బాసో భిన్న రుచిః. ఒక్కో బాస్ వ్యక్తిత్వం.. ఒక్కోలా ఉంటుంది. ఒకరిలో చండశాసనుడు ఉంటే.. మరొకరిలో జాలి, జాలీనెస్ కనిపిస్తుంది. వారి మనసును బట్టే.. కిందిస్థాయి ఉద్యోగుల పనితీరు ఆధారపడి ఉంటుంది. కాబట్టి, బాధ్యతలతోపాటు.. బాస్ మనసునూ గెలవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే.. పనిప్రదేశాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. యాజమాన్యం మనసెరిగి ఉండటం.. వృత్తిపరమైన వృద్ధికి, కొత్త అవకాశాలకూ తలుపులు తెరుస్తుంది.
బాస్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగించాలంటే.. ముందు తన ప్రాధాన్యతలు, లక్ష్యాలు, తను ఎదుర్కొనే ఒత్తిళ్లను అర్థం చేసుకోండి. అందుకు తగ్గట్టుగా మీరూ బాధ్యతలు తీసుకోండి. ‘అది నా పని కాదు!’ అన్నట్లుగా వ్యవహరిస్తే.. మీ ఎదుగుదల అక్కడే ఆగిపోతుందని గుర్తుంచుకోండి.
మంచి కమ్యూనికేషన్.. యాజమాన్యానికి – ఉద్యోగికి మధ్య నమ్మకమైన బంధాన్ని బలపరుస్తుంది. అందుకే, ఇద్దరి మధ్య మాటలకు మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకండి. పనికి సంబంధించిన విషయాలపై నేరుగా వారితోనే సంభాషించండి. ఈమెయిల్‌లు, ఫోన్‌కాల్స్, ముఖాముఖి సంభాషణలు.. ఎలాగైనా బాస్‌తో కమ్యూనికేట్ అవ్వండి. ఇది.. మీ బంధానికి హాని కలిగించే అపార్థాలనూ నివారిస్తుంది.
మీకు అప్పగించిన పనిని ప్రాణం పెట్టి పూర్తిచేయండి. ‘ది బెస్ట్ ఔట్పుట్’ ఇవ్వడానికి ప్రయత్నించండి. నాణ్యమైన పనిని.. సమయానికి అందించడం వల్ల మీ శక్తిసామర్థ్యాలపై మీ బాస్‌కు విశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలు తీసుకోవడంతోపాటు సవాళ్లు తలెత్తినప్పుడు జవాబుదారీగా ఉండండి.
మీ వర్క్ ఔట్‌పుట్‌పై బాస్ అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. ఏవైనా సమస్యలుంటే.. రక్షణాత్మకంగా వ్యవహరించకండి. తన అభిప్రాయానికి సానుకూలంగా ప్రతిస్పందించండి. మీ పనితీరును మరింత మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నించండి.
పని సామర్థ్యం కన్నా.. వృత్తిపరమైన విశ్వసనీయత, నమ్మకం చాలా ముఖ్యం. సంస్థపట్ల విశ్వసనీయంగా ఉండటం, పనిని బాధ్యతగా నిర్వహించడం.. యాజమాన్యానికి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ఇక మీరు ఎంత పనివంతులైనా, పనిపై ఎంత పట్టు ఉన్నా.. బాస్ దగ్గర కుప్పిగంతులు వేయకండి. ‘నాకు తెలుసు!’ అన్న వ్యవహారశైలిని వదిలివేయండి. బాస్ అభిప్రాయాలు, సలహాలు-సూచనలకు తప్పకుండా స్థానం ఇవ్వండి.