ఇంటి పనుల్లో సాంకేతికత సాయం పెరుగుతున్నది. ఇప్పటివరకూ ఉన్న వాషింగ్ మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లకు.. కొత్తగా ‘ఏఐ’ కూడా జత కలుస్తున్నది. ‘రోబో వాక్యూమ్ క్లీనర్’ అవతారమెత్తి.. శ్రమ లేకుండా చెత్తనంతా ఎత్తి పారేస్తున్నది. సాధారణ వాక్యూమ్ క్లీనర్లను మనుషులే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది.
ఇంట్లో దుమ్మూధూళీ ఎక్కడ ఉంటే.. అక్కడికి వాక్యూమ్ క్లీనర్‌ను తీసుకువెళ్తే, అదే శుభ్రం చేసి పెడుతుంది. అయితే, ఇళ్లు తుడవడానికి మళ్లీ మనుషులే మాప్లు ఉపయోగించాల్సిందే! ఈ రోబో వాక్యూమ్ క్లీనర్లు అలా కాదు. ఏఐ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇంట్లో ఏ మూలన దుమ్ము, చెత్త ఉన్నా.. ఇట్టే కనిపెడతాయి. వెంటనే శుభ్రం చేసేసి.. తుడిచేస్తాయి కూడా!