నేడు కవలల దినోత్సవం
వన్ ప్లస్ వన్ ఆఫర్.. కొన్నిసార్లు మాతృత్వానికి కూడా వర్తిస్తుంది. ఒక్క నలుసు చాలనుకుంటున్న సమయంలో.. గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారిస్తారు. అంతే.. అమ్మానాన్నలకు ఆశ్చర్యం, ఆనందం. అంతలోనే కొంత భయం! డెలివరీ సురక్షితంగా అవుతుందో లేదో అన్న అనుమానం. ఇద్దరు పిల్లలకు చనుబాలు సరిపోవన్న అనిశ్చితి. పెంపకం విషయంలో కూడా సవాలక్ష సందేహాలు. నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం. ఈ సందర్భంగా రాముడు-భీముడు, కదలడు-వదలడు, సీత-గీత, గంగ-మంగ వగైరా వగైరా పండంటి కవలల తల్లిదండ్రులకు చిన్నపిల్లల వైద్య నిపుణురాలుడాక్టర్ ఉషారాణి సలహాలు, సూచనలు..
అసలు, గర్భంలో ఉన్నది కవలలే అన్న విషయం ఏ నెలలో నిర్ధారిస్తారు?
గర్భం దాల్చిన ఏడు నుంచి ఎనిమిది వారాల్లో అంటే.. రెండో నెలలో కడుపులో కవలలు ఉన్న విషయం తెలిసిపోతుంది. గర్భస్థ పిండాల్లో ఆ తేడా స్పష్టంగా గోచరిస్తుంది.
పొట్టలో కవలలు ఉన్న మహిళల్లో ప్రత్యేక లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా?
సాధారణంగా మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. తరచూ వాంతులు అవుతున్నట్టు అనిపిస్తుంది. ఉమ్మనీరు కూడా అధికమే. దీనివల్ల పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది.
కడుపులో కవలలు ఉన్నప్పుడు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
ఇలాంటి తల్లులకు రిస్క్ ఎక్కువ. తల్లితో పాటు శిశువులు కూడా ప్రమాదం అంచున ఉన్నట్టే. కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఒక్కోసారి ఒకరికి తక్కువగా, ఒకరికి ఎక్కువగా రక్త ప్రసరణ జరిగే ఆస్కారం ఉంది. దీన్నే వైద్య పరిభాషలో ‘ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్’ అంటారు. ఇలాంటి సమయాల్లో ఒక బిడ్డ తల్లి గర్భంలోనే మరణించే ప్రమాదం ఉంది. అందుకనే గర్భస్థ పిండం హృదయ స్పందనలను క్రమం తప్పకుండా పరీక్షించాలి. ఎదుగుదలను గమనిస్తూ ఉండాలి. పిండం బరువును బట్టి కూడా శిశువు ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ఒక బిడ్డ బరువు పెరుగుతుంది. ఇంకో బిడ్డ పెరగదు. అలా గర్భస్థ కవలల మధ్య ఐదు వందల గ్రాముల తేడా ఉంటే మాత్రం.. ‘ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్’ ఉన్నట్లు. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స అందించాలి.
డెలివరీ విషయంలో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి?
గర్భంలో కవలలు ఉన్నప్పుడు.. డెలివరీ సమయంలోనూ అనేక ఇబ్బందులు వస్తాయి. అందుకనే, నవజాత శిశువుల కోసమే ప్రత్యేకించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్న దవాఖానలోనే డెలివరీ సురక్షితం. కొన్నిసార్లు బిడ్డలు పుట్టగానే ఏడవరు. కొన్నిసార్లు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఫిట్స్ వచ్చే ఆస్కారమూ ఉంది. ఆ సమయంలో వైద్య పరంగా ఏ సవాలు వచ్చినా ఎదుర్కోవడానికి నిపుణులు సిద్ధంగా ఉండాలి.
ప్రసవ సమయంలో ప్రత్యేక వైద్య బృందం అవసరమా?
