వరలక్ష్మీ వ్రతానికి కలశం పెట్టుకుని పూజ చేసుకొనే సంప్రదాయం చాలా ఇండ్లలో ఉంటుంది. కలశం చెంబు మీద కొబ్బరికాయ ఉంచి, దానికి జాకెట్టు ముక్కని త్రికోణాకృతిలో చుట్టి బొట్టు పెట్టి అలంకరిస్తారు. అందులోకే వరలక్ష్మీ దేవిని ఆవాహన చేస్తారు. అయితే ఇలా వినియోగించేందుకు సాదా జాకెట్టు ముక్కల స్థానంలో ఇప్పుడు అమ్మవారి ముఖం అచ్చు వేసినవి వస్తున్నాయి. దాంతో కలశం మరింత అందంగా కనిపిస్తుంది. చూడచక్కని రంగులతో పెయింటింగ్ తరహాలో వీటిని అచ్చు వేస్తున్నారు.
కొన్నింటిలో అయితే దేవి ముఖ భాగాన్ని రంగు రంగుల రాళ్లు, పూసలు, కుందన్లు, కాసులతో అలంకరిస్తున్నారు. అమ్మవారికి నగలు వేసినట్టుగా కనిపిస్తాయివి. వరలక్ష్మీదేవి విగ్రహాన్ని తయారు చేసి పూజించే సంప్రదాయం లేని కుటుంబాల్లో, ఇలా కలశం పెట్టుకుని వ్రతం చేసుకునేప్పుడు మంటపానికి కొత్త శోభను తెస్తాయివి. అమెజాన్లాంటి ఆన్లైన్ వెబ్సైట్లలోనూ, ఫ్యాన్సీ షాపుల్లోనూ రకరకాల రంగుల రవిక ముక్కల మీద ముద్రించి దొరుకుతున్నాయివి. ఇక, వీటితో ఈసారి వ్రతానికి కొత్తదనం వచ్చినట్టే మరి!