ప్రపంచంలో అన్నింటికన్నా స్వచ్ఛమైనవి ఏవి అంటే… అమ్మపాలు అన్న సమాధానమే తిరుగులేకుండా వస్తుంది. ఎందుకంటే అది వందకు వంద శాతం నిజం. కడుపులో ఉన్నప్పుడు బొడ్డు పేగు ఎంతో, బయటికి వచ్చాక అమ్మపాలు అంత. బిడ్డకు ప్రాణాధారమైన రొమ్ము పాలు ఇటీవలి కాలంలో పూర్తిస్థాయిలో చంటి పిల్లలకు అందడం లేదు. జిప్పులు తీసి పాలిచ్చే సంస్కృతి మొదలయ్యాక తల్లి వెచ్చదనాన్నీ వాళ్లు ఆస్వాదించలేకపోతున్నారు. కడుపులో బిడ్డ ఊపిరి పోసుకున్నప్పటి నుంచి వెయ్యి రోజుల దాకా పెరిగే మెదడుకు దన్నుగా అమ్మపాలు ఉండాల్సిందే అంటున్నారు సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ పి. బాలాంబ. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా తల్లీ బిడ్డలిద్దరికీ పనికొచ్చే వివిధ అంశాలను ఆమె జిందగీతో పంచుకున్నారు. ఆ విలువైన అంశాలు మీకోసం..!
కాలం ఎంత మారినా సృష్టి ధర్మం ప్రకారమే మనిషి పుడతాడు, పెరుగుతాడు. పొత్తిళ్లలో ఉన్నప్పుడు ఆ ప్రాణి ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత ఆవశ్యకం. ప్రాణాధారం. అయితే ఈ రొమ్ముపాలు పట్టడం గురించి ఇప్పటికీ ప్రజల్లో రకరకాల అపోహలు ఉన్నాయి. వాటిని పోగొట్టుకుంటే ఏ అమ్మాయి అయినా చక్కగా అమ్మతనాన్ని ఆస్వాదించవచ్చు. నిజానికి బిడ్డకు పాలు ఇవ్వడం అన్నది అమ్మకు కూడా ఎన్నో రకాల మేలు చేసే విషయమే. అమృత తుల్యమైన ఈ బంధం గురించి ఎంత తెలుసుకుంటే మనం దాన్ని అంతగా ప్రేమిస్తాం.
అమ్మాయి.. అమ్మగా మారడం అన్నది కొంత సంక్లిష్టతతో కూడిన విషయం. శారీరకంగా ఎన్నో మార్పులతో పాటు మానసికంగానూ చాలా భయాలు ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు అప్పటి దాకా అందం మీద శ్రద్ధ ఎక్కువగా పెడతారు. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట సాగడం, రొమ్ములు కూడా పెద్దగా అయ్యి ఆకృతిలో మార్పు రావడంలాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడే కొన్ని అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బిడ్డకు పాలిస్తే వక్షోజాల ఆకృతి దెబ్బతింటుందనీ, అవి సాగిపోయినట్టు అవుతాయనీ అనుకునే వాళ్లు నేటికీ ఉన్నారు. అది అచ్చంగా అపోహే. సాధారణంగా నెల తప్పినప్పటి నుంచే బిడ్డకు పాలు ఇవ్వడానికి ఆడపిల్ల శరీరం సన్నద్ధమవుతూ ఉంటుంది. అందులో భాగంగానే రొమ్ముల సైజు పెరుగుతూ ఉంటుంది. అయిదో నెల నుంచే నీళ్లలాంటి ద్రవాలు కూడా చనుమొనల నుంచి వస్తుంటాయి. పాలిచ్చినంత కాలం వక్షోజాల సైజు పెద్దగానే ఉంటుంది. తర్వాత పొట్టలాగే అది కూడా తగ్గిపోతుంది. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత సంతులిత ఆహారం తీసుకుంటూ చక్కటి వ్యాయామం చేస్తే మళ్లీ అవి బిగుతుగా మారతాయి. చర్మానికి అలాంటి స్వభావం ఉంటుంది. డెలివరీ తర్వాత పాపాయి ఆరోగ్యంతో పాటు మన ఆకృతి మీదా శ్రద్ధ పెడితే రెండింటినీ విజయవంతంగా నిర్వహించొచ్చు. అందుకోసం పాలివ్వడం మానక్కర్లేదు!
