‘వాలెంటైన్స్ డే’ రోజున ప్రేమికులు అందమైన రోజాలను ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ప్రేమను ఆ పూలతోనే వ్యక్తపరుస్తారు. అయితే, ఈ అందమైన పువ్వుల వెనుక పర్యావరణానికి హాని కలిగించే చీకటి కోణాలు ఉన్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ప్రేమికుల దినోత్సవం సందర్భంగానే.. వేల టన్నుల కర్బన ఉద్ఘారాలు విడుదల అవుతున్నాయట. వ్యవసాయంలో రసాయనాల వినియోగం గురించి తెలిసిందే! అయితే, ఆహార పంటలపైనే అధిక నియంత్రణ ఉంటుంది. పూల పెంపకంలో ఇలాంటి నిబంధనలు ఏమాత్రం ఉండవు. అందుకే, గులాబీలు, ఇతర పూలను సాగుచేయడానికి శక్తిమంతమైన రసాయనాలను ఉపయోగిస్తుంటారు.
ముఖ్యంగా, గులాబీలు పర్ఫెక్ట్గా రావడానికి హానికర రసాయన మందులను వాడుతుంటారట. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆహార పంటలతో పోలిస్తే.. పూల సాగులో 50 రెట్లు ఎక్కువ పురుగుమందులు వాడుతున్నారట. ఈ క్రమంలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లోని ఇలాంటి పూల తోటల్లో పనిచేసే కార్మికులు.. తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. పురుగుమందుల ప్రభావంతో చర్మ సమస్యలు, కళ్ల మంటలతోపాటు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక పూలు కోసిన తర్వాత అవి వాడిపోకుండా ఉండటానికి రసాయన ద్రావణాలలో ముంచుతారు.
ఆ పూలను ముట్టుకున్నప్పుడు, వాటి వాసన చూసినప్పుడు ఆ రసాయనాల అవశేషాలు మీ శరీరంలోకి చేరే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాదు, గ్రీన్హౌస్ సాగు ద్వారానే పూలు ఎక్కువగా సాగవుతున్నాయి. వీటిని వెచ్చగా ఉంచడానికి గ్యాస్, విద్యుత్‌ను విపరీతంగా వాడుతుంటారు. ఇది గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తుంది. ఇక గులాబీలను ప్యాక్ చేయడానికి వాడే ప్లాస్టిక్ షీట్లు, సెలోఫెన్ పేపర్లు, సింథటిక్ రిబ్బన్లు.. భూమికి ఎనలేని నష్టాన్ని కలిగిస్తున్నాయి. అందుకే, నవతరం ప్రేమికులు ప్రకృతినీ ప్రేమించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. విదేశాల నుంచి వచ్చే గులాబీలను పక్కన పెట్టేసి, స్థానికంగా దొరికే సీజనల్ పూలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌కు ‘నో’ చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు.