పెండ్లిళ్లు, వ్రతాల్లాంటి శుభకార్యాలప్పుడు కాసేపు కట్టుకునేవే అయినా, పెద్ద పట్టుచీరలను మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. కంచి, గద్వాల, పోచంపల్లి, ధర్మవరం… ఇలా చీర ఏదైనా కట్టు కుదిరితేనే అది ఆకట్టుకుంటుంది. అలా కాకపోతే ఎంత మంచి చీరయినా అనుకున్నంత అందంగా అమరదు. మరి కోకను చక్కగా చుట్టుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి!
సాధారణంగా చీరల కిందకు కాటన్ లంగాలు, లేదా వదులుగా ఉండే లంగాలు కట్టుకుంటూ ఉంటారు. అయితే బరువుండే పెద్ద పట్టుచీరలకు కూడా వాటిని కట్టుకుంటే మేనేజ్ చేయడం కష్టంగా ఉంటుంది. దానికి బదులు షేపింగ్ శారీ పెట్టీకోట్ని ఎంచుకోండి. ఇవి మందంగా ఉండి శరీరాన్ని పట్టి ఉంచి మంచి షేప్ కనిపించేలా చేస్తాయి. ఖరీదనో మరే కారణాల వల్లయినా ఇవి వద్దు అనుకుంటే, మంచి ఫిట్టింగ్ ఉండే శాటిన్, లేదా కాటన్ సిల్క్ లంగాలను ఎంచుకోండి.
ఎక్కువ పిన్నీసులు పెట్టుకుంటే చీర గందరగోళంగా ఉంటుందన్న ఆలోచన రానీయకండి. మనం పెట్టిన పవిట కుచ్చులు క్రమంలో అందంగా నిలిచి ఉండాలంటే వాటి వెనక నుంచి రెండు పిన్నీసులు, పవిట అంచు దగ్గర ఒక పిన్ను ఇలా పెట్టుకోవాల్సిందే. చీర కదిలిపోకుండా పట్టుకుని ఉంచడమే లక్ష్యంగా వీటిని పెట్టుకోవాలి.
నేల మీద నిలబడి చీర కట్టుకుని, తర్వాత చెప్పులు వేసుకుంటే చీర పైకి వెళ్లినట్టు అయ్యి పాదాలు కనిపిస్తూ చూసేందుకు ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే హీల్స్లాంటివి ఎంచుకుంటే వాటిని ధరించాకే చీర కట్టుకోవడం ఉత్తమం. అలా ఇష్టం లేకపోతే వాటికి తగ్గట్టుగా ఎక్కువ పొడవు వచ్చేలా చీర కట్టాలి.
చీరకట్టులో జాకెట్ది ప్రధాన పాత్ర. అది భుజాలు జారిపోకుండా, వక్షస్థలం చుట్టూ కూడా అద్దినట్టు బిగుతుగా పట్టి ఉంచేలా కుట్టించుకోవాలి. అప్పుడే చక్కటి షేప్ కనిపించడమే కాదు, బరువైన పట్టుచీరలు భుజం మీది నుంచి మాటిమాటికీ జారిపోకుండా ఉంటాయి.
పవిట కుచ్చులు పోసేటప్పుడు జార్జెట్ తరహా చీరలకంటే వెడల్పాటి కుచ్చు వచ్చేలా చూసుకోవాలి. అన్ని కుచ్చులూ సమానంగా పెట్టుకున్నాక ఓసారి ఇస్త్రీ చేస్తే, కట్టుకున్నాక పవిట అందంగా నిలిచి ఉంటుంది.