తొందరపాటు చేటుకు దారితీస్తుంది. ఆలస్యం అమృతాన్ని విషం చేస్తుంది. నిత్య జీవితానికే కాదు.. సినిమాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే.. కాలజాలాన్ని అంచనా వేయకుండా చేసిన కొన్ని ప్రయోగాలు ఈ విషయాన్ని చాలాసార్లు రుజువు చేశాయి. కొన్ని సినిమాలు దశాబ్దం ముందుగానే తెరమీదికొచ్చి బోర్లా పడితే, మరికొన్ని చిత్రాలు ఓ పదేండ్లు ఆలస్యంగా వచ్చి చతికిలపడ్డాయి. ఆయా చిత్రాలు సరైన సమయంలో విడుదలై ఉంటే… బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేవే! కానీ, టైమింగ్ మిస్ కావడం వల్ల.. అప్పటికైతే బోరింగ్ సబ్జెక్టులుగా మిగిలిపోయాయి.
సమకాలీన చిత్రాలను చిత్రిక పట్టడంలో దర్శకుడు బాపు గొప్ప నేర్పరి. ఆయన సినిమాలు తిలక్ కవితల్లా వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలంత హాయిగా ఉంటాయి. 1967లో ‘సాక్షి’ సినిమాతో బాపు దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా మెరుపు విజయం సాధించింది. అప్పుడే బాపు-రమణ ద్వయం ఓ ప్రయోగానికి పూనుకుంది. అదే ‘బంగారు పిచుక’. 1968లో విడుదలైన ఈ సినిమా కొత్త సబ్జెక్టు. అప్పటివరకు కనీవినీ ఎరుగని కథ. కథనం కూడా హాలీవుడ్ సినిమాలా గమ్మత్తుగా సాగుతుంది. తల్లి అదుపాజ్ఞల్లో ఉన్న ఓ సుకుమారుడు ఇంటినుంచి బయటికి వచ్చేస్తాడు. అతనికో అందమైన ఆడపిల్ల తారసపడుతుంది. కోటీశ్వరుడైన ఆ రాకుమారుణ్ని కొందరు దుండగులు ఫాలో అవుతుంటారు. రకరకాల మలుపులు తిరుగుతూ.. సాగుతుంది. ఆ సినిమా తీసినవాళ్లకు నచ్చింది. చూసినవాళ్లకు మాత్రం అంతగా అర్థం కాలేదు. ఫలితం.. మరీ బలహీనంగా కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాలో చంద్రమోహన్, విజయలలిత జంటగా నటించారు. ఏండ్లు గడిచాయి. బాపు కుంచె నుంచి అపురూప చలనచిత్ర రాజాలు వెండితెరకు వన్నెలు అద్దాయి. ‘బంగారు పిచుక’ వచ్చిన 26 ఏండ్లకు అచ్చంగా అదేకథతో ‘పెళ్లికొడుకు’ సినిమా తీశారు బాపు. ఇందులో హీరోగా నరేశ్, హీరోయిన్గా దివ్యవాణి నటించారు. ఇదీ ఫ్లాప్‌టాక్ మూటగట్టుకుంది. ‘ఒకే సబ్జెక్టుతో తీసిన ఈ రెండు సినిమాలు ఎందుకు పరాజయం పాలయ్యాయి?’ అని బాపును ఎవరో అడిగితే, ఆయన తనదైన శైలిలో ‘ఒకటి టూ ఎర్లీ.. ఇంకోటి టూ లేట్’ అని నవ్వుతూ సమాధానమిచ్చారట. అదన్నమాట టైమింగ్ మహిమ!
