సెర్చ్: ది నైనా మర్డర్ కేస్
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: కొంకణా సేన్ శర్మ, శివ్ పండిట్, సూర్య శర్మ, శ్రద్ధాదాస్, వరుణ్ ఠాకూర్,
ధృవ్ సెహగల్ తదితరులు
దర్శకత్వం: రోహన్ సిప్పీ
క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు.. క్షణక్షణానికీ అనూహ్యమైన మలుపులు తీసుకుంటాయి. ఉహించని ట్విస్టులతో ప్రేక్షకుల్లో ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇలాంటి పాజిటివ్ పాయింట్స్‌ను పెట్టుకొనే.. దర్శకులు క్రైమ్ థ్రిల్లర్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లూ తెరకెక్కిస్తున్నారు. అలా వచ్చిన మరో ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. సెర్చ్: ది నైనా మర్డర్ కేస్. జియో హాట్‌స్టార్ వేదికగా ఇటీవలే స్ట్రీమింగ్కు వచ్చింది. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్.. రికార్డు వ్యూస్ సాధిస్తూ, హిట్ టాక్ తెచ్చుకున్నది.
కేసులోకి ఎంటరైతే..
ఏసీపీ సంయుక్త దాస్ (కొంకణా సేన్ శర్మ) ముంబయి క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేస్తూ ఉంటుంది. విధులకే అంకితమై, తమతో సమయమే గడపడం లేదని.. ఆమె భర్త భీషణ్, కూతురు మహీ అసంతృప్తితో ఉంటారు. దాంతో, క్రైమ్ సెల్ నుంచి కాస్త రిలాక్స్డ్గా ఉండే వేరే పోస్టింగ్ వెళ్లేందుకు
నిర్ణయించుకుంటుంది సంయుక్త. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో ఓ కొత్త ఇంటిని కూడా తీసుకుంటుంది. మరోవైపు క్రైమ్ బ్రాంచ్‌లోని ఆమె స్థానంలోకి ఏసీపీ జై కన్వర్ (సూర్య శర్మ) వస్తాడు. సంయుక్త రిలీవ్ అవుతున్న సమయంలోనే.. వీరి ముందుకు ఒక మర్డర్ కేసు వస్తుంది. కాలేజ్ స్టూడెంట్ అయిన ‘నైనా’ అనే అమ్మాయి.. దారుణ హత్యకు గురవుతుంది. అయితే, ఆ ప్రాంతం, అక్కడి పరిస్థితులు అప్పుడే వచ్చిన ఏసీపీ జైకి పూర్తిగా కొత్త. దాంతో, నైనా కేసు కోసం మరో రెండు రోజులు అక్కడే ఉండాలని సంయుక్తకు ఉన్నతాధికారులు సూచిస్తారు. ఆమెకు తోడుగా ఉండాలని జైని ఆదేశిస్తారు.
దాంతో నైనా కేసు ఇన్వెస్టిగేషన్లోకి అడుగుపెడుతుంది సంయుక్త. హంతకులు నైనాను హత్య చేసి, డెడ్ బాడీని ఓ కారులో ఉంచి.. వర్షం నీళ్లతో నిండిన భారీ క్వారీ గుంతలోకి తోసేస్తారు. కారుతోసహా డెడ్ బాడీని కనుక్కొని బయటికి తీయిస్తుంది సంయుక్త. ఇన్వెస్టిగేషన్లో ఆ కారు.. రాజకీయాలలో ఎదగాలనుకుంటున్న తుషార్ (శివ్ పండిట్)కి చెందినదని తెలుస్తుంది. దాంతో, తుషార్‌పై సంయుక్తకు అనుమానం కలుగుతుంది. ఇక కాలేజ్‌లో ప్రేమ పేరుతో నైనాను వేధించిన స్టూడెంట్ ‘ఓజస్’పైనా సందేహం వస్తుంది. అలాగే, నైనాతో ఎక్కువగా చాటింగ్ చేసిన ప్రొఫెసర్ ‘రణధీర్’ పైనా కూడా నిఘా పెడుతుంది. అయితే, నైనా హత్యకేసు ఇన్వెస్టిగేషన్ సందర్భంగా ఏసీపీ సంయుక్తకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? విచారణలో భాగంగా ఏయే నిజాలు తెలుస్తాయి? అసలు హంతకులు ఎవరు? నైనాను ఎందుకు చంపారు? ఆమె శవాన్ని తుషార్ కారులోనే ఎందుకు జల సమాధి చేశారు? అనేది మిగతా కథ.