దైవాన్ని దూషిస్తే చెడు జరుగుతుందని భయపడతాం. కానీ, అక్కడ మాత్రం అమ్మ అనుగ్రహం కోసం దూషణ భూషణలు సమర్పించుకుంటారు! నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ఉజ్జెల్లి గ్రామంలో ఉన్న ఈ వింత ఆచారం కథా కమామిషు ఇది..
ఉజ్జెల్లిలో కొలువైన అమ్మవారిని తిట్టడం, విగ్రహం ఎదుట ‘థూ’ అని ఉమ్మేయడం తరాలుగా వస్తున్న సంప్రదాయం. శివారులోని పొలాల్లో దర్శనమిచ్చే అమ్మవారిని గ్రామస్థులు ‘థూక్మారి’ దేవతగా పిలుస్తుంటారు. విగ్రహానికి పూజలు చేయడం అటుంచితే.. ఇక్కడికి రాగానే ‘థూ.. థూ..’ అని తిడుతూ వెళ్తుంటారు.
పిలుపు వెనక కథ..
అలనాడు ఉజ్జెల్లి సత్యమ్మవ్వగా పూజలందుకొన్న ఈ దేవత.. కాలక్రమంలో ‘థూక్మారి’గా స్థిరపడింది. ఈ మార్పు వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ఉజ్జెల్లికి చెందిన శంకరప్ప వ్యవసాయ భూమిలో కొలువైన దేవతను ‘సత్యమ్మవ్వ’గా పిలిచేవారు. ఒకరోజు గ్రామస్థులంతా కలిసి కుండలో అనుములు ఉడకబెట్టి, గ్రామంలోని అన్ని దేవతా మూర్తుల ఎదుట నైవేద్యంగా పెడుతూ వచ్చారు. అయితే, సత్యమ్మవ్వ దగ్గరికి వచ్చే సరికి, కుండలోని అనుములు అయిపోయాయి. దీంతో వారు ‘థూ.. ఇక్కడికి వచ్చేసరికే అయిపోయాయి’ అన్నారట. అప్పటి నుంచి ఈ అమ్మవారిని ‘థూక్మారి’ దేవతగా వ్యవహరిస్తున్నారు. అంతటితో ఆగకుండా, విగ్రహం ముందు నుంచి ఎవరు వెళ్లినా ‘థూ.. థూ..’ అంటూ ఉమ్మేయడం ఆచారంగా పాటిస్తున్నారు. అలా చేయకపోతే అపచారంగా భావిస్తారు. అయితే, ఇలా ఉమ్మేసే పద్ధతిని ప్రస్తుత తరంవాళ్లు మాత్రం పక్కన పెట్టారు.
ముక్కడి దేవతగానూ..
ఈ అమ్మవారిని ‘ముక్కడి దేవత’ అని కూడా పిలుస్తారు. తన వద్దకు వచ్చేసరికే అనుములు అయిపోవడమూ, గ్రామస్థులు తనను దూషించడంతో అమ్మవారు.. ‘ఔరా’ అని ముక్కున వేలేసుకున్నదట. అప్పటి నుంచీ ముక్కర దేవత, ముక్కడి దేవత అని పిలువసాగారు. విచిత్రమేమిటంటే.. అమ్మవారి విగ్రహం కూడా అప్పట్లో ముక్కున వేలేసుకున్నట్లుగా ఉండేది. అయితే, గుప్తనిధుల తవ్వకాల్లో బాగా ధ్వంసమైంది. ముక్కుపై వేసుకున్నట్లు ఉండే చేయి విరిగిపోయింది. ముక్కడి అంటే… ‘ముక్కులేని’ అనే అర్థమూ ఉంది.
వారధి నవీన్‌కుమార్, నారాయణపేట