ఓటీటీ మూవీ
మనిషిని సృష్టించింది భగవంతుడే అని నమ్మితే.. ఆ భగవంతుడు ముమ్మాటికీ అమ్మే! తల్లి గర్భాలయం నుంచే ప్రపంచమంతా పురుడు పోసుకుంది. బ్రహ్మాండానికి మూలం అమ్మ కడుపులోని అండమే కదా! సృష్టి కార్యంలో అమ్మకు అలసటలు ఉంటాయి. అనుమానాలు వెంటాడుతాయి. వీటన్నిటినీ కాబోయే తల్లి ఎలా ఎదుర్కోవాలో చెప్పిన అమ్మ కథ ‘వండర్ ఉమెన్’! అంజలీ మీనన్ దర్శకత్వం వహించిన ఈ ఇంగ్లిష్ సినిమా ‘సోనీ లివ్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ అవుతున్నది.
అతివ ఎప్పుడూ అద్భుతమే! ఓ కణజాలాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి తరతరాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. బిలియన్ల డాలర్లు ఖర్చుపెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రాణంలేని కణ జాలాన్ని వృద్ధి చేయడంలో కొంత సఫలమయ్యారు కూడా! అయితే, అమ్మలా సృష్టికి ప్రతిసృష్టి చేయడంలో మాత్రం పూర్తిస్థాయి విజయం సాధించలేకపోయారు. కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రయోగశాలల్లో దశాబ్దాలపాటు కృషి చేసినా సాధ్యం కాని అసాధ్యాన్ని అమ్మ తొమ్మిది నెలల్లో సాధించేస్తుంది. ఈ నవ మాసాలూ ఆమెకు దినదిన గండమే! దాన్ని దాటడానికి ఐదుగురు కాబోయే తల్లులు ఓ అమ్మను ఆశ్రయిస్తారు. ఆమె నిర్వహించే ‘సుమన’ హోమ్‌కు వెళ్తారు. అక్కడ ఏం జరిగిందన్నదే ‘వండర్ ఉమెన్’ కథ.
‘సుమన’ అంటే మంచి మనసు! అమ్మ మనసు ప్రశాంతంగా ఉంటేనే బిడ్డకు ఆరోగ్యం. ఆ ప్రశాంతతను చేకూర్చే అందమైన కుటీరం ‘సుమన’. దీని నిర్వాహకురాలు నందితగా నదియా నటించింది. గర్భిణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుందామె. ఇలాంటి సమయంలో ఆడవాళ్ల శరీరంలో కలిగే మార్పులు, వారు ఎదుర్కొనే సమస్యలు, వాటికి పరిష్కారాలు సూచిస్తూ.. ప్రసూతి భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుంది నందిత. ‘సుమన’ హోమ్‌కు వచ్చిన ఐదుగురు గర్భిణుల నేపథ్యాలూ ప్రత్యేకమైనవే! మాతృత్వాన్ని మనసారా ఆస్వాదించాలని కలలు కనే నోరా పాత్రలో నిత్యామీనన్ కనిపిస్తుంది. ప్రేమ వివాహం చేసుకొని, తర్వాత విడాకులు కోరిన మహిళ ఇంకొకరు. సహజీవనం చేస్తూ పెండ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి మరొకరు.
సంప్రదాయ కుటుంబానికి, అత్త పెత్తనానికి అల వాటుపడిన కోడలు వేరొకరు. వీరందరూ తొలిచూలు కలలతో ‘సుమన’లో అడుగుపెడతారు. వీరితోపాటు ఓ మరాఠీ ఇల్లాలు వస్తుంది. రెండుసార్లు గర్భస్రావ నరకాన్ని అనుభవించి, ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం ధరిస్తుందామె. నందిత వీరందరికీ అమ్మదనం గొప్పదనాన్ని వివరిస్తుంది. నెలలు నిండుతున్న సమయంలో మనసు ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలో చెబుతుంది. కసరత్తులు చేయిస్తుంది. ఆటలాడిస్తుంది. హోమ్‌లో పనిచేసే మరో గర్భిణి ఆమెకు
చేదోడు వాదోడుగా ఉంటుంది.
