అతివల అందంలో ఆభరణాలది ప్రత్యేక స్థానం. అందులోనూ ట్రెండ్‌కి తగ్గట్టు ఎప్పటికప్పుడు వెరైటీ నగలను ఎంచుకుంటున్నారు ఆధునిక మగువలు. పెరుగుతున్న నాగరికతతోపాటు ఆభరణాల్లోనూ నయా హంగులు కోరుకుంటున్నారు. అలాంటి ట్రెండీ లుక్ అంటే ఆసక్తి చూపించే అమ్మాయిల కోసం కొత్తకొత్త ఆభరణాలను తయారు చేస్తున్నారు డిజైనర్లు. చూడటానికి వింతగా, కొత్తగా ఉండే చంకీ జువెలరీ ఆ కోవకు చెందినదే.
దుస్తుల్లో ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారిపోయినట్లే, ఆభరణాల్లోనూ రోజుకో ట్రెండ్ పుట్టుకొస్తుంటుంది. ఓవైపు మేనిపై మెరిసిపోతూ కంటికి కనిపించనంత సన్నటి గొలుసులతో కూడిన మినిమలిస్ట్ జువెలరీ రాజ్యమేలుతున్నది. మరోవైపు భారీ పరిమాణాల్లో గొలుసులను పోలిన చంకీ జువెలరీ ఆకట్టుకుంటున్నది. రోజురోజుకీ బంగారం ధర పెరిగిపోతుంటే తక్కువ బంగారంతో ఎక్కువ మెరుపునిచ్చే చంకీ జువెలరీ ఈ తరం యువతుల ఆదరణ చూరగొంటున్నది.
ఈ ఆభరణాలు పెద్ద లింక్‌లు, మందమైన గొలుసులు, జ్యామితీయ ఆకృతులలో భిన్నంగా ఉండి నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. మందంగా ఉండే చైన్ నెక్లెస్, ఓవర్ సైజ్డ్ హూప్ ఇయర్రింగ్స్ సాధారణ దుస్తులపై కూడా ట్రెండీలుక్ తీసుకొస్తాయి. ఈ డిజైన్లు 1980ల రెట్రో ఫ్యాషన్‌ను మరిపిస్తున్నాయి. సాధారణంగా ఈ ఆభరణాలు తరచూ 18K, 22K బంగారంతో తయారు చేస్తున్నారు. చూడటానికి భారీగా కనిపించినప్పటికీ లోపల గుళ్లగా ఉండటం వల్ల వీటి తయారీకి తక్కువ బంగారం అవసరమవుతుంది.
ప్రస్తుతం ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో మహిళలు బంగారాన్ని ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గానే కాకుండా పెట్టుబడిగానూ భావిస్తున్నారు. ఈ ఆభరణాలను ఆధునిక దుస్తులతోపాటు సంప్రదాయ దుస్తులపైనా ధరించవచ్చు. అంతేకాదు ఆడ, మగ తేడా లేకుండా ఎవరైనా చంకీ జువెలరీని ఎంపిక చేసుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండేలా వెండి, ఇమిటేషన్, వన్‌గ్రామ్ గోల్డ్‌లోనూ ఈ చంకీ నగలు అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి ట్రై చేయండి!