Gemini AI | ఫ్యాషన్స్, ట్రెండ్స్, కుకింగ్.. ఇలా ఏదో ఒక కంటెంట్‌ని చేస్తూ యూట్యూబర్‌గా ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు. కొందరు తొలిదశలో తీవ్ర ప్రయత్నాలు చేస్తూ గుర్తింపు కోసం పరితపిస్తుంటారు. ఇలా ఎవరికైనా ఎన్నని కంటెంట్ ఐడియాలు వస్తాయి గనుక? ఏదో ఒకదశలో బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు ‘ఐడియా సర్ జీ..!!’ అంటూ ఏఐ ముందుకొస్తే.
అబ్బో.. అదెలా? అని ఆశ్చర్యపడనక్కర్లేదు. యూట్యూబే అందుకో ప్రత్యేక ఏఐ ఫీచర్‌ని అందుబాటులోకి తెస్తున్నది. అదే మీరు పోస్ట్ చేస్తున్న కంటెంట్ ఆధారంగా ‘నెక్ట్స్వీడియో’ ఐడియాని చెబుతుందట! అందుకు గూగుల్ ఏఐ ‘జెమిని’ సేవల్ని యూట్యూబ్‌కి జతచేశారు. దీంతో యూట్యూబర్లు సులభమైన పద్ధతిలోనే ‘యూట్యూబ్ స్టూడియో’లోనే ఈ ఆప్షన్ని యాక్సెస్ చేయొచ్చు.
ప్రయోగాత్మకంగా పరిమిత యూజర్లకే అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్‌ని ‘బ్రెయిన్ స్టార్మింగ్ విత్ జెమిని’ అని పిలుస్తున్నారు. ఏఐ టూల్స్‌కి యూజర్లు అమితంగా దగ్గరవుతున్న క్రమంలో యూట్యూబర్ల కోసం ఈ ఫీచర్‌ని గూగుల్ తీసుకురావడం ఓ వరమే. కంటెంట్ ఐడియాలు మాత్రమే కాదు, వీడియో టైటిల్స్, వీడియో థంబ్నెయిల్స్ని కూడా ‘జెమిని’ అందిస్తుంది. చేస్తున్న కంటెంట్‌కి సరిపడే వాటిని యూట్యూబర్లు వాడుకోవచ్చు.
వీడియోకి కావాల్సిన ‘డిస్క్రిప్షన్’, కాన్సెప్ట్స్‌ని కూడా ఇది అందిస్తుంది. అంటే.. ఆడియన్స్ పల్స్ పట్టుకోవడానికి ఇక యూట్యూబర్లు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. చానెల్ బ్రాండ్ ఏ మాత్రం తగ్గకుండా క్వాలిటీ చెక్లానూ ఈ ఏఐ ఫీచర్‌ని వాడుకోవచ్చు. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా ఏదైనా తప్పుడు సమాచారం మీ కంటెంట్‌లో ఉంటే.. ఇది ఇట్టే పసిగట్టేస్తుందట. అదీ నేటి ఏఐ మహిమ మరి.