అతివ ఆహార్యంలో హ్యాండ్‌బ్యాగ్ తప్పనిసరి! భుజానికి తగిలించుకున్న స్టయిలిష్ బ్యాగ్ మీకు సౌకర్యంగా ఉండాలే కానీ, అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టకూడదు. ట్రెండ్ పేరుతో భారీ బ్యాగులు వేసుకున్నా.. అవసరం ఉన్నవీ, లేనివీ అందులో కుక్కేసినా.. ఇబ్బందే! బరువెక్కిన బ్యాగు కారణంగా భుజం పట్టేస్తుంది. మెడ కండరాలు కుంచించుకుపోయే ప్రమాదమూ ఉంది.
బ్యాగ్‌ను బ్యాడ్ పొజిషన్లో మోస్తే… దీర్ఘకాలిక సమస్యలూ ఉత్పన్నం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, హ్యాండ్‌బ్యాగ్‌ను ఎక్కువ సమయం చేతితో పట్టుకుంటే.. మణికట్టుపై ఒత్తిడి పెరిగి, జాయింట్ ఇన్ఫ్లమేషన్, నర్వ్ కంప్రెషన్ వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. దీనికి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది.
హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్నవీ, లేనివీ అన్నీ పెట్టేసి దాన్నో స్టోర్లా మార్చేయొద్దు. అవసరం ఉన్నవాటికి మాత్రమే అందులో చోటివ్వాలి. బ్యాగును తరచూ భుజాలు మార్చడం వల్ల.. ఒత్తిడి తగ్గుతుంది. అరచేతిలో ధరించే చిట్టి బ్యాగ్ విషయానికి వస్తే.. అత్యవసర వస్తువులు మినహా, అందులో వేరే వాటికి చోటివ్వొద్దు. అప్పుడే.. మీరు ముచ్చటపడి ధరించిన హ్యాండ్ బ్యాగ్ కారణంగా ఏ సమస్యా ఉత్పన్నం కాదు!