ఎన్టీఆర్ హీరోగా, షావుకారు జానకి హీరోయిన్గా, వై.ఆర్.స్వామి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘వద్దంటే డబ్బు’. 1954లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ప్రయోగాత్మకమనే చెప్పుకోవాలి. ఆంగ్ల నవల ‘బ్రూస్టర్స్ మిలియన్స్’ ఆధారంగా కథను సిద్ధం చేసుకున్నారు. ఇందులో లక్షాధికారి వారసురాలిని హీరో ప్రేమిస్తాడు. తన కూతురినిచ్చి పెండ్లి చేయాలంటే నెల రోజుల్లో లక్ష రూపాయలు ఖర్చు చేయాలని ఆమె తండ్రి షరతు పెడతాడు. సంపాదించడం కష్టం కానీ, ఖర్చు చేయడం తేలికే కదా అనుకుంటాడు హీరో. కానీ, దిగితే గానీ లోతు తెలియదన్నట్టు.. డబ్బులు ఖర్చు చేసే క్రమంలో అంతకంతకూ వచ్చి పడే సొమ్ముతో సొమ్మసిల్లిపోతాడు హీరో! కథ ఎలాగూ సుఖాంతమే అయ్యిందనుకోండి.. సినిమా ఫలితమే నిర్మాతకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 1985లో దాదాపు ఇదే కథతో దర్శకుడు జంధ్యాల ‘బాబాయ్ అబ్బాయ్’ సినిమా తీశారు. ఇందులో బాలకృష్ణ, సుత్తి వీరభద్రరావు అబ్బాయి, బాబాయ్‌లుగా నటించారు. కథానాయిక అనితారెడ్డి. ఈ చిత్రంలోనూ కోట్లకు వారసురాలైన తన కూతురిని మనువాడాలంటే నెల రోజుల్లో రూ.25 లక్షలు ఖర్చు చేయాలని కథానాయిక తండ్రి షరతు పెడతాడు. వాటిని ఖర్చు చేయలేక నానా అగచాట్లూ పడతారు బాబాయ్, అబ్బాయ్. చివరికి డబ్బు జబ్బులకు హేతువనీ, ప్రేమే సత్యమని చాటిచెబుతుందీ చిత్రం. ఈ చిత్రంలో జంధ్యాల మార్కు కామెడీ విశేషంగా ఉన్నా.. సినిమా ఫలితం మాత్రం ఆశించినట్టు రాలేదు. టైమింగ్ మిస్సవ్వడం వల్లే… ఈ రెండూ పరాజయం పాలయ్యాయని సినీ విశ్లేషకులు తీర్మానించారు. ఈ తరహా కండిషన్‌తోనే రూపుదిద్దుకున్న సినిమా ‘అరుణాచలం’. 1997లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కథా వస్తువులో చిన్నపాటి మార్పు, కథా గమనంలో ట్విస్టులు, రజినీకాంత్ స్టయిల్ వెరసి ‘అరుణాచలం’ సినిమాను అందలం ఎక్కించాయి.
యాక్షన్ సినిమా అయినా, ఫ్యామిలీ చిత్రమైనా.. కథలో కీలకం హీరోహీరోయిన్ల ప్రేమ. అలాంటి ప్రేమ నిత్యనూతనంగా ఉండాలని సగటు ప్రేక్షకుడు అభిలషిస్తాడు. లవ్ సీన్లు ఎంత చిక్కగా పండితే.. సినిమా అంత చక్కగా హిట్ అవుతుంది. కానీ, ఆ ప్రేమనే ప్రశ్నిస్తూ, ప్రేమ శాశ్వతం కాదని, ప్రేమించిన వ్యక్తిని జీవితకాలం అదే రేంజ్లో లవ్ చేయడం కుదరదనే కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘ఆరెంజ్’. మగధీర విజయంతో మంచి ఊపుమీదున్న రామ్‌చరణ్ ఇందులో హీరో. హహ్హా హాసినీ అంటూ ‘బొమ్మరిల్లు’తో హిట్టుకొట్టిన జెనీలియా హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. 2010లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని భావించారంతా! భారీ బడ్జెట్‌తో ఆస్ట్రేలియాలోనే సింహభాగం షూటింగ్ చేశారు. అయితే, ఈ డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్ అప్పటి ప్రేక్షకులకు అస్సలు రుచించలేదు. మిలీనియల్స్కే మింగుడుపడలేదు. తర్వాతికాలంలో ఈ సినిమా టీవీ ప్రేక్షకులను మాత్రం అలరించింది. ఇదే సినిమా 2020 తర్వాత విడుదలై ఉంటే.. భారీ హిట్టు కొట్టేదని విశ్లేషకుల మాట. టైమింగ్ మిస్సవ్వడం చిత్ర నిర్మాత నాగబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.