బిడ్డకు ఎంత కాలం పాలు ఇవ్వాలి అన్న ప్రశ్న తరచూ ఎదురవుతుంటుంది. ఇక్కడ మనం ఒక విషయం ముందుగా తెలుసుకోవాలి. బిడ్డ ఊపిరి పోసుకున్నప్పటి నుంచి అంటే, కడుపులో పడ్డప్పటి నుంచి వెయ్యి రోజుల పాటు వాళ్ల మెదడు పెరుగుతూనే ఉంటుంది. అంటే, గర్భంలో ఉన్న తొమ్మిది నెలలు కాక సుమారు మరో రెండేండ్ల పాటు ఈ పెరుగుదల కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి అంత కాలమూ తల్లి పాల దన్ను అవసరమే. అయితే బిడ్డ పుట్టిన తొలి ఆరునెలలు అచ్చంగా అమ్మపాలే ఇవ్వాలి. నీళ్లలాంటి వాటి అవసరమూ అస్సలు లేదు. ఆ తర్వాత నుంచి ఉగ్గులాంటి ఆహారం తినిపిస్తూ పాలు పడితే బిడ్డ సంపూర్ణ ఎదుగుదలకు అవి దన్నుగా ఉంటాయి.
పాపాయికి పాలు ఎన్ని సార్లు పట్టాలి అన్నది కూడా అమ్మల నుంచి ఎక్కువగా వినిపించే ప్రశ్న. బిడ్డ పుట్టిన తొలినాళ్లలో రోజుకు ఎనిమిది నుంచి పదిసార్లు పాలు ఇవ్వాలి. రాత్రిపూట అయినా సరే కనీసం రెండు గంటలకొకసారి పాలు ఇవ్వాలి. అలాగే బిడ్డ ఆకలేసి ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వాలి. అయితే బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అన్నది గమనించాలి. పక్క తడిపితే అసౌకర్యంగా ఉండి పిల్లలు ఏడుస్తారు. కడుపులో నొప్పి కలిగినా ఏడుస్తారు. దుస్తులో, పడకో అసౌకర్యంగా ఉన్నా ఏడుస్తారు. వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారో తల్లి గమనించి ఊరడించాలి. కానీ కొందరు పాలు సరిపోకే ఏడుస్తున్నారు అని భావించి చటుక్కున డబ్బా పాలు అలవాటు చేస్తున్నారు. నిజానికి డబ్బా పాలు అలవాటైతే ఇక పిల్లలు రొమ్ము పట్టరు. ఎందుకంటే ఫార్ములా పాలలో చక్కెరలు ఉంటాయి. అందుకే అవి తియ్యగా ఉంటాయి. తల్లి పాలలో ఆ తీపి ఉండదు. అలాగే సీసా నుంచి పాలు సులభంగా నోట్లోకి వస్తాయి. కానీ తల్లి దగ్గర రొమ్ము నుంచి బిడ్డలే పాలు గుంజుకోవాలి. ఇది కాస్త శ్రమతో కూడుకున్న పని. దీంతో వాళ్లు ఇక అమ్మ దగ్గర పాలు తాగేందుకు మొరాయిస్తారు. కానీ తల్లి దగ్గర బిడ్డ పాలు తాగడం వల్ల వాళ్ల ముఖ కండరాలకు చక్కటి వ్యాయామం జరిగి గట్టి పడతారు. మరో విషయం ఏంటంటే బిడ్డ చీకే కొద్దీ పాల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే రాకపోయినా ఇస్తూనే ఉండాలి. అప్పుడే పాల ఉత్పత్తి పెరుగుతుంది.
బిడ్డకు పాలు పట్టేటప్పుడు కూర్చునే భంగిమను జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లీ బిడ్డలిద్దరికీ సౌకర్యంగా ఉండేలా కూర్చోవాలి. పాపాయి తల కింద చేయి వేసి గుండెల దగ్గరికి తీసుకుని పాలివ్వడం అన్నది మంచి పద్ధతి. ఆసుపత్రుల్లో పాలిచ్చే విధానం గురించి మరింత వివరంగా చెబుతారు. అమ్మ, అమ్మమ్మల నుంచి తెలుసుకోవడం కూడా మేలైన విధానమే. ఇక నెలల బిడ్డలకు పాలిచ్చేటప్పుడు ఎంత రాత్రయినా సరే లేచి కూర్చునే ఇవ్వాలి. అలా కాకుండా నిద్రలో పాలిస్తే మనం పొరపాటున వాళ్ల మీదకి వాలినా, లేదా చనుమొన నోటి నుంచి జారి ముక్కులోకి పాలు వెళ్లినా బిడ్డకు ఊపిరి అందకుండా అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇటీవలి కాలంలో తల్లుల వస్త్రధారణ చాలా మారిపోయింది. ఒకప్పటిలా పాలివ్వడానికి అనుకూలంగా ఉండే చీరకట్టు లేదు. డ్రెస్సుల మీద నుంచి పాలివ్వడానికి వీళ్లు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. అయితే మోడ్రన్ గౌన్లు, డ్రెస్లు కూడా పసిపిల్ల