ఈ చిత్తరువులో ఉన్న పదేండ్ల పాపాయిని చూశారా! చక్కగా ఉంది కదూ! ఆ పక్కనున్న పాతికేండ్ల పడతి బొమ్మ ఆ బుజ్జాయి తల్లిదే అనే అంచనాకు వచ్చేయకండి. ఆ చెంతనే ఉన్న ముదిమి వయసు ముదిత ఆ చిట్టితల్లి బామ్మ కావచ్చని భ్రమపడకండి. విచిత్రంగా ఈ చిత్రాలన్నీ ఆ చిన్నారి పొన్నారివే! ఓ చేయి తిరిగిన కుంచెకారుడి మాయాజాలం ఇది. హైదరాబాద్‌కు చెందిన శివప్రసాద్ పనితనం ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది.
‘రవి కాంచని చోట కవి కాంచున్’ అని నానుడి. కవి ఊహించిన విచిత్రాలను చిత్తరువులుగా మలిచే శక్తి ఉన్నది మాత్రం కుంచెకారుడికే! అలాంటి చిత్రకారుడే శివప్రసాద్. ఆయన దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో కళాకారుడిగా పని చేశారు. ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్‌గా బొమ్మల ప్రపంచంలో విహరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తన పదేండ్ల మనవరాలి ఫొటో శివప్రసాద్‌కు ఇచ్చారు.
వివిధ వయసుల్లో ఆ చిట్టితల్లి ఎలా ఉంటుందో ఊహించి గీయమని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు గీసిన బొమ్మలు ఇవి. చిత్ర కళపై పట్టుతోపాటు ఊహాశక్తి బలంగా ఉంటేనే ఇలాంటి బొమ్మలు గీయగలమని అంటారు శివప్రసాద్. ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వయసుకు తగ్గట్టుగా ముఖారవిందాన్ని చిత్రించి చూపించే యాప్‌లు ఎన్నో వచ్చాయి. కానీ సహజత్వం ఉట్టిపడేలా, ఓ చిత్రకారుడు మన భవిష్యత్ రూపాన్ని ఊహించి గీయడం అద్భుతం. మరోసారి ఈ చిన్నారి చిత్రాన్ని పరిశీలనగా చూసి, వివిధ వయసుల్లో ఆ బాలిక ఎలా ఉండబోతున్నదో లీలగా గమనించండి.