ఇంటిని అందంగా తీర్చిదిద్దాలంటే ఖరీదైన సోఫాలు, ఆకర్షణీయమైన కర్టెన్లు, అందమైన లైటింగ్ ఉంటే చాలని ఇప్పటివరకు అనుకునేవారు. కానీ ఇప్పుడు ప్రపంచ ఇంటీరియర్ డిజైనర్లు మరో అంశాన్ని కూడా డెకార్‌లో భాగం చేస్తున్నారు. అదే ‘సెంట్ సేపింగ్’. అంటే… ఇంటి ప్రతి గదికీ, దాని వాతావరణానికి తగిన పరిమళాన్ని ఎంచుకోవడం. ఈ ఏడాది హోమ్ డెకార్ ప్రపంచంలో ఈ ట్రెండ్‌కు ప్రత్యేక స్థానం లభిస్తున్నది.
ప్రముఖ హోటళ్లలోకి అడుగుపెట్టగానే ఒక ప్రత్యేక సువాసన మనల్ని పలకరిస్తుంది. అది యాదృచ్ఛికం కాదు. ఆ హోటల్‌కు గుర్తింపుగా ఉండే ‘సిగ్నేచర్ సెంట్’ను ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఎందుకంటే వాసన జ్ఞాపకాలతో, భావోద్వేగాలతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆలోచన ఇళ్లలోకీ విస్తరిస్తున్నది. అయితే ఇల్లు మొత్తాన్నీ ఒకే సువాసనతో నింపేయడం కాదు. గదికి తగ్గ పరిమళాన్ని ఎంచుకోవడమే అసలు కళ. అతిథుల గదిలో నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పరిమళాలు ఆహ్వాన భావనను కలిగిస్తాయి.
పడకగదిలో లావెండర్, చందనం వంటి మృదువైన సువాసనలు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. పని చేసే గదిలో తేలికపాటి టీ లేదా పుదీనా పరిమళాలు తాజాగా అనిపిస్తాయి. భోజనాల గది, ప్రవేశ ద్వారం దగ్గర మల్లె లేదా సున్నితమైన పూల గంధాలు ఇంటికి ఆత్మీయతను జోడిస్తాయి. ఇటీవల టీ ఆధారిత సువాసనలు కూడా కొత్త ట్రెండ్‌గా నిలుస్తున్నాయి.
ఇందుకోసం ఖరీదైన ఏర్పాట్లేం అవసరం లేదు. రీడ్ డిఫ్యూజర్లు, ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్లు, సువాసన కొవ్వొత్తులు, లినెన్ స్ప్రేలు ఉపయోగించవచ్చు. సహజ పద్ధతులు ఇష్టపడేవారు తాజా పూలు, నారింజ తొకలు, దాల్చినచెక, లవంగాలను నీటిలో మరిగించి వచ్చే పరిమళాన్ని కూడా ఆస్వాదించవచ్చు. అయితే సువాసన మితంగా ఉండాలి. ఎకువైతే ఆహ్లాదం కంటే అసౌకర్యం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఇంటి అందాన్ని పరిమళం కూడా తీర్చిదిద్దుతోందన్న మాట!