మా అన్నయ్య కొడుక్కి ఇప్పుడు ఆరేండ్లు. ఆ బాబుకు ఇటీవల బాగా వాంతులయ్యాయి. పసరు రంగులోనూ అయ్యాయి. తీవ్ర జ్వరం కూడా వచ్చింది. డాక్టర్ను సంప్రదిస్తే పొట్టలోపల ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి ఆపరేషన్ చేశారు. పొట్టలో అపెండిక్స్ చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. మాములు వాంతులకు మందులిస్తే సరిపోదా? ఆపరేషనే చేయాలా? పసరు వాంతులు పెద్ద ప్రమాదానికి సంకేతమా?
మీరు చెప్పిన వివరాల ప్రకారం బాబుకు పేగుల్లో కదలిక లేకపోవడం లేదా పేగుల ద్వారా ఆహారం, ద్రవాలు కిందికి వెళ్లకుండా ఇన్టెస్టినల్ అబ్స్ట్రక్షన్ జరిగి ఉంటుంది. బహుశా అపెండిసైటిస్ అయి, అది బ్రేక్ కావడం వల్ల పేగులు అతుక్కుపోయేలా చేసి… దారిని మూసేసి ఉంటుంది. మామూలుగా పేగులు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. జీర్ణాశయంలోని జీర్ణరసం, లివర్ నుంచి వచ్చే పైత్యరసం అన్నీ కలిసి చిన్నపేగుల్లోకి చేరుతాయి. ఎప్పుడైతే ఈ పేగుల్లో చలనం పూర్తిగా ఆగిపోయినా, లేదా పేగులు బ్లాక్ అయినా.. చిన్న పేగుల్లో ఉన్నటువంటి పసరు జీర్ణాశయం ద్వారా వాంతుల రూపంలో బయటకి వస్తుంది. ఆకుపచ్చ రంగులో వచ్చే పసరు వాంతులు ఆరోగ్యానికి హానికరం. ఇలా ఆకుపచ్చ రంగులో వాంతులు అయితే.. వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. రోజుల బిడ్డయినా, కాస్త పెద్ద పిల్లాడైనా ఆలస్యం చేయకుండా దవాఖానకు తీసుకువెళ్లాలి. సాధారణంగా చిన్నపిల్లల్లో పసరు వాంతులైనా వాళ్లు పైకి బాగానే కనిపిస్తారు. కానీ, మాల్ రొటేషన్ కండిషన్లో పేగులు మడతపడి పసరు వాంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుణ్ని కలవాలి. పలు సందర్భాల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల పేగుల చలనం ఆగిపోవచ్చు. అప్పుడు కూడా వాంతులు జరుగుతాయి. ఇలాంటప్పుడు ఆపరేషన్ అవసరం రాదు. సాధారణ చికిత్సతో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ, పసరు వాంతులు, మోషన్ నిలిచిపోయి పొట్ట ఉబ్బి కడుపు నొప్పితో వాంతులు జరిగినప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలిసి, సరైన చికిత్స అందించాల్సి ఉంటుంది.