‘మా సినిమాకు కథే హీరో’ అని ఎంతమంది డైరెక్టర్లు ఎన్నిసార్లు చెప్పినా.. ప్రేక్షకులకు మాత్రం ‘పాటలు పాడుతూ స్టెప్పులేసేవాడు, రౌడీలతో తలపడేవాడే హీరో’ అని అనుకుంటున్నారు. ప్రేక్షకులకు ఉన్న బలమైన సెంటిమెంట్‌ని కూడా గెలిచి మెప్పించిన నటులంటే నాన్నలే! హీరో, హీరోయిన్ ప్రధాన పాత్రలే అయినప్పటికీ కథ అందించిన బలం, వైవిధ్యమైన నటనతో హీరో పాత్రల కంటే ఎక్కువగా పాపులర్ అయిన తండ్రి పాత్రలున్నాయి. తండ్రుల వ్యక్తిత్వాలకు ప్రతీకలైన సినిమా పాత్రలెన్నిటినో ప్రేక్షకులు మర్చిపోలేరు. పిల్లల కోసం తల్లిందండ్రులు కష్టపడుతుంటారు. పిల్లలు పెద్దవాళ్లయ్యాక తమకంటే పెద్ద హోదాలో ఉండాలని తాపత్రయ పడుతుంటారు. ఈ ఆలోచన మంచిదే. కానీ, ఈ తాపత్రయంలో తల్లిదండ్రులు ఆ పిల్లల ఇష్టాల్ని తెలుసుకోరు. అలాంటి తండ్రులకు, సాధారణ పిల్లలకు మధ్య జరిగే ఘర్షణలు చాలా ఇళ్లల్లో రోజూ వినిపించేవే. అలాంటి గొడవలు పడ్డప్పుడల్లా.. ‘ఏమైందిరా?’ అని ఫ్రెండ్స్ అడిగితే.. ‘ఏం లేదురా.. మా డాడీ ఓ ప్రకాశ్ రాజ్’ అంటూ ఒక్క మాటలో గుండెల్లోని బాధనంతా కక్కేస్తారు. ఆ మాటతో అందరికీ అతని సమస్య అర్థమైపోతుంది. ‘
నేను చెప్పేది వినండి’ అంటూ తన ఇష్టానికి భిన్నంగా వాళ్ల డాడీ ఇష్టాన్ని రుద్దుతున్నాడని స్నేహితులే అర్థం చేసుకుంటారు. కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ల దగ్గర మాట్లాడుకునే పిల్లల మాటలు వింటే ‘నీకేం కావాలో నీకు తెలియదు’ అనే అడ్డాల అరవింద్ (ప్రకాశ్ రాజ్) లాంటి ఫాదర్లతో పడుతున్న పాట్లను గుర్తుచేసుకుంటూ తలలు బాధుకునే సన్నివేశాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాలు చూస్తే ‘బొమ్మరిల్లు’ డాడీలు చాలా ఇళ్లల్లో ఉన్నారనిపిస్తుంది. అయితే ఇంకొంతమంది పాపులర్ డాడీలున్నారు. కానీ, ఇలాంటి డాడీలు నిజంగానే ఉన్నారా? అనే సందేహం కూడా వస్తుంది. సందేహం తీరినా, తీరకపోయినా.. కామెడీ గ్యారెంటీ ఫాదర్ అనుకోండి. ‘అహ నా పెళ్లంట’ సినిమాలో పిసినారి తండ్రిగా కోట శ్రీనివాసరావు నటన అద్భుతం. పిసినారితనాన్ని పోల్చాల్చి వస్తే ఇంతకన్నా పెద్ద పోలిక ఉండదు. జనంలో పిసినారి తండ్రిగా ‘ఆమె’ సినిమాలో ఫస్ట్ హాఫ్ నవ్వించిన కోటా.. సెకండ్ ఆఫ్‌లో అంతే భయపెడతాడు.
కూడబెట్టాలనుకునే పిసినారిలోని క్రూరత్వం ఈ సినిమాలో చూడొచ్చు. పిల్లల కోసం అన్నీ త్యాగం చేసే తల్లిదండ్రులు ఎంతోమంది. మధ్యతరగతి కష్టాలు వెండి తెరపై కనుమరుగైన తర్వాత మళ్లీ సామాన్యుల జీవితాల్లోని చిన్నిచిన్న కోరికలు, పెద్దపెద్ద కష్టాలను తెరపై ఆవిష్కరిస్తూ వచ్చింది ‘జెర్సీ’ సినిమా. పిల్లల ఇష్టాన్ని అర్థం చేసుకునే తండ్రుల కష్టాన్ని కళ్లకు కట్టింది. ఈ సినిమా చూశాక.. కెరీర్లో సక్సెస్ అయిన వాళ్ల తండ్రుల కష్టాల్ని గుర్తుచేసుకోకుండా ఉండలేరు. తెల్లవారక ముందే నిద్రలేపి ప్లే గ్రౌండ్లు, స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ల ముందే కాదు.. పోటీ పరీక్షల కేంద్రాల దగ్గర పిల్లల్ని దింపి వచ్చే తండ్రుల జీవితాలు జెర్సీలో అర్జున్ (నాని) పాత్రల్లాంటివే. ఇలాంటి వాస్తవాలను కళ్లకు కడితే ఆదరణ ఉంటుందనడానికి ఆయాసినిమాలు సాధించిన విజయాలే సాక్ష్యం. కుటుంబ కథా చిత్రాలు తగ్గినా తండ్రి పాత్రకు డిమాండ్ తగ్గలేదు. కథకు తండ్రి ఎంత బలమో, ఆ సినిమా విజయానికి తండ్రి పాత్రలోని నటులు కూడా అంతే బలం!