ముందే చెప్పినటు,్ట ఎన్ఐసీయూ ఉన్న హాస్పిటల్లోనే డెలివరీ చేయించుకోవాలి. ప్రసూతి సమయంలో కచ్చితంగా ఇద్దరు పీడియాట్రీషియన్స్ ఉండాలి. ఎందుకంటే, ఏకకాలంలో ఇద్దరు శిశువులను చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రెండు రిసాక్సేషన్ కిట్స్ అవసరం అవుతాయి. సాధారణంగా గర్భంలో కవలలు ఉన్నప్పుడు.. ప్రిమెచ్యూర్ డెలివరీ జరుగుతుంది. ఇలాంటి బిడ్డల్లో శ్వాసకోశ సమస్యలు ఎక్కువ. వెంటిలేటర్స్ అవసరం కావచ్చు కూడా.
కవలల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు?
ఒకప్పుడు ఇంట్లోనే ప్రసూతి జరిగేది. హాస్పిటల్స్‌కు వచ్చేవారు కాదు. అవగాహన కూడా తక్కువే. అందువల్లే కవలల్లో మరణాల రేటు భారీగా నమోదు అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నిలోఫర్ వంటి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కూడా వెంటిలేషన్, సి-క్యాప్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నిపుణుల పర్యవేక్షణ కూడా మెరుగుపడింది. ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టినా ఎలాంటి సమస్యా తలెత్తడం లేదు. మాతాశిశు మరణాలు కూడా తగ్గాయి. సాధారణంగానే కవలలు బలహీనంగా ఉంటారు. మిగతా శిశువులతో పోలిస్తే బరువు కూడా తక్కువే ఉంటుంది. కాబట్టి పెంపకంలో అదనపు శ్రద్ధ అవసరం. మంచి పోషకాహారం అందించాలి. తల్లికి ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ఆస్కారం లేకపోలేదు. డెలివరీ తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తారు. మరికొందరిని ఈ సమస్యలు జీవితాంతం వేధిస్తాయి.
ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలను కనే వీలు ఉంటుందా? ఈ పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)లో కవల పిల్లలు, ట్రిప్లెట్స్ జన్మించే అవకాశాలు ఎక్కువ. దీంతో పాటు జన్యువుల ప్రభావమూ ఉంటుంది. వంశ పారంపర్యంగా కూడా కవలలు పుడతారు. ఒక్కసారి ట్విన్స్‌గా నిర్ధారణ జరిగితే.. మిగిలిన జాగ్రత్తలన్నీ అందరికీ వర్తించేవే.
ఇద్దరు పిల్లలకు తల్లిపాలు సరిపోతాయా? తల్లిపాల వృద్ధికి ఏలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది?
కవలలకు తల్లిపాలు పుష్కలంగా సరిపోతాయి. ఇద్దరు పిల్లలకూ ఒకేసారి పాలు పట్టాలి. అటు పక్కన ఒకరికి, ఇటు పక్కన ఒకరికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ‘బాహుబలి’ సినిమాలో రమ్యకృష్ణ ఇద్దరు పిల్లలకూ ఒకేసారి పాలు పడుతుందే, అలా అన్నమాట! ఆ పొజిషన్లో అయితే ఇద్దరికీ సరిపోతాయి. దీనివల్ల తల్లిపాల ఉత్పత్తి సమృద్ధిగా జరుగుతుంది. లేదంటే, ఒక బిడ్డ పడుకుని ఉన్నప్పుడు మరో బిడ్డకు పాలు పట్టవచ్చు. ఈ పద్ధతిలో పాల ఉత్పత్తికి కొంత సమయం దొరుకుతుంది. నిజానికి, ఇద్దరికీ ఒకేసారి ఇవ్వడమే ఉత్తమ మార్గం. తల్లి కూడా నిత్యం పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.
ట్విన్స్‌లో బ్లడ్‌గ్రూప్ ఒకే రకంగా ఉంటుందా?
ఒకేలా ఉండాలనేం లేదు. మారే అవకాశాలూ ఉంటాయి. ముఖ్యంగా డై-జైగోటిక్ ట్విన్స్‌లో బ్లడ్ గ్రూప్ మారుతుంది. అదే మోనో-జైగోటిక్ ట్విన్స్‌లో ఇద్దరిలో ఒకే రకమైన బ్లడ్‌గ్రూప్ ఉంటుంది.