తల్లుల కోసం మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటికి రొమ్ము ముందు భాగంలో జిప్పు ఉంటుంది. దాన్ని తీసి బిడ్డకు పాలు ఇస్తున్నారు. కానీ దానిలో నుంచి చనుమొన మాత్రమే బిడ్డకు అందుతుంది. అంతేకాదు, ఆ జిప్పు కూడా పాపాయికి గుచ్చుకుంటూ ఉంటుంది. దాంతో వాళ్లు పాలు సరిగ్గా తాగలేకపోవడమే కాదు, తరచూ ఏడుస్తారు. ఇలాంటి దుస్తులు వేసుకోవడమే గాక, పైగా బిడ్డ పాలు పట్టేటప్పుడు ఏడుస్తున్నదని మా దగ్గరికి తీసుకొస్తున్న తల్లులూ ఉంటున్నారు. సాధారణంగా చంటి పిల్లలు రొమ్ము పట్టుకొని పాలు తాగుతారు. అందుకే ఆ భాగం మొత్తం వాళ్లకు అందివ్వాలి. వాళ్లకది సౌకర్యంగా ఉండటమే కాదు, తల్లి శరీరం నుంచి వెచ్చదనం కూడా అందుతుంది. కానీ జిప్పుల్లో ఆ వెసులుబాటు ఉండదు. వీటితో పోలిస్తే ఎద మధ్య భాగంలో పెద్ద జిప్పు వచ్చేవి కొంత వరకూ మేలు. కాబట్టి పసిబిడ్డ తల్లులు పాపాయి అవసరాలకు అనుగుణంగా డ్రెస్లు ఎంచుకోవాలి. మనతో పాటు బిడ్డకూడా హాయిగా ఉన్నప్పుడే ఎవరైనా చక్కగా మాతృత్వాన్ని అనుభవించగలరు!
ఇప్పుడంతా డిజిటల్ యుగం. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటున్నది. కనీసం రెండు గంటలు కూడా ఫోన్ పక్కకు పెట్టడం లేదెవరూ. కొత్తగా అమ్మ అయిన వాళ్లు కూడా ఇందుకు మినహాయింపేం కాదు. కానీ పసిబిడ్డ దగ్గర ఫోన్ వాడటం అన్నది చాలా ప్రమాదం. దాని నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు (ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్) బిడ్డ మెదడు ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి. దాని వల్ల ఎదుగుదల లోపాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి పాపాయి దగ్గర ఉన్నప్పుడు కానీ, పాలు ఇచ్చేప్పుడు కానీ ఫోన్లో మాట్లాడటం, రీల్స్ చూడటంలాంటివి అస్సలు చేయకూడదు. వాళ్లు తాగుతుంటే మనం వేరే పనిలో ఉండటం అన్నది బిడ్డకు అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. అలా కాకుండా పాలిచ్చే సమయంలో వాళ్ల ముఖం వైపు చూస్తూ, మాట్లాడుతూ ఉండటం అన్నది ఇద్దరి మధ్యా చక్కని బంధానికీ, త్వరగా మాటలు రావడానికీ, చక్కని ఎదుగుదలకూ ఉపయోగపడుతుంది.
పాపాయికి పాలు ఇవ్వడం అన్నది తల్లికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. బిడ్డ శరీరం తల్లి శరీరానికి తగిలేలా పాలు ఇవ్వడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని లవ్ హార్మోన్ అని అంటారు. దీని వల్ల తల్లీబిడ్డల మధ్య బంధం బలపడుతుంది. డెలివరీ అయిన అరగంట గంటలోపే బిడ్డకు పాలు పట్టించాలి. వీటిని ముర్రుపాలు అని పిలుస్తారు. నాలుగు చుక్కలు వచ్చినా సరే ఇవ్వాలి. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. బిడ్డకు జీవితకాలానికి సరిపడా పోషకాహారంలా పనిచేస్తాయి. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లికి ఇచ్చిన వ్యాక్సిన్లు ఈ పాల ద్వారా బిడ్డకు చేరి, డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం…. లాంటి వ్యాధుల నుంచి రక్షణ కవచంలా కాపాడతాయి. అంతేకాదు, డెలివరీ అయిన వెంటనే బిడ్డ పాలు తాగడం వల్ల గర్భాశయం త్వరగా ముడుచుకుపోతుంది. దీని వల్ల రక్తస్రావం అవడం తగ్గుతుంది. అలాగే బిడ్డకు పాలివ్వడం అన్నది గర్భనిరోధకంగానూ ఉపయోగపడుతుంది. పిల్లల మధ్య ఎడం అన్నదీ తల్లి ఆరోగ్యాన్ని కాపాడే అంశమే.