వానలతోపాటే చెదపురుగులూ విజృంభిస్తాయి. తలుపులు, కిటికీలతోపాటు చెక్క ఫర్నిచర్‌పై దాడిచేస్తాయి. లక్షల్లోనే నష్టం కలిగిస్తాయి. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే.. చెదపురుగులకు ఇట్టే చెక్ పెట్టొచ్చు!
వర్షాకాలంలో తలుపులు, కిటికీలను ఎప్పుడూ మూసి ఉంచుతారు. దాంతో ఇంట్లో తేమ పేరుకుపోయి.. చెదపురుగుల బెడద పెరుగుతుంది. వీటిని నివారించడానికి ఇంట్లోకి గాలి ప్రసరణ బాగుండేలా చూసుకోవాలి. చెక్క ఫర్నిచర్‌ను గోడలకు కొంచెం దూరంలో ఉంచాలి.
ఒక స్ప్రే బాటిల్లో వెనిగర్ తీసుకొని.. దానికి నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో చెదలు పట్టిన చోట స్ప్రే చేస్తే.. ఘాటు వాసనకు చెదపురుగులు చనిపోతాయి.
చెదపురుగులను తరిమేయడంలో వేపనూనె అత్యంత ప్రభావం చూపుతుంది. తలుపులు, కిటికీలు, చెక్క ఫర్నిచర్‌పై వేపనూనెను అప్లయి చేయాలి. వేప నూనెలోని ఘాటైన వాసనకు చెదపురుగులు తోకముడుస్తాయి. దీనిలోని ఔషధ గుణాలు.. అవి మళ్లీ మీ ఇంటివైపు చూడకుండా చేస్తాయి.
అలోవెరా జెల్ కూడా చెదపురుగులను నాశనం చేస్తుంది. అవి ఎక్కువగా ఉండే ప్రాంతంలో అలోవెరా జెల్ రాస్తే.. ఊపిరాడక చనిపోతాయి.
లవంగాల నూనెలో క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. చెక్క ఉత్పత్తులపై లవంగాల నూనెను అప్లయి చేస్తే.. చెదపురుగులు పారిపోతాయి.
ఒక లీటర్ నీటిలో కొద్దిగా పటిక కలిపి.. ఆ నీటితో చెదలు పట్టినచోట పిచికారీ చేయాలి. లేదా పసుపు పొడిని చల్లినా.. చెదల బెడద తగ్గుతుంది.
ఒక స్ప్రే బాటిల్లో నీరు తీసుకొని.. ఒక టీ స్పూన్ ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని చెదపురుగులపై స్ప్రే చేస్తే.. చెదపురుగులు డీహైడ్రేషన్‌కు గురవుతాయి. కొద్దిరోజులకే చనిపోతాయి.