భారత్‌లో పులులను సందర్శించడం.. ఒక గొప్ప అనుభవం.అందులోనూ అడవుల్లోని సహజ ఆవాసాల్లో వాటిని వీక్షించడం.. మరింత అద్భుతం. అలాంటి ‘టైగర్ అడ్వెంచర్’కు ఇదే సరైన సమయం. అయితే, వ్యాఘ్రాన్ని శీఘ్రంగా చూడాలంటే.. అందుకు అనువైన ‘టైగర్ రిజర్వ్’ను ఎంచుకోవడం ముఖ్యం.సఫారీ అంటే.. అడవి జంతువులను వీక్షించడం మాత్రమే కాదు. ఆ అడవిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం. ప్రకృతితోపాటు ఆ పరిసరాలనూ ఆస్వాదించడం. అప్పుడే మీరు చూడాలనుకున్న అడవి జంతువులు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. లేకుంటే, పులికాదు కదా.. పిల్లికూడా కనిపించని పరిస్థితి ఎదురవుతుంది. మీ సఫారీ కూడా అలా కావొద్దంటే.. ఈ సూచనలు పాటించాల్సిందే!
ఎక్కువ పులులు ఉండే నేషనల్ పార్క్‌కు వెళ్తే.. పులి తప్పకుండా కనిపిస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, వాస్తవం వేరుగా ఉంటుంది. ఎన్ని పులులు ఉన్నాయన్నది ముఖ్యంకాదు. అవి ఎంత తరచుగా బహిరంగ ప్రదేశాలు, సఫారీ మార్గాలను ఉపయోగిస్తాయనేది కీలకం. మనదేశంలో అత్యధిక పులుల సాంద్రత కలిగినవాటిలో బాంధవ్‌గఢ్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లు ముందుంటాయి. కానీ, ‘తడోబా’లోనే వాటిని చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బాంధవ్గడ్, కార్బెట్ పార్కుల్లో చిక్కటి అడవి వల్ల పులులు బయటికి రావడానికి ఆసక్తి చూపించవు. అదే తడోబాలో.. బహిరంగ ప్రదేశాల్లోనే ఎక్కువగా సంచరిస్తుంటాయి. కాబట్టి, ఈజీగా కనిపిస్తాయి.
ఇక సఫారీకి దగ్గరగా వచ్చినప్పటికీ, కొన్నిసార్లు పులులు కనిపించని పరిస్థితి ఉంటుంది. అందుకు అడవి నిర్మాణమే కారణం. బహిరంగ భూభాగం స్పష్టంగా కనిపిస్తే.. పులులు కూడా సులభంగా మన కంటికి చిక్కుతాయి. ఈ విషయంలో రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్ ముందుంటుంది. అక్కడి పొడి అడవులు, విశాలమైన సరస్సులు, రాతి గట్ల కారణంగా.. అద్భుతమైన టైగర్ సఫారీ అనుభవం దక్కుతుంది. అదే కన్హా, సుందర్బన్స్ పార్కుల్లో దట్టమైన అడవుల కారణంగా.. పులులను వీక్షించడం సవాల్‌గా మారుతుంది. అందుకే, సఫారీలో అద్భుతమైన విజువల్స్, మంచి ఫొటోగ్రఫీ కావాలంటే.. రణతంబోర్‌ను ఎంచుకోండి.
ఇక ఉష్ణోగ్రత, నీటి లభ్యత, వృక్షసంపదను బట్టి పులుల కదలిక కూడా మారుతుంది. ఉదాహరణకు వేసవిలో బాంధవ్‌గఢ్, కన్హా ప్రాంతాలలో పులులు తరచుగా నీటి గుంతల వద్దకు వస్తుంటాయి. అక్కడి పచ్చికమైదానాల్లోని గడ్డి ఎండిపోవడం వల్ల పులులు చాలా సులభంగా
కనిపిస్తాయి. జిమ్ కార్బెట్ పార్కులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే, వేసవిలో సఫారీ చేద్దామని అనుకుంటే.. బాంధవ్‌గఢ్, కన్హా, జిమ్ కార్బెట్‌ను ఎంచుకోవచ్చు. శీతాకాలపు పర్యటనలకు రణతంబోర్, తడోబా బెస్ట్ ఆప్షన్స్!