సోషల్ మీడియా కొందరికి సరదా. మరికొందరికి లైఫ్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌లతో కాలయాపన చేసేవారున్నారు. సక్సెస్ పాఠాలతో, సందేశాలతో స్ఫూర్తి నింపేవారూ ఉన్నారు. తమ అభిమాన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను కలవాలనీ, మాట్లాడాలనీ చాలామందికి ఉంటుంది. ‘ట్రావెల్ విత్ ఇన్ఫ్లుయెన్సర్’ ఆ అవకాశాన్ని కల్పిస్తున్నది. గెట్ రెడీ!
నిన్న సోలో ట్రావెలింగ్.. మొన్న గ్రూప్ ట్రావెలింగ్.. ఇప్పుడు ‘ట్రావెలింగ్ విత్ ఇన్ఫ్లు యెన్సర్’. ఇదో సరికొత్త ట్రెండ్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. ఆన్లైన్లో అత్యంత శక్తిమంతులు. వేలకొద్దీ, లక్షలకొద్దీ అనుచరులకు వాళ్ల మాట ఆదేశమే. ఏం కొనమంటే అది కొంటారు. ఎలా సింగారించుకోమంటే అలా సింగారించుకుంటారు. ఆ సోషల్ స్టార్స్‌తో కలిసి ప్రయాణించడమంటే.. ఓ గొప్ప అనుభూతి. ఆ టీమ్‌కు ఇన్ఫ్లుయెన్సరే హోస్ట్‌గా వ్యవహరిస్తారు. వారితో జర్నీ చేయడం వల్ల కొత్తకొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది.
జీవనశైలిని, ఆసక్తులను గమనించవచ్చు. ఆ సంతృప్తి, అనుభూతి వెలకట్టలేనివి. ‘ట్రావెల్ విత్ ఇన్ఫ్లుయెన్సర్’ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది.. ఎలీసా రామోస్ గురించి. ఇన్‌స్టా లిస్ట్‌లోని ఓ ఎనిమిది మంది ఫాలోవర్స్‌తో ఐస్‌ల్యాండ్ ట్రిప్‌కు వెళ్లి సరికొత్త ట్రెండ్ సృష్టించిందామె. మొత్తం ఏడు ఖండాల్లో పర్యటించింది. టాంజానియా, జాంజిబార్, ఉగాండా, రువాండా, కాంగో, ఈజిప్ట్ వంటి దేశాల్లో తనతో కలిసి అభిమానులూ ట్రావెల్ చేసే అవకాశం కల్పించింది. తాజాగా పదహారు రోజుల మౌంట్ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లింది ఎలీసా. అదే బాటలో అడుగులు వేయడానికి భారతీయ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సిద్ధంగా ఉన్నారు.