ప్రయోగాత్మక సినిమాలకు పెట్టిందిపేరు హీరో కృష్ణ. ఆయన వందో సినిమా ‘అల్లూరి సీతారామారాజు’ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ప్రివ్యూ చూసిన నిర్మాత చక్రపాణి.. కృష్ణతో ‘ఇప్పుడు నీతో ఎంతమంది నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు?’ అని ప్రశ్నించాడట. దానికి కృష్ణ ఓ ఐదారుగురు నిర్మాతల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారట. ‘వాళ్లంతా మునిగిపోవడం ఖాయం’ అన్నారట చక్రపాణి. ‘అల్లూరి సీతారామరాజుగా నిన్ను చూసిన ప్రేక్షకులు ఇప్పట్లో మరో పాత్రలో నిన్ను ఊహించుకోలేరు’ అని జోస్యం కూడా చెప్పారట. ఆయన అన్నట్టుగానే.. ‘అల్లూరి..’ తర్వాత కృష్ణను వరుస ఫ్లాప్‌లు పలకరించాయి. అలా టైమింగ్ మిస్సయ్యిందన్నమాట. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ టైమ్ బాంబ్ బారినుంచి తప్పించుకోలేకపోయారు. చిరంజీవి బ్లాక్‌బస్టర్స్ ‘గ్యాంగ్‌లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానామొగుడు’ హిట్ల తర్వాత వచ్చిన.. ‘ఆపద్బాంధవుడు’ కళాఖండం అనిపించుకున్నా.. వసూళ్లను రాబట్టలేకపోయింది. మళ్లీ ‘ముఠామేస్త్రి’ హిట్ ఎఫెక్ట్ తర్వాత వచ్చిన నాలుగైదు సినిమాలపై పడింది.
ఆ తర్వాత వచ్చిన ‘మెకానిక్ అల్లుడు’ చిరు, ఏయన్నార్ కలిసి కామెడీ చేసినా పరాజయం మూటగట్టుకుంది. అదే కోవలోకి వస్తుంది ‘బిగ్‌బాస్’. గ్యాంగ్‌లీడర్ దర్శకుడు విజయ బాపినీడు, మెగాస్టార్ కాంబోలో నిర్మితమైన సినిమా కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. కథ, కథనాలు కమర్షియల్ సినిమాకు తగ్గట్టుగానే ఉన్నా.. విడుదల టైమింగ్ సరిగ్గా లేక పరాజయం పాలైంది. ఈ సినిమాలో రోజా, నిర్మలమ్మ కామెడీ ట్రాక్ మరీ నేలబారుగా ఉండటం కూడా చిరు కామెడీ టైమింగ్ మెచ్చే అభిమానులకు మింగుడుపడలేదు. తాజాగా విడుదలైన ‘గేమ్‌ఛేంజర్’ కూడా రాంగ్ టైమింగ్ అని ఇండస్ట్రీ టాక్. ‘జెంటిల్మెన్’, ‘భారతీయుడు’, ‘ఒకేఒక్కడు’ ఆ రోజుల్లో అద్భుతాలు. ఈ సినిమా కూడా అదే టైమ్‌లో వచ్చి ఉంటే.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచేదని చెబుతున్నారు. మొత్తంగా ఈ సినిమా ఇండస్ట్రీలో టైమింగ్ ఓన్లీ కింగ్. తొందరపడితే గ్రహపాటు తప్పదు. ఆలస్యం చేస్తే అసలు కూడా దక్కదు.
సుకుమార్ డైరెక్షన్లో మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘1- నేనొక్కడినే’ కూడా ఇలా టైమింగ్ మిస్సయిన సినిమానే! మైండ్‌లో కెమికల్ ఇన్‌బ్యాలెన్స్ ఉన్న హీరో.. జరిగినవి జరగనట్టుగా, జరగనివి జరిగినట్టుగా ఊహించేసుకుంటాడు. ఈ క్రమంలో సినిమా స్క్రీన్‌ప్లే కాస్త గందరగోళంగా సాగుతుంది. పదేండ్ల కిందట విడుదలైన ‘1’ టూ ఎర్లీగా వచ్చిన సబ్జెక్ట్ అనే చెప్పాలి. ఈ రోజుల్లో ఇంకా క్లారిటీతో తీసి ఉంటే.. బ్లాక్‌బస్టర్‌గా నిలిచేది.