బిడ్డకు జన్మనివ్వడం స్త్రీమూర్తి బాధ్యత. అయితే, అందులో మగవాడి ప్రమేయం ఒక్కపూటతో తీరిపోయింది అనుకుంటే.. పొరపాటు. తొమ్మిది నెలలు ఆమెలా బరువు మోసే కష్టం మగవాళ్లకు లేదు. రోజులో కనీసం తొమ్మిది నిమిషాలు ఆమె గురించి ఆలోచిస్తే చాలు. ఈ బాధ్యతను గుర్తు చేసేలా, ఒకరోజు శిక్షణ తరగతికి ఆయా మహిళల భర్తలను పిలుస్తుంది నందిత. కాబోయే తల్లికి భర్తను మించిన భరోసా మరొకటి లేదని చెబుతుంది. ఇలా అమ్మ అంతరంగంలోని అగాధాలన్నిటినీ పూడుస్తూ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
‘సుమన’లోకి అడుగుపెట్టిన నాడు ఎవరికి వారు అన్నట్టున్న మహిళలు.. మూడు వారాలు గడిచేసరికి ఒకరికొకరు అన్నంత దగ్గరవుతారు. ఆ దగ్గరితనం వారి భయాలను దూరం చేస్తుంది. ఆత్మన్యూనతను పటాపంచలు చేస్తుంది. మనోబలం ఉంటే పురిటినొప్పులు పెద్ద కష్టమేం కాదన్న నమ్మకం కలిగిస్తుంది. ‘సుమన’లో ఆఖరి రోజు.. ఆటపాటలతో అందరూ హాయిగా గడుపుతారు. మరాఠీ ఇల్లాలికి నొప్పులు మొదలవుతాయి. అందరిలో కంగారు. ఈ గర్భిణులే ఆమెను దవాఖానకు తరలిస్తారు. నందిత అండగా ఉండాలంటుందామె! నానా రభస తర్వాత ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి అనుమతిస్తారు. రెండుసార్లు గర్భస్రావాలతో అమ్మదనానికి దూరమైన ఆమె.. పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. మరో ఇద్దరి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
‘వండర్ ఉమెన్’ కథ స్థూలంగా ఇదే అయినా.. సూక్ష్మంగా ఎన్నో సత్యాలను బోధిస్తుంది. చనిపోయిన వ్యక్తిని బతికించే దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అసలు జన్మంటూ ఉంటేనే కదా పునర్జన్మ. ఆ జన్మను ఇవ్వడానికి ఆమె కఠోర తపస్సు చేస్తుంది. ఇష్టాలను చంపుకొంటుంది. అయిష్టమైనా కడుపులో ఉన్న బిడ్డ కోసం కొన్నిటిని భరిస్తుంది. ఆనందాలను వదులుకుంటుంది. అందాన్ని త్యాగం చేస్తుంది. ఆందోళనలకు అలవాటుపడుతుంది.
ఈ ప్రతికూల పరిస్థితులన్నిటినీ పుట్టబోయే బిడ్డ రూపాన్ని ఊహించుకుంటూ మరచి పోతుంది. కడుపులో ఉన్న శిశువు కాళ్లతో తన్నినా ఉబ్బి తబ్బిబ్బవుతుంది. ఆ తల్లి తల్లడిల్లితే పుట్టబోయే బిడ్డకే ముప్పు! ఆ కష్టం తల్లికి రాకూడదంటే ఇంటిల్లిపాదీ ఆమెకు అండగా నిలవాలి. ఆమె మనసు ప్రశాంతంగా ఉండాలి. ‘వండర్ ఉమెన్’.. కాబోయే తల్లుల కథ మాత్రమే కాదు, వారికి కుటుంబసభ్యులు ఎలా సహకరించాలో చెప్పే కథ కూడా.