మగువ అందాన్ని మరింత పెంచే ఆభరణం.. మాంగ్ టిక్కా. దీన్ని పాపిట్లో పెట్టుకుంటారు కాబట్టి ‘పాపిట బిళ’్ల అనీ పిలుస్తారు. రంగుల రాళ్లు, రత్నాలు, పూసలు పొదిగిన పెద్దపెద్ద పాపిట బిళ్లల్ని ధరించే సంప్రదాయం ప్రాచీనకాలం నుంచీ ఉంది.
అలనాటి మహారాణులు రాజ చిహ్నాలు పొదిగిన పెద్దపెద్ద మాంగ్ టిక్కాలను ధరించే వారు. తర్వాత తర్వాత వాటి పరిమాణంలో మార్పు వచ్చింది. సన్నటి గొలుసుల చివర పెండెంట్లు జతచేసిన డిజైన్లు చాలాకాలం రాజ్యమేలాయి. ఆధునిక మహిళ అభిరుచికి తగినట్టు రకరకాల మాంగ్ టిక్కాలకు ప్రాణం పోస్తున్నారు డిజైనర్లు. పెండెంట్లో రకరకాల కుందన్లు, రాళ్లు, గుత్తపూసలు, వజ్రాలు పొదిగిన అందమైన మాంగ్ టిక్కాలు ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయి.
ఒంటిమీద ధరించే మిగతా నగలకు నప్పేలా వీటిలోనూ మయూరాలు, ఏనుగులు, హంసలు, పూలు, ఆకులు, మామిడి పిందెలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. జుంకాలు, కంఠా భరణాలు, గాజులతో సరిపోయేలా కాంబోలూ వచ్చేశాయి. పోల్కీ, జర్దోసి సొబగులద్దినవీ ఉన్నాయి. ప్రత్యేక సందర్భాలలో ధరించే దుస్తులకు నప్పేలా.. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో వజ్రాలు, పూసలు పొదిగిన పాపిట బిళ్లలు ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సెలె బ్రిటీలు సైతం అందమైన మాంగ్టిక్కాలలో మెరిసిపోతున్నారు. నిజానికి ఇదొక ఫ్యాషన్ సంతకం.