల్
– గొట్టె వెంకన్న