ఉద్యోగాల్లో మహిళలు స్థిరపడటం కష్టమని, వారు త్వరగా సంస్థను వదిలి వెళ్లిపోతారని కార్పొరేట్ వర్గాలు భావిస్తుంటాయి. అందుకే, మహిళా ఉద్యోగులపై పెట్టుబడి పెట్టడానికి అనాసక్తి చూపిస్తాయి. కానీ, వాస్తవ పరిస్థితులు, సంఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఉద్యోగాన్ని, సంస్థను అంటిపెట్టుకొని ఉండటంలో మహిళలే ముందున్నట్లు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. పురుషులతో పోలిస్తే.. ఆడవాళ్లే 36 శాతం ఎక్కువకాలం ఒకే సంస్థలో కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ‘సాలరీ సే’.. అధ్యయనం ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇందుకోసం సుమారు 47,800 ఈపీఎఫ్వో రికార్డులను విశ్లేషించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన నివేదికలో.. అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.
మహిళలు సగటున 10.6 నెలలు ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో పురుషులు కేవలం 7.8 నెలలు మాత్రమే కొనసాగుతున్నారట. ఇక ఉద్యోగంలో చేరిన మొదటి ఆరు నెలల్లోనే రాజీనామా చేసేవారిలో మాత్రం పురుషులే ముందున్నారు. దాదాపు 44శాతం మంది.. తొలి దశలోనే సంస్థను వదిలేస్తున్నారు. అదే మహిళల్లో 36శాతం మంది కొత్త ఉద్యోగాలను వెతుక్కుంటున్నారట. దీనిని బట్టి మహిళలు ఉద్యోగంలో ఎక్కువ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అర్థమవుతున్నది. అయితే, మహిళలు ఎక్కువ కాలం ఉద్యోగంలో ఉంటున్నప్పటికీ, మొత్తం కార్మిక శక్తిలో వారి ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటున్నది. ప్రధానంగా ఐటీ రంగంలో మహిళల శాతం 13.2శాతం మాత్రమే ఉన్నది.
ఇక మహిళల ప్రాధాన్యం ఎక్కువగా ఉన్న రంగాల్లో విద్యారంగం ముందున్నది. ఇక్కడ 20.3 శాతం మంది మహిళలు పనిచేస్తున్నట్లు అధ్యయనం గుర్తించింది. తయారీ, నిర్మాణ రంగాలలో ఆడవాళ్లకు ఉపాధి లభించడమే కష్టంగా ఉన్నది. కేవలం 3.2 నుంచి 3.6శాతం మాత్రమే ఇక్కడ మహిళలు పనిచేస్తున్నట్లు తేలింది. ఈ నివేదిక.. మరో చేదు నిజాన్ని కూడా బయటపెట్టింది. 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు.. ఉద్యోగాలను వదిలివేసే రేటు ఎక్కువగా ఉన్నది. ఈ సమయంలో 19.5 శాతం మంది మహిళలు సంస్థలను వీడుతుంటే.. పురుషుల వాటా 12.4 శాతం ఉన్నది. వివాహం, పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతలు వంటి సామాజిక అంశాలే.. మహిళలు ఉద్యోగాలు మానేయడానికి ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. మొత్తానికి మహిళలు ఉద్యోగాల్లో రిస్క్ తీసుకోరని, ఎక్కువకాలం ఉండలేరనే అపోహలను.. ఈ అధ్యయనం పటాపంచలు చేసింది. వారికి సరైన మద్దతు, అనుకూలమైన వాతావరణం కల్పిస్తే.. వారు సంస్థలకు గొప్ప ఆస్తిగా మారుతారని స్పష్టం చేస్తున్నది.