మా పాప వయసు మూడు సంవత్సరాలు. ఆడుకుంటూ ఉన్నప్పుడు..అకస్మాత్తుగా చేతిలో నొప్పి అన్నది. చేయి మలవలేకపోయింది. ఆడేప్పుడు కింద పడలేదు. ఎటువంటి దెబ్బా తగల్లేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. డాక్టర్లు ‘ఇది పుల్డ్ ఎల్బో’ అని చెప్పారు. చేతిని లాగి, అడ్జస్ట్ చేశారు. ఇంత చిన్న పిల్లలకు జాయింట్ నుంచి ఎముక బయటికి వస్తుందా? ఇది ప్రమాదకరమా? దీనితో భవిష్యత్‌లో ఇబ్బంది వస్తుందా?
మీరు చెప్పే వివరాల ప్రకారం మీ పాప సమస్య పుల్డ్ ఎల్బోలానే అనిపిస్తున్నది.
ఇది ఆకస్మాత్తుగా, మనం బిడ్డ చేతిని సరైన పద్ధతిలో లాగడం ద్వారా సరిచేయొచ్చు. ఒకటి నుంచి అయిదు సంవత్సరాలలోపు పిల్లల్లో ఇది చాలా సాధారణం. ఈ సమస్య ఎక్స్‌రేలో కూడా తెలియదు. పిల్లల వైద్యులు, ఆర్థోపెడీషియన్, అత్యవసర వైద్యులు దానిని గుర్తించి, చేయిని సరైన దిశలో తిప్పి సరిచేయవచ్చు. ఇది ప్రమాదకరం కాదు. ఇరవై శాతం మంది పిల్లల్లో మళ్లీ ఆ సమస్య రావొచ్చు. కానీ, భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే తల్లిదండ్రులు బాగా భయపడతారు. నొప్పికి మందు ఇవ్వడం, ఎముకను అడ్జస్ట్ చేస్తే పూర్తిగా నయం అవుతుంది. కట్టు కట్టించాల్సిన అవసరం లేదు. కాబట్టి అనవసరమైన మందులు తీసుకోవడం, కట్టు కట్టించుకోవడం వృథా ఖర్చే! బిడ్డకు దీనితో భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
-డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్