Vinayaka Chavithi | ఏనుగంత ఏలిక ఎలుక వాహనంపై తరలి వచ్చేది ఈరోజే. చవితి సంబురాలతో ఊరూవాడా మురిసిపోతున్నాయి. గణేశుడి మంటపాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. వాద్యహోరులో వీధులన్నీ మార్మోగుతున్నాయి. ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ’ నినాదాలు కైలాసం దాకా వినిపిస్తున్నాయి. ఇంత వేడుకగా వినాయకుడి పండుగ జరుగుతున్నా.. బొజ్జ గణపయ్య మాత్రం ఒకింత చిన్నబుచ్చుకునే ఉన్నాడనిపిస్తుంది. ఇందుకు కారణాలు అనేకం..
భక్తికి కరిగిపోయే కరిరాజముఖుడిని.. రంగుల హంగులతో కొలువుదీరుస్తున్నాం. మట్టిలోంచి పుట్టిన మహాగణపతిని.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తీర్చిదిద్దుతున్నాం. ప్రకృతి-పురుషుల గారాలపట్టిని.. పర్యావరణానికి హాని తలపెట్టే విధంగా రూపుదిద్దుతున్నాం.
గణపతి పూజలో ఓ పవిత్రత కనిపిస్తుంది. మృణ్మయ మూర్తిని తయారుచేయడం, వీధి వీధిలో విగ్రహాలు నెలకొల్పడం, 21 పత్రులతో అర్చించడం.. ఇలా గజాననుడి పూజలో ప్రతీ అంకం ప్రకృతికి నవ వసంతం తెచ్చేదే! విగ్రహాల తయారీకి చెరువుల్లో పూడిక తీయడం వల్ల… తటాకాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే శక్తి సమూహానికి ఉంటుంది. వినాయక మంటపాల ఏర్పాటు, నవరాత్రుల నిర్వహణ, నిమజ్జనోత్సవం ఇవన్నీ ఎవరికి వారే అన్నట్టుండే సమాజాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేవే! వినాయక పూజలో ఉపయోగించే పత్రాలన్నీ ఆయుర్వేదం అద్భుతాలని కొనియాడినవే! అనంత చతుర్దశి నాడు వినాయకుడితోపాటు పత్రాలన్నిటినీ చెరువులో నిమజ్జనం చేస్తాం. శ్రావణ, భాద్రపదాల్లో వర్షాల కారణంగా ఉరకలై వచ్చిన వరద జలాలను ఈ ఔషధీ లక్షణాలున్న పత్రి ప్రక్షాళన చేస్తుంది.
యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవత గణపతి. మూలాధారం భూ తత్వం కలిగి ఉంటుంది. కాబట్టి, భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి, మూలాధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి. దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది.
చెరువు పూడిక తీయడం, పత్రాలతో జలవనరులను శుద్ధి చేయడం చవితి పండుగ లక్ష్యం. దీనిని పాటించకపోగా, భారీ ఎత్తులో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను నీళ్లలో నిమజ్జనం చేసి నీటిని మరింత కలుషితం చేస్తుంటే.. ఆ లంబోదరుడు బాధపడకుండా ఉంటాడా? రసాయనాలు కలిపిన రంగులు మంచినీటిలో కలిసిపోయి.. జలచరాలకు, ఆ నీటిపై ఆధారపడే మానవాళి ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తుంటే.. వినాయకుడు విస్తుపోకుండా ఉండగలడా? ఆ స్వామి పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే.. మట్టి వినాయకుడే మహా గణపతి అని ఎవరికి వారు తీర్మానించుకోవాలి. గృహస్తులు మట్టి వినాయకుడి పూజకే ప్రాధాన్యం ఇస్తుండటం సంతోషకరం. ఈ వైఖరి మంటపాల్లో కొలువుదీర్చే విగ్రహాలకూ వర్తింపజేస్తే ఏకదంతుడి సేవ అనేక ప్రయోజనాలకు దారి చూపుతుంది.
గణేశ ప్రతిమ నిర్మాణానికి బంకమట్టి శ్రేష్ఠం. శివారాధనలో పార్థివ లింగం (మట్టితో చేసిన లింగం) ఎంత మహిమాన్వితమైనదో.. మట్టితో చేసిన వినాయకుడి పూజ కూడా అంతే గొప్పది. గణేశ పురాణంలో 49, 50 అధ్యాయాల్లోనూ చవితినాడు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించాలని కనిపిస్తుంది. వినాయకుడి విగ్రహం తయారీ గురించి కూడా అందులో స్పష్టంగా ఉంది.