పిల్లల పెంపకంలో అమ్మమ్మలు, నానమ్మల అనుభవానికి తిరుగులేదు. మహానగరాల్లో.. అదీ చిరు కుటుంబాల్లో పెరిగే చిన్నారులకు ఆ ప్రేమపూర్వక సంరక్షణ లభించదు. అయితేనేం, అచ్చంగా అమ్మమ్మ చెప్పినట్టుగా అన్నీ ఆన్లైన్లోనే నేర్పుతుంది కిండర్ పాస్. ఎప్పుడు తినిపించాలో, ఏం తినిపించాలో అమ్మలకు వివరిస్తుంది. బుడిబుడి అడుగులు వేయించడం ఎలాగో, ముద్దుముద్దు మాటలు పలికించడం ఎలాగో కూడా బోధిస్తుందీ వర్చువల్ అమ్మమ్మ!
నిన్నటి తరానికి పిల్లల పెంపకం పెద్ద కష్టమైన వ్యవహారమేం కాదు. పురిటికి పుట్టింటికి పోతే.. తల్లిని, బిడ్డను అమ్మమ్మలు, జేజమ్మలు ప్రేమగా చూసుకునేవారు. అపార జీవితానుభవంతో ఎప్పుడు ఏం చేయాలో అది చేసేవారు. బిడ్డ అవసరాలు, ఇబ్బందులు గుర్తించేవారు. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. ఉమ్మడి కుటుంబాలు మూడు తరాల క్రితమే అంతరించాయి. న్యూక్లియర్ ఫ్యామిలీలు పుట్టుకొచ్చాయి. అమ్మ, నాన్న, బాబు మరియు పాప కాదంటే.. అమ్మ, నాన్న, బాబు లేదా పాప.. ఇంతే కుటుంబమంటే.
బిడ్డకు ఏం కావాలో అర్థం చేసుకోలేకపోవడం ఒక సమస్య అయితే, బిడ్డ అవసరాల్ని ఎలా తీర్చాలో తెలియకపోవడం మరో సమస్య. ఈ రెండు ఇబ్బందులతో సతమతమయ్యే తల్లులు నమ్ముకునేదొక్కటే.. పుట్టింటి ఫోన్‌కాల్. కొంతమంది తమ బంధువుల్లో డాక్టర్లు ఉంటే కనుక.. వాళ్లకు వీడియో కాల్ చేసి కనుక్కుంటారు. అయినా, అందరికీ డాక్టరు బంధువులు లేకపోవచ్చు. ఇరవైకోట్ల పైచిలుకు పిల్లలకు నిలయమైన దేశంలో.. ఉన్నదే 23 వేల మంది పీడియాట్రిషన్లు. ఫ్రీగా కాదు కదా, ఫీజు కట్టి చూపిద్దామన్నా ఏ డాక్టరూ అరగంట సమయం కూడా ఇవ్వరు. అలాంటప్పుడు బిడ్డల బాధలు ఎవరికి అర్థం అవుతాయి?
అనుభవంలో నుంచి..
షిరీన్ సుల్తానాకు బాబు పుట్టినప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే దగ్గరి బంధువైన డాక్టర్ ఆంటీకి కాల్ చేసేది. పొరుగిళ్లలోనూ చాలామంది తల్లులు పిల్లల పెంపకంలో చిన్నాపెద్దా పొరపాట్లు చేయడం ఆమె గుర్తించింది. సరైన పెంపకం లేకపోతే.. బిడ్డల బంగారు భవిష్యత్ ఆగమవుతుందని షిరీన్‌కు అర్థమైంది. దీంతో, తన పిల్లలు కొంత ఎదిగిన తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరాలనే ఆలోచనను పక్కన పెట్టి.. బిడ్డల పెంపకంలో తల్లులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం వెతకడం మొదలుపెట్టింది. మన పెద్దలే జవాబులు సిద్ధం చేశారనీ, తాను కొత్తగా కనిపెట్టాల్సినదేమీ లేదనీ త్వరలోనే ఆమెకు అర్థమైంది.
