చూపు తిప్పుకోలేనంత అందగత్తె కాదు. ఆకట్టుకునేంత రూపమూ లేదు. కానీ, సునీతా రాజ్వర్లో ఏదో ఉంది. అందుకే, ఓటీటీలో ఆమె అదరగొడుతున్నది. తన అభినయంతో హిందీ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నది. లారీ డ్రైవర్ బిడ్డగా జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను చూసిందామె. ప్రతి ప్రతికూల పరిస్థితినీ ఓపికగా ఎదుర్కొన్నది. సోపానంగా మలుచుకుంది. విజయ తీరాలకు చేరుకుంది. సునీత కథ చదివితే.. జీవితంలో గెలవడానికి ప్రతిభే కాదు దానికి తగ్గ సహనమూ ఉండాలని తెలుస్తుంది.
హిందీ చిత్రం ‘సంతోష్’లో సునీతా రాజ్వర్ నటనకు ఎన్నో ప్రశంసలొచ్చాయి. కేన్స్ ఆహ్వానం అందుకున్నది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మెట్లెక్కిన ఆమె ఒకప్పుడు సినిమాలపై అసంతృప్తితో ఆ రంగాన్నే వదిలిపోయింది. కానీ, పోయిన చోటే తిరిగి వెతుక్కుంది. అంతర్జాతీయ సినిమా వేడుక ఆహ్వానం అందుకున్న సునీత జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఉత్తరాఖండ్‌లోని హల్దానీ వాళ్ల సొంతూరు. తండ్రి ఓ ట్రక్ డ్రైవర్. ముగ్గురు సంతానంలో ఆమె ఒకరు. పిల్లల్ని చదివించడమే ఆ తండ్రికి గగనంగా ఉండేది. అయినా కష్టపడి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదివింది సునీత. కానీ, ఆమెకు ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉండేది కాదు. సినిమాల్లో నటించాలని కలలు కనేది. సునీత తండ్రికి సినిమాలంటే ఎంతో ఇష్టం. సినిమాల్లో నటించాలన్నది ఆయన కోరిక. కానీ, సంసార భారంతో ఆయన తన కోరికను మొగ్గలోనే తుంచేశాడు. కానీ, సినిమాలు తెగ చూసేవాడు. తండ్రి ప్రభావంతో సునీత సినిమాల్లోకి రావాలనుకుంది.
తండ్రితో సినిమాలకు వెళ్లినప్పుడల్లా.. తనను తాను వెండితెరపై ఎప్పుడు చూసుకుంటానా అని అనుకునేది సునీత. ఆమెతో పాటు ఆమె పట్టుదలా పెరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ)లో చేరింది. బిడ్డ కోరికను తండ్రి కాదనలేకపోయాడు. అప్పు చేసి ఓ ముప్పయ్వేల రూపాయలు కూతురి చేతిలో పెట్టాడు. జూనియర్ ఆర్టిస్టులతో కలిసి ఇరుకైన గదుల్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఉండేది సునీత. తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయినా.. ఆమెకు అవకాశాలు రాలేదు. అయినా వెనక్కి తగ్గలేదు. మురికివాడలో ఉంటూ రోజులు వెళ్లదీసింది. చివరికి చిన్న అవకాశం వచ్చింది. ‘మైఁ మాధురీ దీక్షిత్ బన్నా చాహ్తి హూఁ’ సినిమాలో చాన్స్ దక్కింది. ‘ఏక్ చాలీస్కి లాస్ట్ లోకల్’ సినిమాతో మరో విజయం అందుకుంది. ఇందులో చక్లీ అనే ముంబయి గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ఆమె నటనకు గానూ మ్యాక్స్ స్టార్‌డస్ట్ అవార్డు అందుకుంది. ఇంత గుర్తింపు వచ్చినా.. తర్వాత అవకాశాలు మళ్లీ ముఖం చాటేశాయి. తానేమిటో నిరూపించుకున్నా.. వరుసగా పనిమనిషి పాత్రలే ఆమెను పలకరించసాగాయి.
సినిమాల్లో రాణించాలంటే ‘గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాల’ని చెబుతుంటారు. అవకాశం రూపంలో అదృష్టం పలకరించినా.. అంతగా ప్రాధాన్యం లేని పాత్ర ఎదురై దురదృష్టం వెక్కిరించేది. మరోవైపు టీవీ సీరియళ్లలో కూడా చేసింది సునీత. సినిమాల్లో నటించాలన్న కోరిక నెరవేర్చుకోవడం కోసం ఇంతలా కష్టపడాలా? అని ఎన్నోసార్లు అనుకునేది. చివరికి విసుగెత్తి ఇండస్ట్రీకి దూరమైంది. సినిమాలకు ఎంత దూరంగా ఉన్నా.. ఆ రంగుల కలలు ఆమెను స్థిమితంగా ఉండనీయలేదు. మరోసారి ప్రయత్నించి చూద్దామని మనసును దృఢపరుచుకుంది. అదే సమయంలో కొన్ని పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆంచి, ఉర్ఫ్ గంట, సంతోష్ లాంటి సినిమాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసింది. ‘పంచాయత్’ వెబ్‌సిరీస్‌లో క్రాంతి దేవిగా, ‘గుల్లాక్స్’లో బిట్టు వాళ్ల అమ్మగా చేసి.. ఓటీటీలో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ‘సంతోష్’ సినిమాలో సహనటి పాత్రలో జీవించిన సునీత 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆహ్వానం అందుకుంది. దర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి కూడా ఆమెకు పిలుపు వచ్చింది. ఒక్కసారిగా సునీత దశ తిరిగింది. ఇప్పుడు ఆమెకు చేతినిండా పని ఉంది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీ అయిపోయింది. ఆశించిన దానికన్నా ఎక్కువ గుర్తింపు, గౌరవం అందుకుంటున్నది. కష్టపడే తత్వం ఉన్నవాళ్ల ప్రతిభకు గుర్తింపు ఎప్పటికైనా వస్తుంది. కానీ, ఆ కష్టానికి తగినంత సహనమూ ఉండాలని సునీత అనుభవం చెబుతుంది.