పెద్దయ్యాక ఇద్దర్లో ఒకరికి కాలేయం, మూత్రపిండ సమస్యలు వచ్చినప్పుడు అవయవమార్పిడి శస్త్ర చికిత్స ద్వారా ఒకరి అవయవాన్ని మరొకరికి అమర్చవచ్చా?
సాధారణంగా అవయవ మార్పిడిలో దాతకు, స్వీకర్తకు వివిధ అంశాల్లో మ్యాచింగ్ అవసరం. ట్విన్స్ విషయానికి వస్తే.. మోనో- జైగోటిక్ ట్విన్స్‌లో కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు ఒకరి నుంచి మరొకరికి సులభంగా మార్పిడి చేసే వీలు ఉంటుంది. అంటే మ్యాచింగ్ సులభంగా జరుగుతుంది. డై-జైగోటిక్లో కూడా సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. మ్యాచింగ్కు అవకాశం ఎక్కువే. మొత్తానికి సాధారణ వ్యక్తుల్లో కంటే.. కవలల్లో అవయవ మార్పిడి సులభంగానే చేయవచ్చు. మరో విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇద్దరు పిల్లలకూ సమానంగా ప్రేమనూ, ఆప్యాయతనూ పంచడమే కాదు.. అన్నింటా సమంగానే చూస్తున్న భావన ఆ బిడ్డలకూ కలిగేలా వ్యవహరించాల్సిన బాధ్యత కన్నవారిదే. నిజానికి కవల పిల్లల పెంపకం ఏ తల్లికి అయినా తలకు మించిన భారమే. భర్త, కుటుంబ సభ్యులు ఆమెకు సహకరించాలి. అదే జరిగితే.. ఆ ఇంట ఆనందాల డబుల్ ధమాకా!
అంటువ్యాధుల భయం ఎక్కువేమో?
సాధారణంగా కవలలు పక్కపక్కనే ఉంటారు. ఒకరికి జలుబు చేసినా, జ్వరం వచ్చినా పక్కనే ఉన్న మరొకరికి కూడా అదే సమస్య రావచ్చు. మిగిలిన అంటు వ్యాధులూ అంతే. కానీ సినిమాల్లో చూపినట్టు.. ఇక్కడ అమీర్‌పేటలో ఉండే ఒక బిడ్డకు జలుబు చేస్తే, అక్కడ అమెరికాలో ఉండే మరో బిడ్డకు తుమ్ములు రావడం అంటూ ఉండదు. జలుబు, దగ్గు, జ్వరం.. తదితర సమస్యలు వచ్చినప్పుడు పిల్లల్ని దూరం దూరంగా ఉంచితే సరిపోతుంది.
ఎన్ని రకాలు?
కవలల్లో మూడు రకాలు. ఒకటి.. మోనో జైగోటిక్ ట్విన్స్. రెండు.. డై-జైగోటిక్ ట్విన్స్. మూడు.. కన్‌జాయిండ్ ట్విన్స్. మోనో-జైగోటిక్ కవలల్లో దగ్గరి పోలికలు ఉంటాయి. వీరినే ఐడెంటికల్ ట్విన్స్ అనీ అంటారు. కొన్నిసార్లు ఎవరు ఎవరో పోల్చుకోలేం. ఇలాంటి ఇతివృత్తాలతో చాలా సినిమాలు వచ్చాయి. ఆ కవలలు అబ్బాయి- అబ్బాయి కావచ్చు, అమ్మాయి- అమ్మాయి కావచ్చు, అబ్బాయి- అమ్మాయి అయినా కావచ్చు. డై-జైగోటిక్ ట్విన్స్‌లో పెద్దగా పోలికలు లేకపోవచ్చు. మూడవది, కన్‌జాయిండ్ ట్విన్స్. శరీర భాగాలు అతుక్కుని జన్మిస్తారు. వీణ-వాణి ఇందుకు ఉదాహరణ.
– డాక్టర్ టి.ఉషారాణి
ఎండీ, పీడియాట్రిక్స్
ప్రొఫెసర్ &హెచ్.ఒ.డి – పీడియాట్రిక్స్
నిలోఫర్ హాస్పిటల్/ఉస్మానియా
మెడికల్ కాలేజ్
– మహేశ్వర్‌రావు బండారి