ఇద్దరమ్మల ప్రయాణం..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-ఇండోర్‌లో ఎంబీఏ చదివింది షిరీన్. అక్కడే తనకు సుమేధ పరిచయం. ఇద్దరూ రూమ్మేట్స్ కూడా. షిరీన్ మార్కెటింగ్ జాబ్‌లో చేరింది. ఢిల్లీలో పుట్టిపెరిగిన సుమేధ సింగపూర్ వెళ్లింది. అక్కడే.. ‘కిండర్ పాస్’ పేరుతో చిన్న ప్లే సెంటర్ లాంటి కిడ్స్ కేర్ యూనిట్ ప్రారంభించింది. సుమేధ వాళ్ల ఇంట్లో చాలామందే డాక్టర్లు ఉన్నారు. పిల్లల పెంపకం, ఆహారం, సైకాలజీ, అలవాట్లు, వైద్యం, ఎదుగుదల.. తదితర విషయాలు వాళ్లకు తెలుసు. అంతేకాదు, వివిధ జర్నల్స్ ఇంటికొచ్చేవి. ఆ విషయాలన్నీ పుస్తకాలకే పరిమితం కాకుండా, తల్లులందరికీ తెలియజేయాలన్నది కిండర్ పాస్ స్థాపన వెనకున్న లక్ష్యం. ఈ విషయం తెలిసి షిరీన్ చాలా సంతోషించింది. తనదీ అలాంటి అన్వేషణే. అయితే ఎక్కడో సింగపూర్‌లో ఉన్నవాళ్లకు తెలిస్తే సరిపోదు కదా. ప్రపంచంలోని తల్లులందరి సమస్యలూ తీర్చే పనేదో చేద్దామని సుమేధతో అన్నది. ఇద్దరూ కలిసి టెక్నాలజీ ఆధారంగా పిల్లల పెంపకంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ‘కిండర్ పాస్’ పేరుతో ఓ యాప్ తీసుకురావాలని అనుకున్నారు. ఆ ప్రయత్నంలో 500 కుటుంబాలను సర్వే చేశారు. వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ అనుభవాలన్నీ యాప్‌లో జోడించారు.
సమాచారం సిద్ధం
కిండర్ పాస్ యాప్‌లో నమోదు చేసుకుంటున్నప్పుడు.. బిడ్డ తన తల్లి కడుపులో ఎన్ని నెలలు ఉన్నది, ఎన్ని నెలలకు పుట్టింది.. తదితర వివరాలు చెబితే చాలు. చిన్నారికి ఎప్పుడు ఏం చేయాలో కిండర్ పాస్ నిత్యం గుర్తు చేస్తుంది. ‘పిల్లలకు ఏ వయసులో ఏం ఇవ్వాలి. ఎప్పుడు రంగులు చూపించాలి. ఎప్పుడు అక్షరాలు నేర్పాలి. ఎప్పుడు నడిపించాలి. ఎప్పుడు మాటలు పలికించాలి?’ తదితర విషయాలన్నీ.. ఏ రోజుకారోజు మెసేజ్‌ల రూపంలో గుర్తుచేస్తుంది. వారంవారం, నెలనెలా బరువు, ఎత్తు నమోదు చేయమని అడుగుతుంది. ఆ పెరుగుదల ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఉన్నదీ లేనిదీ చెబుతుంది. పిల్లల ఎదుగుదలను గ్రాఫ్ రూపంలో వివరిస్తుంది. ఏవైనా లోపాలుంటే విశ్లేషిస్తుంది. పిల్లలు కొంత పెద్దవాళ్లయ్యాక అక్షరాలు, పదాలు, జంతువులు, రంగుల గురించి ఎలా నేర్పాలో చెబుతుంది. ఇలా పిల్లలకు అయిదేళ్ల వయసు వచ్చే వరకు అమ్మమ్మలాగే అన్నీ చూసుకుంటుంది కిండర్ పాస్. పిల్లల వ్యాక్సినేషన్‌కు సంబంధించిన విషయాలూ ఇందులో ఉంటాయి. పసిబిడ్డలకు ఏదైనా సమస్య వస్తే యాప్ ద్వారా న్యూట్రిషనిస్ట్‌ను, సైకాలజిస్ట్‌ను, ఫిజియోథెరపిస్ట్‌ను, మాంటిస్సొరీ టీచర్‌ను సంప్రదించవచ్చు. 2020 జనవరిలో కిండర్ పాస్‌ను బీటా వెర్షన్లో లాంచ్ చేశారు. ఏడాది క్రితం ఈ యాప్‌లో హిందీ వెర్షన్ కూడా వచ్చింది. త్వరలో తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో కూడా వస్తుందని షిరీన్ ప్రకటించింది. ఇప్పటి వరకు దాదాపు పందొమ్మిది లక్షల డౌన్లోడ్స్ నమోదు అయ్యాయి. ఈ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టుల్ని కూడా ఆకర్షించింది. వివిధ సంస్థలు అయిదు లక్షల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాయి. మొత్తానికి ఇద్దరు అమ్మల శ్రమ వృథాగా పోలేదు.