ఆధునిక సాంకేతికత.. మనుషుల మధ్య అంతరాలను తగ్గిస్తున్నది. దేశాల హద్దులను చెరిపేస్తూ.. ప్రపంచాన్ని మరింత దగ్గర చేస్తున్నది. ఆఫ్రికా అడవుల్లోని అబ్బాయికి.. అమెరికా అమ్మాయికి మధ్య ఆన్లైన్లోనే స్నేహం చిగురిస్తున్నది. అయితే వీరిమధ్య భావాలు కలిసినా.. భాష ప్రధాన అడ్డంకిగా మారుతున్నది. దీన్ని గుర్తించిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
అన్ని భాషలనూ మాతృభాషలోకి మార్చేసే ‘మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్’ వెసులుబాటు కల్పించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు యాప్‌లోనే చాట్ మెసేజ్‌లను అనువాదం చేసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో వేరే భాషలో వచ్చిన సంభాషణలను సొంత భాషలో చదువుకోవచ్చన్నమాట. దీనిద్వారా విభిన్న భాషలు మాట్లాడే వ్యక్తులు ఒకరితో ఒకరు చాలా సులభంగా కమ్యూనికేట్ అవ్వొచ్చు.
ముఖ్యంగా ఇతర దేశాల్లో పర్యటించేటప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ‘ఆండ్రాయిడ్’లో నాలుగైదు నెలల నుంచే అందుబాటులో ఉన్న ఈ ‘మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్’.. త్వరలోనే ఐఓఎస్ వినియోగదారులకూ చేరువకానున్నది. ఇంకేముంది.. ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోండి. ‘మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్’తో ప్రపంచ భాషల్లో విహరించి రండి. ఐఫోన్ యూజర్లు.. విహరించడానికి సిద్ధంగా ఉండండి.