‘భూయాన్యధావా అరా నాభౌ సమర్పితా ఏవ మస్మిన్ సర్వం సమర్పితం…’ అని ప్రతిపాదిస్తున్నది ఛాందోగ్య ఉపనిషత్తు. శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలన్నీ ఒక బండి ఇరుసుకు ఆకులు జోడించి ఉన్నట్టు.. ప్రాణానికి అనుసంధానమై ఉన్నాయి. దీన్ని నిరూపించే ఒక సన్నివేశాన్ని చెప్పుకొందాం.
ఒకరోజు శరీరంలోని ఇంద్రియాలన్నీ సమావేశమయ్యాయి. అందులో ప్రాణం కూడా పాల్గొన్నది. ముందుగా కళ్లు మాట్లాడుతూ ‘సర్వేద్రియాణాం నయనం ప్రధానం.. అన్నారు. నేను గానీ పని చేయకపోతే శరీరం కూలిపోతుంది’ అని అన్నాయి. ‘సరే.. మీరు పని మానేయండి. చూద్దాం’ అన్నాయి మిగతా అవయవాలు. అంతే, కళ్లు కనపడటం మానేశాయి.
అందరూ ‘అయ్యో పాపం.. కళ్లు లేని కబోది..’ అంటూ జాలిపడి సాయం చేస్తున్నారు. అతనికి జీవితం ఇప్పుడే బాగుందిలే అనిపించింది. తర్వాత కాళ్లు మాట్లాడుతూ ‘మనిషికి ఎంతో అవసరమైనవి కాళ్లు. అవి లేకపోతే జీవితమే దుర్భరం’ అన్నాయి. ‘సరే మీరు పనిచేయకండి’ అన్నాయి మిగిలినవి. మర్నాటి నుంచి చూసిన వాళ్లంతా ‘అయ్యో కాళ్లు లేవు. పాపం కుంటివాడు’ అని జాలితో మూడు చక్రాల బండి ఇచ్చేవాళ్లు, ఉద్యోగం చూపించేవాళ్లు తయారయ్యారు. జీవితం కాళ్లున్నప్పటి కన్నా మెరుగే అనిపించింది. తర్వాత చెవులు, నోరు అన్నీ బయటికి వెళ్లి గమనించాయి. తేడా లేకుండా శరీరం జీవించి ఉండటం చూసి విస్తుపోయాయి. చిట్టచివర ‘నేను కూడా ఒకసారి బయటికి వెళ్లి చూస్తాను‘ అన్నది ప్రాణం.
అనుకున్నదే తడవుగా శరీరం నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నించింది. అంతే. అవయవాలన్నీ సత్తువ కోల్పోసాగాయి. ప్రాణాన్ని బయటికి పోవద్దని బతిమలాడాయి. ప్రాణం తన ప్రయత్నాన్ని విరమించగానే సమస్త ఇంద్రియాలూ క్రమంగా పుంజుకున్నాయి. దీంతో ఇంద్రియాలన్నీ ప్రాణాన్ని కొనియాడాయి. శరీరంలో ఆత్మకన్నా ఒక మెట్టు కిందుగా ఉండేది ప్రాణం. అది ఆత్మకు నీడ అనుకోవచ్చు. ఆత్మ సాక్షి మాత్రంగాను ప్రాణం చేతన శక్తిగాను ఉంటాయి. ప్రాణం నిర్విరామంగా పనిచేస్తూ ఇంద్రియాలకు అవయవాలకు అంతర్ ఇంద్రియమైన మనసుకూ శక్తినిస్తుంది. ఒక్క ప్రాణం తప్పుకొంటే.. శరీరం కుప్పకూలిపోతుంది.
-డా॥ వెలుదండ సత్యనారాయణ